బంగారు త్రయోదశి | special story to womens jewellery | Sakshi
Sakshi News home page

బంగారు త్రయోదశి

Published Mon, Oct 16 2017 11:52 PM | Last Updated on Thu, May 24 2018 2:36 PM

special story to  womens jewellery - Sakshi

ఈ రోజు బంగారం కొనుక్కుంటేఇల్లంతా సుఖసంతోషాలతో విలసిల్లుతుందని నమ్మకం. ఈ బొమ్మల్లో ఉన్న బంగారు ఆభరణాలు కొనాలంటే పెద్ద ఖర్చుతో కూడిన పనే! అయినా, గోల్డ్‌ కోసం గోళ్లు గిల్లుకుంటూ కూర్చునే బదులు కుదిరితే ఓ తులమో, తృణమో మ్యానేజ్‌ చేయాలి. హ్యాపీ ధన్‌తేరస్‌ బంగారు తల్లులందరికీ బంగారు త్రయోదశి.

ఒకప్పుడు అమ్మాయి కోసం ఒక నగ కొన్నారంటే అది ఎప్పటికీ అలాగే ఉండేది. బంగారం ఎంత ఉంది అని మాత్రమే నాటితరం బేరీజు వేసుకునేది. ఇప్పుడు ఎన్ని డిజైన్స్‌.. అవీ ఈ ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉన్నాయా లేదా అని చెక్‌ చేసుకోవడం అమ్మాయిల ఆప్షన్‌ అయ్యింది. అక్షయ తృతీయ లేదా ధన్‌తేరస్‌ అంటూ ప్రత్యేక సందర్భాలలో బంగారం కొనుగోళ్లూ పెరిగాయి. మీరూ ఈ కొనుగోళ్ల జాబితాలో ఉన్నట్లయితే.. ఎప్పటికీ ఔట్‌డేటెడ్‌ కానీ నగలు, ఈ కాలం అమ్మాయిలు ముచ్చటపడి కోరుకునే డిజైన్స్‌ గురించి మాట్లాడుకుందాం. 2017 నుంచి 2027 వరకు అంటే మరో పదేళ్లు ట్రెండ్‌లో ఉండే ఆభరణాల డిజైన్స్‌ ఇవి...

కాక్‌టెయిల్‌ రింగ్స్‌
నాటి మహారాణులు ధరించే పెద్ద పెద్ద ఉంగరాలు ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. ఇది స్ట్రీట్‌ స్టైల్‌ ట్రెండ్‌ కూడా! అంటే , బంగారమే కాకుండా రకరకాల ఎలిమెంట్స్‌తో ఈ తరహా రింగ్స్‌ అమ్మాయిల నాజూకు వేళ్లకు ఠీవిగా దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు పెళ్ళికూతురి ఆభరణాలలోనూ ఈ రింగు ప్రత్యేకంగానూ, తప్పనిసరిగానూ ఉంటోంది. మరో మాట.. ఉన్నవి పది వేళ్లే. అలాగని అన్ని వేళ్లకూ ఒకేసారి ఉన్న రింగులన్నీ పెట్టేసి షో ఆఫ్‌ చేస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. వేలికి సౌకర్యంగా, ఎప్పుడూ స్టైలిష్‌ లుక్‌తో ఆకట్టుకునే ఇలాంటి కాక్‌టెయిల్‌ రింగ్‌ని ఒక్కటి ధరిస్తే చాలు. అందుకని, మీ ఉంగరాల జాబితాలో ఈ రింగ్‌ ఉన్నదో లేదో చెక్‌ చేయండి. ఎందుకంటే మరో పదేళ్లయినా ట్రెండ్‌లో ఉండే రింగ్‌ డిజైన్‌ ఇది. వందల ఏళ్లనాటి ఈ డిజైన్‌ ఇప్పుడూ ఊపుమీద ఉన్నట్టే మరో పాతికేళ్లకైనా మళ్ళీ రిపీట్‌ అవుతూనే ఉంటుందన్నమాట.

చోకర్స్‌ అండ్‌ కాలర్స్‌
ఇది క్లియోపాత్రా నాటి స్టైల్, అంటే క్రీస్తు పూర్వం ఎప్పుడో ఓ వెలుగు వెలిగిన ఈ స్టైల్‌కి ఇప్పుడు నారీలోకం జోహార్‌ అంటోందన్నమాట. తొంభైల కాలంలో ప్లాస్టిక్‌ చోకర్స్‌ వాడకం ఎక్కువ ఉండేది. తర్వాత ఫ్యాషన్‌ జువెల్రీగా స్థిరపడి ఆ తర్వాత బంగారు డిజైన్లలో ముందువరసలోకి వచ్చి ఠీవిగా హొయలు పోతోంది.   వెండి, బ్రాస్, ఇమిటేషన్‌ జువెల్రీలోనూ ఈ చోకర్‌ జిలుగులు ఎక్కువయ్యాయి. మెటల్‌ సాలీడ్‌గా, మంచి రంగు తేలడం, స్టోన్స్‌ జిగేల్మనడం చోకర్‌ ప్రత్యేకత. లైట్‌ వెయిట్‌లోనూ వీటిని నిపుణులు తయారుచేస్తున్నారు. బంగారంలో ధర ఎక్కువ అనుకుంటే ఇమిటేషన్‌ జువెల్రీలో ఓ చొకర్‌ని మీ నగల పెట్టెలోకి చేర్చుకోవచ్చు.

చాంద్‌బాల్‌ ఇయర్‌ రింగ్స్‌
ఆకాశంలో సగం చందమామ వెలిగే అందాన్ని వర్ణించడానికి మాటలు రావు. అలాగే అర్ధచంద్రాకృతిలో ఉండే చెవి కమ్మలు, జూకాలు ధరిస్తే ఆ మోములో వెన్నెల కొత్తగా ఒదిగిపోవాల్సిందే! పెళ్ళిళ్లు, సంప్రదాయ వేడుకలకు ఇవి నిండుతనాన్ని, మోముకు చక్కదనాన్ని తీసుకువస్తున్నాయి. దీంతో అమ్మలు, అమ్మాయిల ఛాయిస్‌ చాంద్‌బాల్‌ వైపే మొగ్గుచూపుతున్నాయి. బాలీవుడ్‌ ‘రామ్‌లీలా’ సినిమాలో ప్రియాంకాచోప్రా ధరించిన ఈ డిజైన్‌ ఐదేళ్లవుతున్నా ఇంకా కొత్తగా సింగారించుకుంటూనే ఉంది.

చెవి రింగుల హంగులు
తొంభైల కాలంలో పెద్ద పెద్ద చెవి రింగులు బాగా హైలైట్‌గా ఉండేవి. ఈ ట్రెండ్‌ ఇప్పుడు మళ్లీ వచ్చింది. ఈ రింగులు కొన్ని సన్నగా, వెడల్పుగా, ట్రయాంగిల్స్, స్క్యేర్‌ యాంగిల్స్‌లో సందడి చేస్తున్నాయి. వీటిలో కొన్ని డైమండ్, సీజడ్‌ స్టోన్స్‌ పొదిగినవీ ఉంటున్నాయి. ఇవి క్యాజువల్, వెస్ట్రన్‌ పార్టీవేర్‌ డ్రెస్‌ మీదకూ హైలైట్‌ అవుతున్నాయి. ఏ టైమ్‌ అయినా స్టైలిష్‌లో మేమే ముందు అంటున్నాయి.

లేయర్డ్‌ నెక్లెస్‌.. పొడవైన హారాలు
వరుసలు వరుసలుగా ఉండే పేటల గొలుసు కూడా అమ్మమ్మల కాలం నాటి కాన్సెప్టే. అందుకే ఆల్‌టైమ్‌ పర్‌ఫెక్ట్‌ పీస్‌ ఈ లేయర్డ్‌ నెక్లెస్‌ అంటున్నారు ఆభరణాల నిపుణులు. భారతీయ ఆభరణం అంటే చాలు ఇప్పటికీ ప్రపంచంలో ఈ వరుసల పేటనే అందరికీ గుర్తుకువస్తుంది. పేటల గొలుసులో సన్నటి లేదా మందపు చెయిన్లు మూడు–నాలుగు అంతకు మించిన వరసలుగా కలిపి ఉంటాయి. కొన్నింటికి మెడ దగ్గర ఎక్కువ నిడివితో వచ్చి, అక్కణ్ణుంచి వరుసలుగా ఉండే హారాలూ ఉన్నాయి.
మీ దగ్గర ఉన్న రెండు మూడు రకాల హారాలను ఒక చిన్న అమరికతో ఒకటే హారంగా మార్చుకోవచ్చు. దీనివల్ల పాత హారాలను కొత్త డిజైన్స్‌ కోసం వదులుకున్నామే అనే బాధ కూడా ఉండదు.

చేతి పట్టీ .. మోడ్రన్‌ ఆర్మ్‌ కఫ్స్‌
ఒకప్పుడు చేతి వంకీలు పెళ్లిళ్ల సమయంలో తప్పనిసరి ఆభరణంగా ఉండేది. ఇప్పుడా ట్రెండ్‌ మారింది. మోడ్రన్‌ ఔట్‌ఫిట్‌ మీదకు ఏ పార్టీలలోనైనా ధరించడానికి అంతే మోడ్రన్‌గా గోల్డ్‌ ఆర్మ్‌ కఫ్స్‌కి ఓటేస్తోంది యంగ్‌తరంగ్‌. సింపుల్‌గా సన్నటి తీగలా ఉండే డిజైన్‌ బంగారం లేదా వెండితో లైట్‌ వెయిట్‌తో యానిమల్‌ డిజైన్స్‌ హొయలు పోతున్నాయి.

గాజులు .. బ్రేస్‌లెట్స్‌
బ్రేస్‌లెట్‌ ఆభరణం కొన్నాళ్లుగా ట్రెండ్‌లోనే ఉంది. మణికట్టు మీద అందంగా మెరిసిపోయే గాజు లేదా చెయిన్‌ లాంటి ఒక నాజూకు ఆభరణాన్ని అమ్మాయిలు తప్పనిసరిగా ఎంపిక చేసుకుంటున్నారు. వీటిలో అన్నిరకాల జెమ్‌ స్టోన్స్‌ ఉండేలా చూసుకుంటున్నారు. ఈ ఎంపిక అన్ని రకాల దుస్తులకూ నప్పుతుండటంతో కూతుళ్ల కోసం అమ్మల ఛాయిస్‌ బ్రేస్‌లెట్‌ ఎంపికే అవుతుంది.

కాలి పట్టీలు.. స్టైలిష్‌ యాంక్లెట్స్‌
పాపిటగొలుసు నుంచి పాదాలను అలంకరించే పట్టీల వరకు బంగారాన్ని నిలువెల్లా అలంకరించుకోవచ్చు. అలాగని గాడీగా కాకుండా ఒక థీమ్‌ స్టైల్‌ని మెయింటెయిన్‌ చేయాలనుకుంటున్నారు నేటి తరం అమ్మాయిలు.  ఒక కాలికి మాత్రమే అలంకరించుకునే లైట్‌వెయిట్‌ ప్రెట్టీ డిజైన్స్‌ ఎన్నో మార్కెట్లోకి వచ్చేశాయి, సన్నని యాంక్లెట్స్‌ని సరైన ఎంపికగా భావిస్తోన్న నేటì తరం వీటిలో కొత్త డిజైన్స్‌ కోసం వెదుకుతూనే ఉంది. ఇప్పటికే మీ దగ్గర ఉన్న సన్నని చైన్లను ఇలా స్టైలిష్‌ యాంక్లెట్‌ లేదా బ్రేస్‌లెట్స్‌గా చిన్న హుక్‌తో మార్చేయవచ్చు.

సంప్రదాయ మోటివ్స్‌
బంగారు ఆభరణాలలో సంప్రదాయ డిజైన్లు కూడా ఇప్పుడు అధునాతనంగా వెలిగిపోతున్నాయి. వాటిలో నెమలి, మామిడిపిందెలు, తామరపువ్వులు, రకరకాల పూసలు, దేవుళ్ల బొమ్మలూ ఉంటున్నాయి. అయితే, వీటిలోనూ అతి నాజూకైన పనితనం కనిపిస్తోంది. దీంతో ఇండియన్‌ జువెల్రీ సీన్‌లో ఓ కొత్త కదలిక వచ్చిందని చెప్పచ్చు. ఈ డిజైన్స్‌లో చాలా వరకు అటు సంప్రదాయ దుస్తులు, ఇటు ఇండో వెస్ట్రన్‌ ఔట్‌ఫిట్స్‌కి సరిగ్గా నప్పుతున్నాయి. దీంతో మోటివ్స్‌ ఆభరణాల కొనుగోలు పట్ల వనితలు మొగ్గుచూపుతున్నారు.

ఎన్నో ప్రయోగాలు
ఈ యేడాది ఆభరణాల డిజైన్‌ జిలుగుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇందుకు మోడ్రన్‌ విమెన్‌ సింపుల్‌ టేస్ట్‌కి బెస్ట్‌ మార్క్‌గా నిలుస్తున్నాయి. ధరలలోనూ, ఎంపికలోనూ ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement