
వాకింగ్ చేసేవారిని మీరెప్పుడైనా గమనించారా? కొంతమంది నింపాదిగా నడుస్తూంటే.. ఇంకొంతమంది రేపన్నది లేదేమో అన్నంత వేగంగా అడుగులేస్తూంటారు. ఎవరి స్టైల్ వారిదని అనుకుంటాంగానీ.. దీంట్లో మన ఆయుష్షును పెంచే ఓ కిటుకు ఉందంటే మాత్రం ఆశ్చర్యపోతాం. సిడ్నీ యూనివర్శిటీ శాస్త్రవత్తేలు ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ఏం చెబుతోందంటే.. నడక వేగం పెరిగినకొద్దీ.. మరణం దూరమయ్యేందుకు అవకాశాలూ ఎక్కువ అవుతాయి. సాధారణ వేగంతో నడిచే వారు అన్ని రకాల కారణాల వల్ల మరణించే అవకాశం 20 శాతం వరకూ తక్కువగా ఉంటే.. వేగంగా నడిస్తే ఈ సంఖ్య 24 కు చేరుతుంది. అయితే గుండెజబ్బులున్న వారి విషయంలో మాత్రం నింపాది నడకే మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
వయసుమీదపడ్డ వారిలోనూ దాదాపుగా ఇలాంటి ఫలితాలే కనిపించాయని ప్రొఫెసర్ ఎమ్మాన్యుల్ స్టామటాకిస్ అంటున్నారు. గంటకు అయిదు నుంచి ఏడు కిలోమీటర్ల వేగాన్ని తాము వేగంగా నడవడంగా పరిగణించామని.. అయితే ఈ వేగం వారి వారి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది కాబట్టి.. కొంచెం చెమటపట్టేంత స్థాయిలో చేసే నడకను కూడా వేగంగా నడవడటం అనుకోవచ్చునని ఆయన వివరించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా తామీ అధ్యయనం చేసినట్లు తెలిపారు. నడకను వ్యాయామంగా మార్చుకున్న వారికి వేగానికి సంబంధించిన సమాచారం కూడా అందితే మెరుగైన ఫలితాలు ఉంటాయని తాము అంచనా వేస్తున్నటుల చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment