
పగకు పొగబెడదాం...
ఆత్మీయం
కోపానికి పుట్టిన బిడ్డ పగ. ఇది చాలా ప్రమాదకరమైనది. అందుకే పగ ఉన్న మనిషిని పామున్న ఇంటితో పోల్చాడు తిక్కన మహాభారతంలో. ఎందుకంటే మనసులో ఎవరి మీద అయినా పగ ఉంటే వాళ్లు స్థిమితంగా ఉండలేరు. ఎదుటి వారిని స్థిమితంగా ఉండనివ్వరు. పగబట్టిన వారు తమ అభివృద్ధి మీద, తమ బాగు మీద దృష్టి పెట్టడం మానేసి, తాము పగబట్టిన వారిని నాశనం చేయడం కోసమే ఎదురు చూస్తుంటారు. పగ నివురుగప్పిన నిప్పులా మనిషిని నిలువెల్లా దహించి వేస్తుంది.
ఎవరి మీదనయితే పగబట్టామో, వారిని చావు దెబ్బతీయాలని, సర్వనాశనం చేయాలని ఎదురు చూస్తూ చివరకు తమకు తామే చేటు తెచ్చుకుంటారు. శాస్త్రీయమైన ఆధారాలు లేనప్పటికీ, పాము ఎవరి మీదనయితే పగబట్టిందో, నిర్ణీత గడువు లోగా ఆ పగ తీర్చుకోలేకపోతే నోటి ముందుకు వచ్చిన ఆహారాన్ని కూడా తినడం మానేసి, ఆకలితో కృంగి, కృశించి, చివరకు తలను నేలకేసి కొట్టుకుని చచ్చిపోతుందంటారు. అర్థం పర్థం లేని పగలు, ప్రతీకారాల వల్ల అవతలి వారి నిండుప్రాణాలు తీయడానికి వెనుదీయకపోవడంతోపాటు ఆత్మహాని కూడా జరుగుతుంది. అందుకే పగను ప్రేమతో... శాంతంతో... సహనంతో... క్షమతో తరిమి కొట్టాలి.