
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను వివిధ సందర్భాలలో గాజులతో విశేషంగా అలంకరిస్తారు. గత రెండేళ్లు్లగా దేవస్థానం ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. అమ్మవారి మూలవిరాట్టుతోపాటు దేవస్థాన మహామండపం ఆరో అంతస్తులో ఉన్న ఉత్సవమూర్తిని, ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల గాజులతో అలంకరిస్తారు. అమ్మవారి అలంకరణ, ఆలయ అలంకరణ, ఉత్సవమూర్తి అలంకరణకు సుమారు పది లక్షల గాజులను వినియోగిస్తారు. భక్తులతోపాటు నగరంలోని పలువురు వ్యాపారులు గాజులను విరాళంగా సమర్పిస్తారు. ఉత్సవానికి మూడు రోజుల ముందు నుంచి సేవకులు, ఆలయ సిబ్బంది గాజులను దండలుగా అమర్చి సిద్ధం చేస్తారు. ఇంద్ర కీలాద్రిపై అమ్మవారి ఆలయంతోపాటు ఉపాలయాలు, మçహామండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి ప్రత్యేకంగా గాజులతో అలంకరిస్తారు. గాజుల అలంకరణ రోజు అమ్మవారికి బంగారపు పెద్ద అంచు పట్టుచీరను ధరింపజేస్తారు.
తొలి ఏడాది ఒక రోజు మాత్రమే గాజుల అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ గాజుల అలంకరణ ఉత్సవానికి భక్తుల నుంచి మంచి స్పందన రావడంతో రెండో ఏడాది మూడు రోజుల పాటు నిర్వహించారు. ఉత్సవం ముగిసిన తర్వాత అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. సర్వదర్శనం, 100 రూపాయలు, 300 రూపాయల టికెట్ల క్యూలైన్లలో అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఈ గాజులను అందిస్తారు. ఈ గాజుల సేవలో భక్తులు స్వయంగా పాల్గొని గాజుల దండలు తయారుచేసి అమ్మకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు భక్తిపారవశ్యంలో తేలియాడతారు. ఈ అలంకరణకు అన్ని రంగుల గాజులను ఉపయోగిస్తారు.
– ఎస్.కె. సుభానీ (ఇంద్రకీలాద్రి), విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment