
దేవరగట్టులో కర్రల సమరం దృశ్యం
హొళగుంద/ఆలూరు రూరల్: దసరా సందర్భంగా బన్ని ఉత్సవంలో భాగంగా మాళ మల్లేశ్వరస్వామిని వశం చేసుకునేందుకు రక్తం చిందేలా జరిగే కర్రల సమరాన్ని ఆపాలని కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు చేస్తున్న యత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఈ సమరాన్ని ఆపాలని జిల్లా పోలీసు, అధికార యంత్రాంగం విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అధికారుల ఆంక్షలను కాదని.. సంప్రదాయానిదే పైచేయిగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామిని దక్కించుకునేందుకు పలు గ్రామాల ప్రజలు ఒకరితో ఒకరు పోటీపడుతూ కర్రల చివరన ఇనుప రింగులు తొడిగి .. బన్ని ఉత్సవం (కర్రల సమరం)లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ ఏడాది కూడా శుక్రవారం అర్ధరాత్రి బన్ని ఉత్సవం ప్రారంభం కాగా.. శనివారం ఉదయం 6.30 గంటలకు విగ్రహాలు సింహాసన కట్టకు చేరుకోవడంతో జైత్రయాత్ర ముగిసింది. కాగా, ఉత్సవాలు నిర్వహించే నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులతో పాటు దేవరగట్టు చుట్టు పక్కల గ్రామాలైన నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెరతాండా, కురుకుంద, లింగంపల్లితో పాటు దాదాపు 15 గ్రామాలకు చెందిన భక్తులు ఉత్సవంలో పాల్గొని మొగలాయి ఆడారు.
కల్యాణోత్సవం అనంతరం నిర్వహించిన జైత్రయాత్రలో కర్రలు, దివిటీలు తగిలి భక్తుల తలలకు గాయాలయ్యాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ప్రాథమిక చికిత్స అందించి కర్నూలు, ఆదోని, బళ్లారి ఆస్పత్రులకు రెఫర్ చేశారు. దాదాపు 60 మంది భక్తులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బన్ని ఉత్సవాన్ని తిలకించేందుకు కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణ నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment