Kanakadurgadevi
-
గాజులతో విశేష అలంకరణ
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను వివిధ సందర్భాలలో గాజులతో విశేషంగా అలంకరిస్తారు. గత రెండేళ్లు్లగా దేవస్థానం ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. అమ్మవారి మూలవిరాట్టుతోపాటు దేవస్థాన మహామండపం ఆరో అంతస్తులో ఉన్న ఉత్సవమూర్తిని, ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల గాజులతో అలంకరిస్తారు. అమ్మవారి అలంకరణ, ఆలయ అలంకరణ, ఉత్సవమూర్తి అలంకరణకు సుమారు పది లక్షల గాజులను వినియోగిస్తారు. భక్తులతోపాటు నగరంలోని పలువురు వ్యాపారులు గాజులను విరాళంగా సమర్పిస్తారు. ఉత్సవానికి మూడు రోజుల ముందు నుంచి సేవకులు, ఆలయ సిబ్బంది గాజులను దండలుగా అమర్చి సిద్ధం చేస్తారు. ఇంద్ర కీలాద్రిపై అమ్మవారి ఆలయంతోపాటు ఉపాలయాలు, మçహామండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి ప్రత్యేకంగా గాజులతో అలంకరిస్తారు. గాజుల అలంకరణ రోజు అమ్మవారికి బంగారపు పెద్ద అంచు పట్టుచీరను ధరింపజేస్తారు. తొలి ఏడాది ఒక రోజు మాత్రమే గాజుల అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ గాజుల అలంకరణ ఉత్సవానికి భక్తుల నుంచి మంచి స్పందన రావడంతో రెండో ఏడాది మూడు రోజుల పాటు నిర్వహించారు. ఉత్సవం ముగిసిన తర్వాత అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. సర్వదర్శనం, 100 రూపాయలు, 300 రూపాయల టికెట్ల క్యూలైన్లలో అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఈ గాజులను అందిస్తారు. ఈ గాజుల సేవలో భక్తులు స్వయంగా పాల్గొని గాజుల దండలు తయారుచేసి అమ్మకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు భక్తిపారవశ్యంలో తేలియాడతారు. ఈ అలంకరణకు అన్ని రంగుల గాజులను ఉపయోగిస్తారు. – ఎస్.కె. సుభానీ (ఇంద్రకీలాద్రి), విజయవాడ -
10వ రోజు (మహర్నవమి) అలంకారం మహిషాసుర మర్దిని
ఇంద్రకీలాద్రి పర్వతంపైన వెలసిన కనకదుర్గాదేవి ఈరోజు మహర్నవమి సందర్భంగా మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తుంది. బ్రహ్మ వరప్రసాదం చేత అరివీర భయంకరుడై ముల్లోకాలనూ గడగడలాడిస్తున్న మహిషాసురుణ్ణి సంహరించడానికి ముక్కోటి దేవతలనూ, మూడులోకాలనూ కాపాడేందుకు ముక్కోటి దేవతల ఆయుధ తేజస్సును గ్రహించి మహాశక్తి స్వరూపిణిగా అవతరించి మహిషాసురుణ్ణి సంహరించినట్టుగా పురాణాలు తెలుపుతున్నాయి. లోకకంటకులైన ఎందరో రాక్షసులను సంహరించిన మహిషాసురమర్దిని అలంకరణలో దుర్గాదేవిని దర్శిస్తే అమ్మ అనుగ్రహంతో గ్రహబాధలు తొలగుతాయని ప్రతీతి. శ్లోకం: దుర్గేస్మృతా హరసిభీతిమశేష జంతో స్వస్థైః స్మతామతి మతీం శుభాం దదాసి దారిద్య్ర దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా భావం: అమ్మా! నీ స్మరణ మాత్రం చేత మా భీతి భయాలను తొలగించి శుభాలను కలిగించి దారిద్య్రాన్ని, దుఃఖాలను కరుణతో తొలగిస్తూ తల్లిగా లాలించి పాలించే ఓ కరుణామయీ నిన్ను ఆర్ద్రతతో వేడుకుంటున్నాను. నివేదన: నువ్వులు, బెల్లమన్నం ఫలమ్: దీర్ఘరోగాలనుండి విముక్తులవుతారు. వ్యాపార లావాదేవీలయందు చిక్కులు తొలగిపోతాయి. - దేశపతి అనంత శర్మ -
స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవి
విజయాలను ప్రసాదించే విజయవాడ కనకదుర్గాదేవి ఆలయంలో ప్రతియేడూ ఆశ్వయుజ శుద్ధ ప్రతిపద అంటే పాడ్యమినుండి విజయదశమి వరకు వైభవంగా శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించటం ఆనవాయితీ. ఈ సందర్భంగా ప్రతిరోజూ అమ్మవారి అలంకార విశేషాలు, పఠించవలసిన శ్లోకం, చేయవలసిన నివేదన, చేయడం వల్ల కలిగే ఫలాలు సాక్షి ఫ్యామిలీ పాఠకులకోసం రోజూ ప్రత్యేకంగా... మొదటిరోజు - స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవి శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా మొదటిరోజు శనివారం అమ్మవారు శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి (శైలపుత్రి)గా దర్శనమిస్తుంది. అమ్మవారిని బంగారు కవచాలతో, ఎరుపురంగు చీరతో అలంకరిస్తారు. నివేదన: ఆవునేతితో చేసిన పొంగలి ఈరోజు పఠించవలసిన శ్లోకం సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతితే! యాని చాత్యుర్థ ఘోరాణి తై ర్మాస్మాంస్తథా భువమ్ భావం: ఓ జననీ! ముల్లోకాలయందు సంచరిస్తుండే నీ సాత్త్విక రూపాలతో మిక్కిలి భయంకరమైన స్వరూపాలతో మమ్మల్ని, ఈ సమస్త భూమండలాన్ని కాపాడు! ఫలమ్: ఇంటిలో ఉన్న చిక్కులు తొలగి, శక్తి, సంపదలు కలుగుతాయి. - దేశపతి అనంత శర్మ, పురోహితులు