శ్రీ రామకృష్ణ పరమహంస సేవలో, శిష్యరికంలో ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చేరిన గృహస్థు నాగ మహాశయుడు. వైద్యుడైన ఆయన తన వద్దకు వచ్చే నిరుపేద రోగులకు ఉచితంగా మందులిచ్చి సేవచేయడమేగాక, పథ్యపానీయాలకు సరిపడ డబ్బును కూడా తానే సమకూర్చేవాడు. అవధూతలా జీవించిన నాగమహాశయులు ఒకసారి కలకత్తా నుంచి స్వగ్రామం వెళ్లారు. ఆ రోజు ఏదో పర్వదినం. ఇలాంటి పర్వదినాన కలకత్తాలో ఉండి కూడా పవిత్రమైన గంగలో స్నానం చేయకుండా వచ్చేసినందుకు తండ్రి ఆయన్ని మందలించాడు. అందుకు నాగమహాశయులు ‘‘తండ్రీ! గంగ కలకత్తాలోనే కాదు... అన్నిచోట్లా ఉంది. భగవదనుగ్రహం ఉంటే, మనం ఉన్నచోటే మనం గంగాస్నానం చేయవచ్చు’’ అని జవాబిచ్చాడు. అంతలోనే ఒక అద్భుతం జరిగింది.
నాగమహాశయులు స్నానం చేయడానికి వెళుతున్నారు.. అప్పుడు పెరట్లో ఒకచోట చిమ్మిన గొట్టంలోనుంచి వస్తున్నట్లుగా నీరు పైకి ఎగజిమ్ముతూ వచ్చి ఆ ఆవరణమంతా జలమయం అయిపోయింది. భగవదనుగ్రహం జలప్రవాహంలా ప్రవహించి, తన నమ్మకాన్ని నిలబెట్టినందుకు నాగమహాశయుడు పొంగిపోయి, భావోద్రేకంతో ‘‘స్వాగతం గంగామాతా! స్వాగతం! మమ్మల్నందరినీ పావనం చెయ్యి తల్లీ’’ అని అరిచాడు. ఆయన తండ్రి, ఇరుగు పొరుగు వారందరూ ఆ పవిత్ర గంగాజలాలలో స్నానం చేసి, గంగాస్నానం చేసిన అనుభూతికి లోనయ్యారు. దైవకృప... దేవుని పట్ల ప్రగాఢ విశ్వాసం ఉంటే ఇలానే జరుగుతుంది మరి.
Comments
Please login to add a commentAdd a comment