శ్రీమంతుడు... శ్రీరాములు!
రూరల్ హీరోస్
స్థోమత చిన్నదైనా... మనసు దొడ్డది అని శ్రీరాములు గురించి తెలిసిన ప్రతి ఒక్కరు అంటుంటారు. అయితే తన ఆశయాన్ని అందరూ మెచ్చుకుంటున్నా తను చూపిన బాటలో నడిచేందుకు మాత్రం అంతా వెనుకడుగు వేస్తుండడమే ఆయనను బాధిస్తుంటుంది. సన్మానాలు వద్దు...ప్రశంసలు వద్దు. కటిక పేదవాడు సైతం కాస్త గౌరవంగా బతకాలి. అలా కావాలంటే అవసరాలను అదుపులో పెట్టుకొని రాయితీలకు స్వస్తి చెప్పేందుకు ముందుకు రావాలంటూ పిలుపునిస్తున్నారు శ్రీరాములు. ఎవరీ శ్రీరాములు?
పాలడుగు శ్రీరాములు స్వగ్రామం ప్రకాశం జిల్లా చీమకుర్తి.
1939లో ఏడుగురు సంతానంలో ఒకరిగా జన్మించారు. కటిక దారిద్య్రంలో పుట్టిన ఆయన ఫిఫ్త్‌ఫారం వరకు మాత్రమే చదువుకున్నారు. 1955లో సైన్యంలో చేరారు. మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ సెంటర్ (ఎంఈజీ సెంటర్)లో సేవలు ప్రారంభించారు. 18 సంవత్సరాలపాటు సేవలు అందించి, నాయక్ హోదాలో రిటైర్ అయ్యారు. 1961లో గోవా యుద్ధంలో, 1962లో చైనా-ఇండియా యుద్ధంలో, 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో, 1971లో బంగ్లా-పాక్ యుద్ధంలో భారత్ తరఫున సేవలు అందించారు. 1973లో సైన్యం నుంచి రిటైరయ్యారు. మరుసటి సంవత్సరంలో ఆయనకు విజయవాడ టెలిగ్రాఫ్ ఆఫీసులో మెసెంజర్‌గా ఉద్యోగం లభించింది. రెండు నెలల తర్వాత బదిలీపై ఒంగోలులో సేవలు కొనసాగించి 1999 డిసెంబర్‌లో ఉద్యోగ విరమణ చేశారు.
‘గివ్ ఇట్ అప్’
సైన్యంలో చేరిన శ్రీరాములు తొలిసారిగా క్యాంటీన్‌కు భోజనానికి వెళ్లారు. పళ్లెంలో మటన్ కర్రీ. ఒక వైపు నోరూరుతుండగానే మరో వైపు కళ్లనిండా నీళ్లు తిరిగాయి. కారణం కమ్మని భోజనం కళ్లముందు కనిపించగానే కటిక దారిద్య్రం అనుభవిస్తున్న తన కుటుంబ సభ్యులు కళ్లముందు మెదలడమే. దీంతో ఆయన ‘గివ్ ఇట్ అప్’ పథకాన్ని ఆనాడే ఎంచుకున్నారు. 1965లో పాకిస్థాన్‌తో యుద్ధ సమయంలో నాటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి... ప్రతి పౌరుడు వారానికి ఒక పూట భోజనాన్ని మానుకొని ఆహార కొరతను నివారించేందుకు ముందుకు రావాలని కోరడంతో స్పందించి నాటి నుంచి వారానికి ఒకపూట భోజనం మానేయడం ప్రారంభించారు. అలా మిగిల్చిన మొత్తాన్ని ప్రకృతి వైపరీత్యాల నిధికి విరాళంగా పంపించడం ప్రారంభించారు.
గివ్‌ఇట్‌ఆప్‌లో శ్రీరాములు వదులుకున్నవి మాజీ సైనికులకు రాయితీపై సరుకులు తీసుకునేందుకు మిలటరీ క్యాంటీన్ కార్డు ఇస్తారు. దేశంలో చాలామంది కనీసం తిండి లేకుండా జీవిస్తున్నారని, కనుక తనకు క్యాంటీన్ కార్డు అనవసరం అంటూ ఇప్పటివరకు ఆయన ఆ సౌకర్యాన్ని పొందేందుకు ఇష్టపడలేదు.
ఇప్పటివరకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోలేదు. సైనికులు రిటైర్ అయితే వారి కుటుంబానికి 2.5 ఎకరాల మాగాణి, లేదా 5 ఎకరాల మెట్టభూమి లేదా 30 గదుల ఇంటి స్థలం ఇస్తారు. వాటినీ కాదనుకున్నారు.తనకు ఇద్దరు కుమారులు ఉన్నా వారికి కూడా ఇప్పటివరకు కనీసం మాజీ సైనికుల కోటా కింద రిజర్వేషన్ పొందలేదు.ఇన్ని చేసి కూడా ఇటీవల మన ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపునకూ స్పందించి ఒంగోలు విజయ ఎలక్ట్రానిక్స్‌లో తనకు ఉన్న గ్యాస్ కనెక్షన్ నెంబర్ 7015865 ను వదులుకున్నారు. అంతే కాకుండా, తనకు మాజీ సైనికునిగా, టెలిగ్రాఫ్ కార్యాలయంలో పనిచేసి రిటైరైనందును వస్తున్న రెండు పెన్షన్లలో ఒకటి మాత్రమే తన కుటుంబానికి చాలంటూ నెలకు రూ. 8 వేలు పెన్షన్‌ను స్వచ్ఛందంగా వదులుకున్నారు.
ఈ విషయాలపై ఆయనను కదిలిస్తే ఆయన మాట్లాడేది ఒక్కటే. వ్యక్తి ప్రచారం కన్నా...ఆశయం ప్రచారం కావాలి. బతకడానికి డబ్బు అవసరమే అని సింపుల్‌గా చెబుతుంటారు. అందుకే ఆర్థికంగా శ్రీమంతుడు కాలేకపోయినా ఈయన ఆశయంలో శ్రీమంతుడే.
- సాక్షి, ఒంగోలు