ఒక ఉద్యోగానికి వెళ్లి వస్తేనే ప్రాణం సొమ్మసిల్లుతుంది. కుటుంబం ఆర్థికంగా సొమ్మసిల్లకుండా ఉండేందుకు తన బతుకు బోగీని రైలు బండికి తగిలించి దీపిక అనేక ఉద్యోగాలను చేస్తున్నారు! స్టాండప్ కమెడియన్‌గా కష్టాలకు కితకితలు పెడుతున్నారు.
ముంబైలో లోకల్ ట్రైన్‌లు నిరంతరం సందడిగా ఉంటాయి. సందడి అంటే ‘రద్దీ’గా అని కాదు. ఆ ట్రైన్‌లలో ప్రతిరోజూ ఉద్యోగాలకు వెళ్లేవాళ్లు పనిలోపనిగా ప్రయాణంలో పెళ్లి సంబంధాలు మాట్లాడుకోవడం, కూరలు కట్ చేయడం, ప్లేయింగ్ కార్డ్స్ ఆడటం.. అదో చిన్న ప్రపంచం. వీటితో పాటు వస్తు విక్రయాలూ జోరుగానే సాగుతాయి. కష్టపడి పనిచేసుకునేవారికైతే ఈ ట్రైన్‌లలో లోటే ఉండదు. మరికొందరు మంచి మాట తీరుతో జోరుగా అమ్మకాలు సాగిస్తుంటారు. అలాంటి వారిలో 45 ఏళ్ల దీపికా మాత్రే ఒకరు. ప్రయాణికులతో ఆమె ఎంతో ఆప్యాయంగా, సరదాగా మాట్లాడుతూ ఇమిటేషన్ జ్యూయలరీని అమ్ముతుంటారు. అయితే దీపిక దైనందిన జీవితంలో ఇదొక్కటే వ్యాపకం కాదు. దీపిక గురించి తెలిసి, ఆమెతో ఫోనులో సంభాషించినప్పుడు ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు.
ఉదయం ట్రైన్‌లో గంట సేపు
నాకు ముగ్గురు ఆడ పిల్లలు. నా భర్త అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. నేను ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచి, ఐదున్నరలోగా ఇంటి పని పూర్తి చేసుకుని, రెండు బ్యాగుల నిండా ఇమిటేషన్ జ్యూయలరీ సర్దుకుని, లోకల్ ట్రైన్ ఎక్కేస్తాను. ముంబైలో కొన్ని లక్షల మంది ప్రతిరోజూ తెల్లవారుజామునే ప్రయాణిస్తారు. వారికి విడిగా షాపింగ్ చేసుకునే తీరిక ఉండదు. అటువంటి వారికి నా దగ్గర కొనడం వల్ల చాలా సమయం సేవ్ అవుతుంది. అందరిలాగే ఎక్కువ ధర చెప్పి, వారు అడిగిన ధరలకు ఇస్తుంటాను. అలా ఇస్తే, వారు కావలసిన ధరకు కొనుక్కున్న ఆనందం పొందుతారు. అయితే ప్రతిరోజూ ఈ బేరాలు చేస్తూ సమయం వృథా చేసుకోవడం ఎందుకు అనుకున్నాను. ఒక ఆలోచన తట్టింది. నగల మీద ధరల స్టికర్ వేసేశాను. బేరం అడగడం మానేశారు. దాని మీద ఉన్న ధర చూసి డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇలా వాటిని అమ్ముకుంటూ, ఆరున్నరకల్లా మలాడ్ స్టాపులో రైలు దిగేస్తాను.
మధ్యాహ్నం వరకు వంట పని
గిల్టు నగలు అమ్మితే వచ్చిన డబ్బుతో కుటుంబం నడవదు కదా. అందుకే ఐదుగురి ఇళ్లలో వంట పని చేస్తున్నాను. మధ్యాహ్నం దాకా ఆ పనితోనే సరిపోతుంది. అక్కడ పనులు ముగించుకుని, మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి వస్తాను. భోజనం చేసి, కాసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం నాలుగు గంటలకు స్టాండప్ కామెడీ షోలు చేస్తున్నాను. రాత్రి ఎనిమిది గంటలకు ఇల్లు చేరుకుంటాను. ఇది నా దినచర్య.
నగలు అమ్ముతూనే కామెడీ
కుటుంబ పోషణం కోసం నేను ఇన్ని పనులు చేస్తున్నానని, ఎన్నడూ బాధపడలేదు. నా కుటుంబానికి నేనే ఆధారం అనే ఆలోచనే నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. మేం నివసించే ‘నాలా సోపారా’ నుంచి ‘మలాడ్’ వరకు అనునిత్యం ట్రైన్‌లలో ప్రయాణిస్తుంటాను. జ్యూయలరీ అమ్మకాలతో పాటు అప్పుడప్పుడు స్టాండప్ కామెడీ షోలు చేస్తూ అందరికీ ఆనందం కలిగిస్తుంటాను. గ్రామీణ వాతావరణంలో పెరిగిన నేను నా జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాను. అన్నిటినీ చిరునవ్వుతో ఎదుర్కొన్నాను. ఆ అనుభవాలు ఈ కామెడీ షోలు ఇవ్వడంలో పనికొస్తున్నాయి.
జీవితమే జోక్స్ చెప్పిస్తోంది
వయసు మీద పడుతోంది. దానికి తోడు డయాబెటిస్ కూడా వచ్చింది. ఇంటి పనులతో పాటు కామెడీ షోలు చేయలేకపోతున్నాను. అయినా ధైర్యం విడిచిపెట్టకుండా, షోలు చేస్తూనే ఉన్నాను. చాలామంది కమెడియన్లు భార్యాభర్తల గురించి జోక్‌గా చెబుతుంటారు. ఇప్పుడు అలాంటివి నేను చెబుతున్నాను. నా జీవితంలో తారసపడిన సంఘటనలను హాస్యరూపంలో ప్రదర్శనలు ఇస్తున్నాను. నేను నటిస్తున్నంతసేపు ప్రేక్షకులను చూసి నవ్వుతూ ఉంటాను. నా పంచ్‌లకు ప్రతిస్పందన వచ్చేవరకు నిరీక్షిస్తాను. నా అదృష్టం ఏమిటంటే, ఈ షోలు మొదలుపెట్టిన నాటి నుంచి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతూనే ఉన్నాను.
సంగీతా మేడమ్ వల్లే..!
ఇళ్లలో వంట పనిచేయడం నుంచి, స్టాండప్ కమెడియన్‌గా ఎలా మారానా అని చాలామందికి సందేహం. వాస్తవానికి నేను వంట పనులు మానలేదు. అవి చేస్తూనే, లోకల్ ట్రైన్‌లలో నగలు అమ్ముతూనే ఉన్నాను. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే, నేను వంట చేస్తున్న ఇంటివారు నాతో స్నేహపూర్వకంగా ఉంటున్నారు. నేను వంట చేస్తున్న సంగీత మేడమ్, నా కోసం ఒక టాలెంట్ షో ఏర్పాటు చేశారు. ఈ మాత్రం సహాయం కూడా చేయని రోజులు ఇవి. కాని ఆవిడ నా టాలెంట్‌ని చూపడానికి ఒక వేదిక ఏర్పాటు చేశారు. నేను నా జోకులను ప్రదర్శించడం ప్రారంభించాను. అలా నెమ్మదిగా చిన్న చిన్న ప్రదేశాలలో, రైళ్లలో ఈ ప్రదర్శనలు ఇస్తూ, ఏడాది క్రితం స్టేజీ మీద కామెడీ షో చేశాను ఈ కార్యక్రమానికి వచ్చిన ‘రచేల్ లోపెజ్’ అనే ఒక జర్నలిస్టు, నాకు మంచి భవిష్యత్తు ఉందని నన్ను ప్రశంసించారు. అప్పటికే సుపరిచితురాలైన అదితి మిట్టల్ అనే యాంకర్‌ను రేచల్ పరిచయం చేశారు నాకు. వీరిద్దరినీ సంగీత మేడమ్ ఇంట్లోనే కలిశాను. అప్పుడే రచేల్ నన్ను ‘నువ్వు ప్రొఫెషనల్‌గా మారతావా’ అని అడిగారు. నేను ఎన్నడూ పెద్ద స్టేజీ మీద ప్రదర్శన ఇవ్వలేదు. అందువల్ల అదితి నా మెంటర్‌గా ఉండి, నా ప్రదర్శన ఏర్పాటుచేశారు, ‘బ్యాడ్ గర్ల్’ పేరున మేం ఒక ప్రదర్శన ఇచ్చాం.
కొన్ని ఇళ్లలో వేరుగా చూస్తారు
సంగీత మేడమ్‌లా చేయూత ఇచ్చేవారు ఒకరో ఇద్దరో ఉంటారు. ఇప్పటికీ నేను వంట పనులు చేస్తూనే ఉన్నాను. కొందరు మేడమ్స్ నన్ను ఇంకా పనిమనిషిగానే చూస్తున్నారు. వారు నన్ను కుర్చీలో కూర్చోనివ్వరు. నేల మీద కూర్చోవాలి. ప్రత్యేకమైన గ్లాసులలో మంచినీళ్లు, టీ ఇస్తారు. అవేవీ నేను పట్టించుకోను. నా పని మీద దృష్టి పెట్టి, పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిపోతాను. మేం పనిచేస్తున్న బిల్డింగ్‌లో నా వంటివారిని కొంచెం దూరంగా చూస్తారు. మాకు ప్రత్యేకమైన లిఫ్ట్ ఉంటుంది. మాకు ఇచ్చే వస్తువులన్నీ విడిగానే ఉంచుతారు. పనివారంతా వేరే లిఫ్ట్‌లో వెళ్లాలని రూల్ కూడా ఉంది. మా పాత్రలను కూడా దూరంగా ఉంచాలి. చిత్రం ఏమిటంటే, మేం చేసిన రోటీలు చక్కగా తింటారు. ఇదంతా షోలో చెబుతున్నప్పుడు ప్రేక్షకులంతా చప్పట్లు కొడతారు. నేను చెప్పేవి జోకులే కాని అన్నీ వాస్తవాలే. అయితే ఇవి ఏవీ ఇతరులను నొప్పించేవిగా ఉండవు. వారి పనుల గురించి వారు ముచ్చటించుకున్నట్లుగానే ఉంటాయి’’ అంటారు దీపిక.ప్రస్తుతం దీపిక షోలన్నీ ఉచితంగానే చేస్తున్నారు. తనకు ఎంతోకొంత ఆర్థిక సహాయం అందితే తన జీవితం బాగుంటుంది అంటున్నారు. దీపికతో మాట్లాడినంతసేపు ఆమె మాటల్లో బాధ కాని, నిట్టూర్పు కాని వినిపించలేదు. తన పని గురించి ఎంతో గర్వంగా భావిస్తున్నట్టుగానే అనిపించింది. ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది.
ఎలా అమ్మాలో తెలిసేది కాదు
నా భర్త ఆస్తమాతో బాధపడుతున్నారు. ఇప్పుడు నాకు హై బ్లడ్ సుగర్ వచ్చింది. అందువల్ల మేం ఇద్దరమూ పని చేసే స్థితిలో లేము. మా పెద్దమ్మాయి ‘మిడ్ డే’ వారు చేసిన ఇంటర్వ్యూలో ఉద్యోగానికి అర్హత సంపాదించింది. నాకు ఓపిక ఉన్నంతవరకు వేదికల మీద అందరినీ నవ్విస్తూనే ఉంటాను. మొదట్లో నాకు గిల్టు నగలు అమ్మకం చేత కాదు, అవసరమే నాకు అన్నీ నేర్పింది. ఇలాగే మిగతావీ నేర్చుకుంటాను.
– దీపికా మాత్రే
– సంభాషణ: వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment