తప్పు తనది కాదు మిలార్డ్‌! | starring Kangana Ranaut in the titular role | Sakshi
Sakshi News home page

తప్పు తనది కాదు మిలార్డ్‌!

Published Sat, Sep 16 2017 12:19 AM | Last Updated on Tue, Sep 19 2017 4:36 PM

కంగనా రనౌత్‌:  కౌర్‌ పాత్రధారి

కంగనా రనౌత్‌: కౌర్‌ పాత్రధారి

కౌర్‌ కథా చిత్రం

అమ్మ, నాన్న పట్టించుకోకపోతే పిల్లలు ఏమౌతారు? క్రిమినల్స్‌ అవుతారు. సినిమాకు కథ కూడా  అవుతారు. సందీప్‌ కౌర్‌ ప్రస్తుతం యు.ఎస్‌.జైల్లో ఉంది. కోర్టు ఆమెకు విధించిన 66 నెలల శిక్ష పూర్తయ్యే వరకు కౌర్‌కు మరో లైఫ్‌ లేదు. ఆమె చేసిన నేరం.. బ్యాంక్‌ రాబరీ. ఆమె తల్లిదండ్రులు చేసిన నేరం.. ఆమెను పట్టించుకోకపోవడం. మరీ ఎక్కువగా పట్టించుకోవడం కూడా పట్టించుకోకపోవడమే.

చండీఘర్‌లోని ఒక చక్కటి సంప్రదాయ కుటుంబంలో 1989 నవంబర్‌ 11న పుట్టింది కౌర్‌. ఏడేళ్ల వయసులో తల్లి, తమ్ముడు, ఆ పిల్ల.. యు.ఎస్‌. వెళ్లిపోయారు. కౌర్‌ తండ్రికి అక్కడ ఉద్యోగం. నో మొబైల్స్, నో టెలివిజన్, నో ఫ్రెండ్స్‌ అని ముందే చెప్పేశాడు పిల్లలిద్దరికీ. అలా ఈ అక్కాతమ్ముడు సొంత ఇంట్లోనే ఒంటరివారైపోయారు. 2001లో ట్విన్‌ టవర్స్‌పై  దాడుల తర్వాత స్కూల్లోనూ ఒంటరివారయ్యారు. అంతా అనుమానంగా చూసేవారు.. వీళ్లేదో ఆ ఉగ్రవాదుల పిల్లలన్నట్లు! అవమానాలు భరించలేక ఇద్దరూ స్కూల్‌ మానేశారు.

షేర్లు
కౌర్‌కి 14 ఏళ్లు వచ్చాయి. ఓ రోజు తల్లి జబ్బున పడితే హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ తన తల్లికి నర్సులు ప్రేమగా సేవలు అందించడం చూసి, తను కూడా నర్స్‌ అవ్వాలని కౌర్‌ నిర్ణయించుకుంది. నర్సింగ్‌ కోర్సులో చేరింది. 19 ఏళ్లకు నర్సింగ్‌ లైసెన్స్‌ సంపాదించింది. ఆ తర్వాత కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటోలో నర్సింగ్‌ డిగ్రీ కోర్సులో చేరింది. ఆ సమయంలోనే స్టాక్‌ మార్కెట్‌లో డబ్బుని ఇన్వెస్ట్‌ చేసింది. ఎవరో చెప్పారు, షేర్ల ధర పెరిగితే లైఫ్‌ టర్న్‌ అవుతుందని. తక్కువ ధరలో ఉన్నప్పుడు కౌర్‌ కొన్న షేర్లు ఊహించని విధంగా పెరిగాయి. వెంటనే వాటిని అమ్మేసింది. కౌర్‌కు వచ్చిన లాభం 2 లక్షల డాలర్లు. ఇండియన్‌ కరెన్సీలో సుమారు ఒక కోటీ పాతిక లక్షల రూపాయలు!

గ్యాంబ్లింగ్‌
21వ బర్త్‌డే అంటే యు.ఎస్‌.కల్చర్‌లో.. వెరీ స్పెషల్‌ బర్త్‌డే. ఇరవై ఒక్క ఏళ్ల వయసులో కౌర్‌కు అది ఇంకా స్పెషల్‌ బర్త్‌డే. అప్పటికే కోటీశ్వరురాలు మరి! అమన్‌దీప్‌ కౌర్‌ కజిన్‌. అతడు బర్త్‌డే పార్టీకి వచ్చి, విషెస్‌ చెప్పి, కేక్‌ తినిపించి మరీ ఓ ఐడియా చెప్పాడు. ‘‘లాస్‌ వెగాస్‌ వెళ్దాం. అక్కడే కేసినోలు ఉంటాయి. ఒక ఆట ఆడితే జీవితానికి సరిపడా డబ్బు వచ్చేస్తుంది’’ అని అన్నాడు. నిజానికి అప్పటికే ఆ అమ్మాయి దగ్గర జీవితానికి సరిపడా డబ్బు ఉంది. కానీ ఇంకా కావాలని కోరుకుంది. తొలి జూదంలో కౌర్‌ 4 వేల డాలర్లు కొట్టేసింది! అది కిక్‌ ఇచ్చింది. డబ్బు పెట్టడం మొదలు పెట్టింది. దబ్బు వస్తోంది, పోతోంది. వస్తోంది. పోతోంది. చివరికి అంతా పోయింది. మిగిలింది.. ‘లక్కీ గ్యాంబ్లర్‌’ అన్న పేరొక్కటే. ‘‘లక్కీ గ్యాంబ్లర్‌కు ఒక్కోసారి ఇలానే జరుగుతుంది. మళ్లీ పెట్టండి. మళ్లీ వస్తుంది’’ అని తోటి జూదగాళ్లు మంట రాజేశారు. ఎక్కడి నుంచి వస్తుంది మళ్లీ పెట్టడానికి? అప్పు చేసింది కౌర్‌. అదీ పోయింది! అప్పులవాళ్లు వెంటపడ్డారు. అడ్రస్‌ మార్చేసింది. తను ఉంటున్న కాలిఫోర్నియా స్టేట్‌లోనే.. వెగాస్‌ నుంచి యూనియన్‌ సిటీకీ గుట్టు చప్పుడు కాకుండా మారిపోయింది. అప్పుల్ని ఎగ్గొట్టడం ఆమె ఉద్దేశం కాదు. కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో అప్పులన్నీ తీర్చేయాలనుకుంది. అందుకోసం నర్సుగా చేరింది. ఓవర్‌ టైమ్‌ డ్యూటీ చేస్తోంది.

రాబరీ
ఓ రోజు అకస్మాత్తుగా ఇద్దరు ఆగంతకులు దారి కాచి కౌర్‌ను అటకాయించారు. ‘‘నువ్వు కట్టాల్సిన 35 వేల డాలర్లను రెండురోజుల్లో కట్టకపోతే నీ అంతుచూస్తాం’’ అన్నారు. ‘‘నేను కట్టలేను’’ అంది కౌర్‌. ‘‘మాకు అనవసరం. బ్యాంకు దోపిడీ చేస్తావో, ఇళ్లలో దొంగతనాలు చేస్తావో.. ఏదైనా చేసి డబ్బు తెచ్చివ్వు’’ అన్నారు. ఓ గన్‌ కూడా ఆమె చేతిలో పెట్టబోయారు. కౌర్‌ ఉలిక్కిపడి, చెయ్యి వెనక్కు లాగేసుకుంది. కానీ విధి ఆమెను ముందుకు తోసింది. సరిగ్గా వారం తర్వాత ‘బ్యాంక్‌ ఆఫ్‌ వెస్ట్‌’లో రాబరీ జరిగింది. అది కౌర్‌ చేసిన రాబరీ. 21,200 డాలర్లను కొల్లగొట్టి ఎస్కేప్‌ అయింది. తర్వాత ఒక బ్యాంకులో 1,978 డాలర్లు, ఇంకో బ్యాంకులో 8 వేల డాలర్లు దోచుకుంది. చివరికి సెయింట్‌ జార్జి సిటీలోని యు.ఎస్‌.బ్యాంక్‌లో దోపిడీ చేస్తూ పోలీసులకు పట్టుబడింది.

కౌర్‌కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2 లక్షల 50 వేల డాలర్ల ఫైన్‌ కట్టమంది. ‘‘తను ఒక్క డాలర్‌ కూడా కట్టలేదు మిలార్డ్‌’’ అన్నాడు ఆమె లాయర్‌. అంతే కాదు, ‘తనకు అన్నేళ్ల జైలు శిక్ష వెయ్యడం కూడా న్యాయం కాదు మిలార్డ్‌’’ అన్నాడు. న్యాయమూర్తి భృకుటి ముడిచాడు. ‘‘ఏ?’’ అన్నాడు. ‘‘మీలార్డ్‌.. కౌర్‌ అమ్మానాన్న ఆ అమ్మాయిని పట్టించుకోలేదు. ఆమె పెంపకం సరిగా జరగలేదు’’ అని చెప్పాడు లాయర్‌. జడ్జి కన్విన్స్‌ అయ్యాడు. శిక్షాకాలాన్ని 66 నెలలకు తగ్గించాడు. అంటే ఐదేళ్లా ఆరునెలలు. అమ్మ, నాన్న పట్టించుకోకపోతే పిల్లలు ఏమౌతారు? క్రిమినల్స్‌ అవుతారు. సినిమాకు కథ కూడా అవుతారు. నిన్న రిలీజ్‌ అయిన బాలీవుడ్‌ చిత్రం ‘సిమ్రాన్‌’.. కౌర్‌ కథే. అందులో కౌర్‌గా కంగనా రనౌత్‌ నటì ంచారు.  

సందీప్‌ కౌర్‌  బ్యాంక్‌ రాబరీ కేసులో ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న ఎన్నారై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement