
సిరియా రాజ్య సైన్యాధిపతి నయమాను కుష్టువ్యాధిగ్రస్తుడు. ఆ వ్యాధిని బాగుచేయగల భక్తుడు షోమ్రోను పట్టణంలో ఉన్నాడని చెప్పినపుడు నయమాను ఆ భక్తుడైన ఎలీషాను కలుసుకున్నాడు. ఎలీషా చెప్పినట్లు ఝెరికో నదిలో ఏడుమార్లు మునగగానే ఆ కుష్టువ్యాధి నయమైపోయింది. వెంటనే నయమాను ఎలీషా వద్దకు వెళ్లి బహుమానం తీసుకోవాలని బలవంతం చేశాడు. దేవుని భక్తుడైన ఎలీషా ఎంతమాత్రమును ఒప్పక ఆ బహుమానాన్ని తీసుకోకుండా నయమానును పంపివేశాడు.
ఇదంతా గమనిస్తున్న ఎలీషా శిష్యుడైన గెహాజీ తన గురువైన ఎలీషా ఆ నయమాను ఇచ్చే బహుమానాన్ని తీసుకోకపోవడం చూసి మనసులో బాధపడి ఆ బహుమానాన్ని ఎలాగైనా తాను తీసుకోవాలనుకున్నాడు. వెంటనే నయమాను వద్దకు పరిగెత్తడం మొదలుపెట్టాడు. పరిగెత్తుకొస్తున్న గెహాజీని చూసిన నయమాను అతడు ఎలీషా సేవకుడని గుర్తించి రథాన్ని దిగగానే గెహాజీ తనను ఎలీషా పంపాడనీ, మొదట ఆ బహుమానాన్ని వద్దన్నా తరువాత తీసుకోవడానికి మనసు కలిగి తనను పంపాడని అబద్ధం చెప్పి ఆ ధనాన్ని తీసుకొని ఏమీ ఎరగనట్లుగానే తిరిగి తన గురువైన ఎలీషా వద్దకు వచ్చాడు.
గురువుగారైన ఎలీషా గెహాజీని నీవెక్కడనుండి వస్తున్నావని అడిగినపుడు కూడా అతడు తాను చేసిన పనిని గురించి చెప్పలేదు. అప్పుడు భక్తుడైన ఎలీషా అంతా గ్రహించి నీవు దీనిని చేశావు కాబట్టి నయమానుకు ఉన్న కుష్టువ్యాధి నీకు కలుగుతుందని చెప్పగానే గెహాజీకి కుష్టు కలిగి అక్కడనుండి వెళ్లిపోయాడు. ఎక్కడో సిరియా రాజ్య సైన్యాధిపతియైన నయమాను తనకున్న కుష్టును తగ్గించుకోవడానికి భక్తుని వద్దకు వస్తే, ఆ భక్తుని వద్ద సేవకునిగా ఉన్న గెహాజీ ధనం మీద దృష్టిని నిలిపి ఆ వ్యాధిని తాను తెచ్చుకున్నాడు.
గెహాజీకి ధనం ఉంది కానీ అనుభవించడానికి శరీరం సరిగా లేదు. ఉన్నదానితో తృప్తి పడకుండా తనది కానిదానికోసం పరిగెత్తి దురాశతో కుష్టువ్యాధిని కొనితెచ్చుకున్న గెహాజీ మనస్తత్వం ఒకవేళ మనలో ఉంటే ఆ మనస్తత్వాన్ని మనం చంపివేయాలి. ఎందుకంటే దురాశ మనతో ఎంతటి దుష్కార్యాన్నైనా చేయిస్తుంది.
– రవికాంత్ బెల్లంకొండ
Comments
Please login to add a commentAdd a comment