
దేవతార్చన కోసం, మంత్రజపం కోసం వివిధ రకాల మాలలు వాడుతుంటారు. వీటిలో ఒక్కో మాలకు ఒక్కో ప్రత్యేకత ఉంది. జపమాలలుగా వినియోగించే వాటిలో తులసిమాలకు విశిష్టమైన స్థానం ఉంది. తులసి విష్ణువుకు ప్రీతికరమైనది. తులసిమాలను జపమాలగా వినియోగించినట్లయితే శీఘ్రంగా కేశవానుగ్రహ ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. తులసిమాలను జపమాలగా వినియోగించినట్లయితే మానసిక ఏకాగ్రత పెరుగుతుంది.
దురాలోచనలు దూరమవుతాయి. ఆత్మప్రక్షాళనకు మార్గం సుగమమవుతుందని శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి. తులసిమాలల వినియోగం వల్ల కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. లక్ష్మీకటాక్షం కలుగుతుంది. తులసిమాలను మెడలో ధరించినట్లయితే మనసులోని భయాందోళనలు తొలగిపోతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. సాధారణ గ్రహదోషాల వల్ల కలిగే ఈతిబాధలు దూరమవుతాయి. తులసిమాల ధారణ వల్ల పీడకలలు రాకుండా ఉంటాయని, మరణానంతరం నరకబాధలు తప్పుతాయని కూడా పురాణాలు చెబుతున్నాయి.
– పన్యాల జగన్నాథదాసు