అనగనగా ఓ జ్ఞాని. ఆయన రోజూ ఎవరికో ఒకరికి అన్నం పెట్టి గానీ తాను భుజించడు. దానిని ఓ నియమంగా చేసుకుని చాలా కాలంగా కొనసాగిస్తూ వచ్చాడు. ఓరోజు ఒక్క అతిథీ రాలేదు. వీధి అరుగుమీద కూర్చుని చాలాసేపు నిరీక్షించాడు. దేవుడా, ఈరోజు ఎవరూ రాలేదు. ఏం చేయను.. ఒక్కడినే భుజించి నియమం తప్పాలా.. లేక ఉపవాసం ఉండనా.. అనుకుంటాడు.అయినా ఎవరినో ఒకరిని తీసుకొచ్చి అన్నం పెట్టి ఆ తర్వాత తాను తినాలనుకున్నాడు. అందుకని వీధిలోకి వచ్చాడు. అటూ ఇటూ చూశాడు. ఇంతలో ఎదురుగా ఓ వ్యక్తి రావడం చూశాడు. జ్ఞానిలో పట్టరాని ఆనందం కలిగింది. అమ్మయ్య ఎవరో ఒకరు కనిపించారు చాల్లే అనుకున్నాడు మనసులో. అతనిని తన ఇంటికి వచ్చి భోజనం చేయమన్నాడు. అతను వచ్చాడు. అయితే ఆ వ్యక్తి పక్కా నాస్తికుడు. ఆ విషయం జ్ఞానికి తెలీదు. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. జ్ఞాని అతనికి వడ్డిస్తూ దేవుడి గురించి స్మరించాడు. ఆ తర్వాత అతనిని దేవుడిని స్తుతించమన్నాడు.
అయితే అతను తనకిలాంటి మూర్ఖత్వం పట్ల నమ్మకం లేదన్నాడు.
‘‘ఏంటీ అన్నం తినడానికి ముందు దేవుడిని స్తుతించడం మూర్ఖత్వమా’’ అడిగాడు జ్ఞాని.‘‘అసలు దైవారాధనే మూర్ఖత్వం’’ అన్నాడు నాస్తికుడు.ఇలా ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. పైగా అతనన్నాడు...‘‘అన్నం పెడుతున్నది మీరు. కావాలంటే మీ గురించి ప్రార్థించమంటే ఎంతయినా ప్రార్థిస్తాను. అంతే తప్ప కనిపించని దేవుడి గురించి ప్రార్థించడం వొట్టి మూర్ఖత్వం‘‘ అని గట్టిగా చెప్పాడు. దాంతో వారి మధ్య వాదనలు మరింత పెరిగాయి.‘‘నాస్తికుడికి నేను అన్నం పెట్టను, పో‘‘ అన్నాడు జ్ఞాని.అప్పుడు అతను ‘‘నేనా వచ్చాను. మీరు రమ్మంటే వచ్చాను... మీరేదో అన్నం పెడుతున్నారు కదాని నా అభిప్రాయాన్ని మార్చుకోలేను’’ అని వెళ్ళిపోయాడు.అనంతరం జ్ఞాని నీరసించి పడుకుండిపోయాడు.అప్పుడు ఆయనకు కలలో కృష్ణుడు కనిపించాడు.‘‘నాయనా, అతనికి నా మీద నమ్మకం లేకపోవచ్చు. అది అతని ఇష్టం. అయినా నేను అతనిని ఏమీ అనలేదు. కానీ నువ్వు నీ అంతట నీవే అతనిని భోజనానికి రమ్మనమని చెప్పి ఇలా గొడవ పెట్టి పంపడం ఏమన్నా బాగుందా? నిన్ను నమ్మి అతనిని నీ దగ్గరకు పంపాను భోజనానికి. కానీ నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేశావు. నువ్వతనిని పంపించేయడంతో నేనిప్పుడు అతనికి మరొక చోట అన్నం లభించే ఏర్పాటు చేయాలి.. ఏం చేయనూ.. చేస్తాను’’ అన్నాడు.
ఈ కలతో జ్ఞాని నిద్ర లేచి వీధిలోకి పరుగులు తీశాడు. అతను ఓ చెట్టు కింద కూర్చుని ఉండడం చూశాడు. అతనిని భోజనానికి రమ్మనమని చెప్పాడు.అయితే అతను ‘‘నేను భగవంతుడిని వ్యతిరేకించే వాడిని. మీరు నన్ను పొమ్మనడం న్యాయమే. అందులో మీ తప్పేమీ లేదు. ఇప్పుడు మళ్లీ మీరొచ్చి నన్ను రమ్మంటున్నారేంటీ.. ఇంతలో ఏమైంది‘‘ అని అడిగాడు ఆ నాస్తికుడు.జ్ఞాని ఏం చెప్తాడు.. తనకు కలలో వచ్చిన కృష్ణుడి గురించి చెప్పాలా... చెప్తే అతను వింటాడా.. మళ్లీ గొడవకు దిగడూ.. ఎందుకొచ్చిన గొడవ అనుకున్న ఆ జ్ఞాని.. తన జ్ఞానం, చదువుసంధ్యలు అన్నీనూమూట కట్టి పక్కన పెట్టి అతనితో ఇలా అన్నాడు –‘‘అయ్యా, మేము ఆస్తికులం. దేవుడు ఉన్నాడు అనడానికి మాకు ప్రత్యేకించి ధైర్యం అక్కర్లేదు. కానీ దేవుడు లేడని చెప్పడానికే అసాధారణమైన ధైర్యం ఉండాలి. మనసు గట్టి చేసుకోవాలి. అంతేకాదు, వైరాగ్యమూ ఉండాలి. ఆ విధంగా చూస్తే మీరే నాకంటే దృఢమైనవారు. నా కంటే ఉన్నతులు. మీకు అన్నం పెట్టడం నాకు గొప్పే’’ అన్నాడు జ్ఞాని.
దాంతో అతను సరేనని జ్ఞాని వెంట అతనింటికి వెళ్లి భోజనం చేశాడు. అక్కడే విశ్రాంతి కూడా తీసుకున్నాడు.
– యామిజాల జగదీశ్
అయ్యా.. మీరే గొప్ప!
Published Sat, Sep 1 2018 12:14 AM | Last Updated on Sat, Sep 1 2018 12:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment