లండన్ : ఉప్పుతో ఆరోగ్యానికి పెనుముప్పేనని వైద్యులు హెచ్చరిస్తుండగా తాజా అధ్యయనం ఉప్పు కొంచెం ఎక్కువగా తీసుకున్నా ఇబ్బందేమీ ఉండదని వెల్లడించింది. రోజుకు ఒక టీస్పూన్‌కు మించి ఉప్పు తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం తప్పదని పలు దేశాల్లో వైద్య ఆరోగ్య మార్గదర్శకాలు స్పష్టం చేస్తుండగా తాజా అధ్యయనం ఇందుకు భిన్నంగా వెల్లడైంది. రోజుకు రెండున్నర టీస్పూన్లు లేదా ఐదు గ్రాముల వరకూ ఉప్పు ఆహారంలో భాగంగా తీసుకున్నా ఎలాంటి ప్రమాదం లేదని ఒంటారియోకు చెందిన మెక్‌మాస్టర్ యూనివర్సిటీ నిర్వహించిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ఉప్పును పరిమితి మించి తీసుకునే వారు సైతం అధికంగా పండ్లు, కూరగాయలు, పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా సమతుల్యతను పాటించవచ్చని పేర్కొంది.
ఉప్పుతో కూడిన ఆహారం అధికంగా తీసుకునే చైనా వంటి దేశాల్లో సోడియం తగ్గించాలనే ప్రచారం అవసరమని, ఐరోపా, ఉత్తర అమెరికాల్లో ఈ తరహా ప్రచారం అవసరం లేదని అధ్యయన రచయితలు చెప్పుకొచ్చారు. తగినంత మోతాదులో ఉప్పు తినే వారిలో గుండె జబ్బులు, స్ర్టోక్ ముప్పును నివారించేందుకు సోడియంను తగ్గించాలని సూచించేందుకు నిర్ధిష్ట ఆధారాలేమీ లభించలేదని అధ్యయన రచయిత, అసోసియేట్ క్లినికల్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ మార్టిన్ ఓడోనెల్ పేర్కొన్నారు.
రోజుకు ఐదు గ్రాముల కన్నా ఎక్కువగా ఉప్పు తీసుకున్న వారిలోనే గుండె జబ్బులు, స్ర్టోక్స్ ముప్పు ఉన్నట్టు తమ అధ్యయనంలో గుర్తించామని చెప్పారు. రోజుకు ఏడు గ్రాముల కంటే అధికంగా సోడియం తీసుకునే వారిలోనే గుండె జబ్బుల ఉదంతాలు, హైబీపీతో మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడైందన్నారు. సోడియంను తగిన మోతాదులోనే తీసుకుంటే గుండెకు పదిలమని చెప్పారు. మరోవైపు రోజుకు ఒక టీస్పూన్ లేదా రెండు గ్రాములకు మించి ఉప్పు తీసుకోరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment