నవ లోకం
చదివింత
విషయం అసాధారణమైనదేతై విడ్డూరంగా అనిపిస్తుంది. అలాంటి విడ్డూరాలు ఈ ప్రపంచంలో బోలెడన్ని ఉన్నాయి. వినీ వినగానే ఔరా అనిపిస్తాయి. అవునా అని ఆశ్చర్య పోయేలానూ చేస్తాను. అలాంటి వాటిలో ఇవి కొన్ని...
1 పిల్లలు వరుసకట్టి బడికెళ్లినట్టు పీతలు కూడా వెళ్తే ఎలా ఉంటుంది? ఆస్ట్రేలియాలోని క్రిస్ట్‌మస్ ఐల్యాండ్‌కి వెళ్తే అలాంటి దృశ్యమే కనిపిస్తుంది. అక్కడ కొన్ని వందల మిలియన్ల ఎర్రపీతలు ఉంటాయి. అవి యేటా డిసెంబర్ నెలలో గుడ్లు పెట్టడానికి సముద్ర తీరానికి బయలుదేరుతాయి. తాము ఉండే చోటి నుంచి సముద్ర తీరానికి వెళ్లడానికి వాటికి దాదాపు వారం రోజులు పడుతుందట. వేల పీతలు అన్ని రోజుల పాటు మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నేలకు ఎరుపు రంగు పూసినట్టుగా అనిపిస్తుందట!
2 చిటారు కొమ్మకు ఊయల కట్టుకుని ఊగడం ఎవరికైనా సరదానే. కానీ ప్రపంచం అంచున ఊయల కట్టుకుని ఊగితే ఎలా ఉంటుంది?! ఈక్వెడార్‌లో తుంగురావా అనే పెద్ద పర్వతం ఒకటుంది. దానిమీద ఒక కాటేజ్, దాని పక్కనే ఓ పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ఎవరో కట్టిన ఊయల చాలా ఫేమస్ అయ్యింది. అయితే ఊగుతున్నప్పుడు అది కానీ తెగిందంటే తిన్నగా లోయలోకి వెళ్లి పడతారు. అందుకే దీన్ని ‘స్వింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్’ అంటారు.
3 జంతువులను పెంచుకోవడం ఎక్కడైనా మామూలే. అయితే క్వీన్స్ ల్యాండ్‌లో దేన్ని పడితే దాన్ని పెంచుకోవడం కుదరదు. ముఖ్యంగా కుందేళ్లను మెజీషియన్లు తప్ప ఎవ్వరూ పెంచుకోకూడదు. నానా పరీక్షలు ఎదుర్కొని, మెజీ షియన్లమని నిరూపించు కుంటేనే వాళ్లకైనా అనుమతి దొరుకుతుంది!
4 నన్ను చూశారా లేదా అన్నట్టు గర్వంగా తలతిప్పి చూస్తోన్న ఈ పిల్లిగారి పేరు నోరా. న్యూజెర్సీలో ఉంటుంది. దీని యజమాని ఓ పియానో టీచర్. ఆయన తన విద్యార్థులకు పాఠాలు నేర్పిస్తున్నప్పుడు చూసి నోరా కూడా సంగీతం నేర్చేసుకుంది. అది ఓసారి పియానో వాయించడం చూసి ఆశ్చర్యపోయిన యజమాని దానికి మరింత తర్ఫీదునిచ్చాడు. దాంతో అది తన యజమాని ఆర్కెస్ట్రాలో పియానో ప్లేయర్ అయిపోయింది. ప్రదర్శనల్లో సైతం పాల్గొంటోంది.
5 కెన్యాలో మగడి అనే సరస్సు ఉంది. ఇందులోని నీరు సోడాలాగా ఉంటుంది... చూడడానికీ రుచికీ కూడా. అందుకే దీన్ని సోడా లేక్ అంటుంటారు. సోడియం కార్బొనేట్ ఎక్కువగా ఉండటం వల్ల అలా అనిపిస్తుంది తప్ప నిజంగా ఇది తాగడానికైతే పనికి రాదు.
6 ఒక చెట్టు అంటే ఒకటే. కానీ ఇటలీలోని కసోర్జో ప్రాంతంలో ఉన్న ఓ చెట్టు ఒకటి కాదు... రెండు. అవును ఒక్క చెట్టులో రెండు చెట్లు ఉంటాయి. రెండు రకాల కాయలు కాస్తాయి. చెర్రీ చెట్టు, మల్బరీ చెట్టు కలిసి ఇలా ఒక్క చెట్టులా ఏర్పడ్డాయట. అందుకే దీన్ని ‘డబల్ ట్రీ ఆఫ్ కసోర్జో’ అంటారు!
7 అమెరికాలోని సుప్రసిద్ధ హూవర్ డ్యామ్ నిర్మాణం చాలా యేళ్ల పాటు జరిగింది. ఆ క్రమంలో ఎన్నో ప్రమాదాలు సంభవించాయి. వాటి కారణంగా 96 మంది చనిపోయారు. వారిలో మొదట చనిపోయిన వ్యక్తి పేరు జె.జి.టైర్నీ. 1922, డిసెంబర్ 20న అతను ప్రమాదవశాత్తూ చనిపోయాడు. చివరగా చనిపోయిన వ్యక్తి ప్యాట్రిక్. అతను కూడా డిసెంబర్ 20వ తేదీనే ప్రమాదవశాత్తూ చనిపోయాడు. అంతకంటే విచిత్రం ఏమిటంటే... అతను టైర్నీ కుమారుడే.
8 సిసిలీలోని ఓ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు ఒక వెండింగ్ మెషీన్‌ను కనుగొన్నారు. అందులో పనికిరాని ప్లాస్టిక్ బాటిల్స్‌ని, డబ్బాల్ని వేస్తే... అది వాటిని ముక్కలు చేసి, ఆపైన పూర్తిగా కరిగించేస్తుంది. తర్వాత త్రీడీ ప్రింటర్ సహాయంతో అందమైన ఫోన్ కవర్లుగా మార్చి వెలువరిస్తుంది. ఎన్నో ప్రశంసలు పొందుతోన్న ఈ మెషీన్‌ని... రీసైక్లింగ్ మీద యూత్‌కి అవగాహన పెంచేందుకే తయారు చేశారట.
9 సినిమా అన్నాక అవార్డులకు నామినేట్ అవ్వడం, అవి రావడం మామూలే. అయితే ‘లార్డ్ ఆఫ్ ద రింగ్స్’ సిరీస్‌లోని సినిమా లన్నీ కలిపి ఏకంగా 800 అవార్డులకు నామినేట్ అయ్యాయి. వివిధ విభాగాల్లో 475 అవార్డుల్ని గెల్చుకున్నాయి. సినిమా చరిత్రలోనే ఏ సినిమా సిరీస్‌కీ ఈ ఘనత దక్కలేదు!