లోకసంరక్షణార్ధం తారకుడనే రాక్షసుని సంహరించడానికి దేవతల కోరిక మేరకు లోకనాయకుడు పరమశివుడి అంశతో మార్గశిర శుద్ధ షష్టి నాడు జన్మించాడు సుబ్రహ్మణ్య స్వామి. దీనికే ‘సుబ్రహ్మణ్య షష్టి‘ లేదా ‘స్కంద షష్టి‘ అని పేరు.
సుబ్రహ్మణ్యస్వామి పేర్లు
►కుమారస్వామి నామాలు, వాటి వివరణ
►షణ్ముఖుడు –– ఆరు ముఖాలు కలవాడు.
►స్కందుడు పార్వతీదేవి పిలిచిన పేరు.
►కార్తికేయుడు కృత్తికానక్షత్రాన జన్మించినందుకు
►వేలాయుధుడు శూలాన్ని ఆయుధంగా కలిగిన వాడు.
►శరవణుడు –శరవణం (రెల్లు వనం) లో జన్మించాడు కాబట్టి.
►సేనాపతి – దేవతలకు సేనాధిపతి.
►స్వామినాథుడు ––శివునకు ప్రణవ మంత్ర అర్ధాన్ని చెప్పినాడు కనుక.
►సుబ్రహ్మణ్యుడు –బ్రహ్మజ్ఞానం కలిగినవాడు.
►మురుగన్ ఈ తమిళ నామానికి ‘అందమైన వాడు‘ అని అర్థం.
తారకాసుర సంహారం
కుమారస్వామిని దేవతలు తమ సేనాధిపతిని చేసారు. కుమారస్వామి తారకాసురుని సంహరించేందుకు ఆరు రోజుల పాటు భీకర యుద్ధం చేసి వధించి లోకాన్ని, దేవతలను కాపాడి అందరి మన్ననలు పొంది దేవసేనాపతిగా కీర్తింపబడ్డారు.
సుబ్రహ్మణ్య కావడి
సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారే లేచి శిరస్నానమారించి పాలు, పంచదారలతో నిండిన కావడులను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు. దేవాలయాలను దర్శించి భక్తిశ్రద్ధలతో అష్టోత్తర శతనామ పూజలు చేస్తారు. భక్తులు కావడులతో తెచ్చిన పంచదార, పాలను స్వామికి సమర్పించుకుంటారు. అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కులను బట్టి ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆచారం తమిళనాడు రాష్ట్రంలో విశేషంగా ఆచరణలో ఉంది.
వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య కల్యాణం
స్కంద షష్టి నాడు సుబ్రహ్మణ్య దేవాలయాలలో ‘శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి‘ కళ్యాణం నిర్వహిస్తుండడం పరిపాటి. ఈ వివాహాన్ని వీక్షిస్తే అవివాహిత యువతీ యువకులకు ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయని, సత్సంతానం కలుగుతుందని పెద్దల మాట.
నేడు పాటించాల్సిన నియమాలు
సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. నదీస్నానం ఆచరించాలి (సమీపాన నది ఉంటే) లేదా శిరఃస్నానం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలు లేదా పాలు నైవేద్యంగా సమర్పించాలి. సుబ్రహ్మణ్య స్వామి విజయ గాథలు చదవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కీర్తనలు ఆలాపించాలి. దగ్గరలోని స్వామి ఆలయాలను సందర్శించి పూజలు చేయాలి. వీలైనంత దానధర్మాలు చేయాలి. రోజంతా ఉపవాస దీక్ష ఆచరించాలి.
పూజ ఫలితం
విశేషించి ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా, కావడి సమర్పించినా సత్సంతానప్రాప్తి, వారి కుటుంబంలోనూ, రాబోయో తరాలవారికి కూడా వంశవృద్ధి జరుగుతుందని విశ్వాసం. అందుకే సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలను ఎక్కువగా సందర్శిస్తుంటారు. స్కంద షష్ఠినాడు సుబ్రహ్మణ్య కళ్యాణం జరిపించే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి దేశం నలుమూలలా దేవాలయాలున్నాయి.
వాటిలో తిరుచానూరు పద్మావతీ దేవి ఆలయ పుష్కరిణికి సమీపంలోని ఆలయం, మోపిదేవిలో, మంగళగిరి వద్ద గల నవులూరులోనూ, వరంగల్ జిల్లా పరకాలలోని ఆలయం, హైదరాబాద్ పద్మారావు నగర్‌లోని ఆలయాలు సుప్రసిద్ధమైనవి. ఇక తమిళనాట గల ఆలయాల సంగతి సరేసరి. ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని; పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం. భక్తులకు స్వామి అనుగ్రహం లభించాలని కోరుకుందాం.
– కృష్ణకార్తీక
జాతకంలో సర్పదోషం, నాగదోషం, కాలసర్పదోషం ఉన్న వారు దోష పరిహారం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. రాహుకేతు దోషాన్నే కాలసర్పదోషంగా పరిగణించి ఈ రెండు గ్రహాలకు పూజలు చేయడం పరిపాటి. జాతకంలో గ్రహాలన్నీ లగ్నంతో సహా రాహు కేతుగ్రహాల మధ్య ఉంటే కాలసర్పదోషంగా చెబుతారు. మరలా ఇందులో అధోముఖ కాలసర్ప, ఊర్థ్వముఖ కాలసర్పదోషమని రకాలుంటాయి. సర్పానికి రాహువును నోరుగా, కేతువును తోకగా భావిస్తారు. అందువల్ల ఈ రెండింటి మధ్య జాతక చక్రంలో గ్రహాలు ఎంత శుభస్థితిలో ఉన్నా, ఉచ్చంలో ఉన్నా ఆ శుభ ఫలాలు జీవితంలో కనిపించవని జ్యోతిష్య నిపుణులు చెబుతారు.
ఈ దోష నివారణకు రాహు కేతు గ్రహాలకు ప్రత్యేక పూజలు చేసుకోవాలి. ఈ పూజలకు కాళహస్తి, మోపిదేవి, చిన కాకాని, కర్ణాటకలో కుక్కి ప్రశస్తం. సుబ్రహ్మణ్య షష్ఠినాడు ఈ దోష నివారణ పూజలు మరింత సత్ఫలితాలు ఇస్తాయి. స్వామిని సర్పరూపంలో పూజించి నాగులను చంపిన పాపాలు, వాటి పట్ల చేసిన దోషాలు పోవాలని ప్రార్థించాలి. సుబ్బారాయుని గుడిలోనే కాక గ్రామాలలో ఉన్న పాముల పుట్టల దగ్గర కూడా పూజలు చేయడం కొన్ని ప్రాంతాలలో ఆచారం ఉంది.
– గుమ్మా రామలింగస్వామి,
జ్యోతిష శాస్త్ర నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment