అక్షరం.. చీకటిని చీల్చే దీపఖడ్గం. వట్టి పాదాలతో నిష్టగా ఆ ఖడ్గం అంచుపై నడిచి ఆ రుధిరధారతో పదునెక్కిన రచయిత్రి చిత్రాముద్గల్. దత్తా సామంత్ పేరు మీరు వినే ఉంటారు. శంకర్ గుహ నియోగి పేరు కూడా. ఇద్దరూ కార్మిక సంఘాల నాయకులు. ముంబై సిటీలోని లక్షల మంది జౌళి మిల్లు కార్మికుల యూనియన్ లీడర్ దత్తాసామంత్. 1997లో అండర్‌వరల్డ్ మాఫియా అతడిని చంపేసింది. అంతకుముందే 1991 శంకర్ గుహ నియోగి హత్య జరిగింది.
ఛత్తీస్‌గఢ్ గని కార్మికుల ప్రియతమ నాయకుడు నియోగి. అక్కడి ఇండస్ట్రియల్ మాఫియా అతడిని చంపేసింది. ఈ రెండు హత్యలు భారతదేశంలోని కార్మిక సంఘాలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. అక్షర యోధురాలైన ముద్గల్ చేత ‘ఆవాన్’ అనే పుస్తకాన్ని రాయించాయి. దత్తా సామంత్ ఆమె తాత్విక గురువు కూడా. కార్మిక సంఘాల ఉద్యమాలు బలంగా వేళ్లూనుకుంటున్న సమయంలోని కార్మిక జీవితాలపై, ఆనాటి పరిస్థితులపై ముద్గల్ రాసిన ‘ఆవాన్’.. హిందీ సాహిత్యంలో ఒక ‘క్లాసిక్’గా నిలిచిపోయింది.
కార్మిక సంఘ నాయకత్వ లక్ష్యంలోని ఔన్నత్యాన్ని అర్థం చేసుకోడానికి అదొక ప్రామాణిక గ్రంథం అయింది. డెబ్బయ్ మూడేళ్ల ఈ వయసులోనూ ముద్గల్ ఆధునిక హిందీ సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నవారిలో ఒకరిగా నిలబడే ఉన్నారు. ఇవాళ ఢిల్లీలో మొదలౌతున్న ఆరు రోజుల సాహిత్య అకాడమీ వేడుకల్లో అకాడమీ ఎగ్జిబిషన్‌కు చిత్రా ముద్గలే ప్రారంభోత్సవం చేయబోతున్నారు.
ముద్గల్ చెన్నైలో పుట్టారు. ముంబైలో చదువుకున్నారు. హిందీ లిటరేచర్‌లో ఎమ్మే చేశారు. తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా అవ«ద్ నారాయణ్ ముద్గల్ అనే జర్నలిస్ట్‌ని వివాహం చేసుకున్నారు. దత్తా సామంత్, శంకర్ గుహ నియోగి కార్మిక సంఘాల నాయకులైతే, చిత్రా ముద్గల్ అక్షర కార్మికురాలిగా కార్మిక ఉద్యమానికి జెండా పట్టిన యోధురాలు. ఆమె ప్రతి అక్షరం నాయకత్వ లక్షణం.
- రచయిత్రి చిత్రా ముద్గల్
Comments
Please login to add a commentAdd a comment