తల్లులు తమకి తెలియకుండానే కూతుళ్ళ జీవితం పైన ఎంత గంభీరమైన ప్రభావం చూపుతారో చిత్రిస్తారు రచయిత్రి చిత్రా బెనర్జీ దివాకరుని.
‘బిఫొర్ వి విసిట్ ద గాడెస్’– మూడు తరాల తల్లీకూతుళ్ల కథ. అమ్మమ్మ సాబిత్రి, కూతురు బేలా, మనవరాలు తార. సాబిత్రి గతం– ఆమెకీ బేలాకీ అడ్డుపడటంతో, సాబిత్రి కూతుర్ని తననుంచి చాలా దూరం పెడుతుంది. దానివల్ల, బేలా తన ప్రేమికుడితో అమెరికా పారిపోయి తారాను కంటుంది. తల్లి వివాహం విఫలమయినప్పుడు, తార కాలేజి చదువు మధ్యలోనే ఆపేసి తల్లీతండ్రీ నుంచి దూరం అయి, డ్రగ్స్ తీసుకుంటూ, చిన్న పాటి ఉద్యోగాలు చేసుకుంటుంటుంది.
‘మన ప్రపంచం తలకిందులు అవుతున్నప్పుడే కాబోలు మనం తల్లులకి ఫోన్ చేస్తాం’ అనుకుంటూ, తల్లితో ఇన్నేళ్ళూ మాట్లాడ్డానికి మొహం చెల్లని బేలా, కూతురికి బుద్ధి చెప్పమని సాబిత్రిని అడగటంతో పుస్తకం ప్రారంభం అవుతుంది. తనెప్పుడూ చూడని, అమెరికాలో పుట్టి పెరిగిన మనవరాలికి తనేం సలహా చెప్పగలదా! అని సందేహపడుతూనే, ఇన్నేళ్ళూ రహస్యంగా ఉంచిన తన అనుభవాలని చెప్తే, తార చదువు కొనసాగిస్తుందని ఆశిస్తూ, సాబిత్రి ఆమెకి ఉత్తరం రాస్తుంది.
తల్లులు తమకి తెలియకుండానే కూతుళ్ళ జీవితంపైన ఎంత గంభీరమైన ప్రభావం చూపుతారో అని చెప్తూ, తల్లీ కూతుళ్ళ మధ్యనుండే క్లిష్టమైన సంబంధాలని చిత్రిస్తారు రచయిత్రి చిత్రా బెనర్జీ దివాకరుని. సున్నితమైన సంబంధాలు తెగిపోడానికి క్షణమాత్రం కూడా పట్టదన్న వాస్తవాన్ని చెప్తారు.
పుస్తకం– బెంగాల్ కుగ్రామం నుంచి హ్యూస్టన్లో ఉండే మధ్యతరగతి జీవన విధానాల వరకూ పాఠకులని తీసుకెళ్తుంది. కథ 1950లకీ, 2020లకీ మధ్యన చోటు చేసుకున్నది. అద్భుతమైన వచనం ఉన్న నవల ఏ కాలక్రమానుసారాన్నీ అనుసరించక, తమ వాంఛలని వెంబడిస్తూ నిజమైన ప్రేమకోసం వెంపర్లాడిన ముగ్గురు స్త్రీల దృష్టికోణాలతో సాగుతుంది. వదిలిపెట్టిన చాలా భాగాలు ఫ్లాష్‌బ్యాకుల్లో కనబడతాయి.
మిఠాయిల వ్యాపారం చేసే సాబిత్రి నూరు శాతం బెంగాలీ స్త్రీ. బేలా రెండు సంస్కృతులకీ మధ్య ఊగిసలాడేదయితే, తార తన మూలాలనుండి పూర్తిగా దూరం అయిన అమ్మాయి.
మొదట్లో కష్టాల్లో ఉన్న కుటుంబం గురించిన సామాన్యమైన నవలే అనిపిస్తుంది. యీ స్త్రీలు తమ జీవితాలని మలిచిన పురుషులకి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వరు. ఆ పురుషుల పాత్రలకి కూడా గంభీరతను ఆపాదించి, వారి దృష్టికోణాలనీ పరిచయం చేయడం వల్ల నవల అసక్తికరమైనది అవుతుంది.
నవల ముగ్గురి కథలనీ చివర్న ఒకటిగా కలిపేస్తుంది. పొట్టి సంభాషణల్లో కూడా చమత్కారపు పదబంధాలని చొప్పిస్తారు రచయిత్రి. ఉదా: ‘పశ్చాత్తాప పడటం కోసమని అన్ని అనుభూతులనూ కలిపి, ఒక గిన్నెలో తోడుబెట్టడం.’ ‘కిక్కిరిసిన వొంటరితనం ఉన్న గది.’ ‘రసగుల్లా, మిష్టీ దహీ’ వంటి మిఠాయిల ప్రస్తావనా, వర్ణనలూ నవల్లో ప్రధాన స్థానం ఆక్రమిస్తాయి.
క్షమాపణ కోరని, నిర్భయులైన యీ మూడు ప్రధాన పాత్రలే దివాకరుని పుస్తకానికి గొప్ప బలం. ‘మంచి కూతుళ్ళు అదృష్ట దీపాలు. కుటుంబానికి వన్నె తెస్తారు. దుష్టురాళ్ళైన కూతుళ్ళు కుటుంబానికి కళంకం తెచ్చే కొరివికట్టెల వంటివారు’ అన్న సామెత నవల్లో చాలాసార్లే కనిపిస్తుంది.
ఇది దివాకరుని పదకొండవ పుస్తకం. సైమన్ – షుస్టర్ 2016లో ప్రచురించింది. ఆడియో పుస్తకం ఉంది.
కృష్ణ వేణి
Comments
Please login to add a commentAdd a comment