
రాబ కొండల్నించి బావగారికి బుచ్చిబాబు ఒక అడవి పంది పిల్లని తెచ్చాడు. అది ముచ్చటగా వుండేది. ఆ పిల్లముండ కళ్లతో మాటాడేది.
నన్నేం చెయ్యికండర్రా! అంటున్నట్టుండేవి దాని కళ్లు. ఆకలేస్తున్నాది, పాలు బువ్వ కలిపి పట్టుకు రండర్రా అనేవా కళ్లు.
బుచ్చిబాబు బావ పేరు డాక్టరు గోపాలరాజు. అప్పగారి పేరు సీతమ్మ. ఆరుగురు కొడుకులూ, ఒక కూతురూ వాళ్లకి.
లైకా అని ఒక కుక్క, ఒక జెర్సీ ఆవు. ఒక నెమలీ, రెండు పిల్లులూ, రెండు జతల చౌకీ బాతులు, ఓ రెండు డజన్ల గిన్నీ కోళ్లు, ఓ ఇరవై నాటుకోళ్లు, మూడెకరాల స్థలంలో పెద్ద నాలుగిళ్ల లోగిలి చుట్టూ ప్రహరీ. ఇంటి చుట్టూ సపోటా, జామ, నిమ్మ, దబ్బ, రాచ ఉసిరి, కొబ్బరి, మామిడి, పనస చెట్లున్నాయి. ఆ చెట్ల మీద పిట్టలున్నాయి. ఉడతలున్నాయి, మిడతలున్నాయి.డాక్టరు గారికి ఇవన్నీ అంటే చాలా ఇష్టం. సీతమ్మగారికీ ఇష్టమేగానీ వాటికి పెట్టే తిండికీ, వాటివల్ల కలిగే లాభానికీ పొంతన లేనందుకు చిరాకుగా వుండేది.
పందిపిల్ల ఇంట్లో మనిషిలాగా అన్ని గదులూ తిరిగేది. పాలగచ్చు మీద కాలుజారి పడిపోయి చిన్నపిల్లలాగా ఏడిచేది. లైకాతో కలిసి సాటి పందిపిల్లతో ఆడినట్టు ఆడేది. ఆ కుక్క ఎందుకనోగానీ పందిపిల్లని దయగా చూసేది.
పెరిటిలో జెర్సీ ఆవు దగ్గరకు వెళ్లి, దాని కుడితి గోళెంలోకి దిగిపోయి, అడుగునున్న దాణా, చిట్టు, అన్నం మెతుకులూ కలబడి తినేసి, ఆవుకు ఒట్టి కుడితి నీళ్లు మిగిల్చేది.
చవికీ బాతుల మీదకి దూకుడుగా పరిగెత్తి వెళ్లేది. పెరటిలోను, ఇంటిముందూ పిల్లలు వేసిన కరివేపాకు మొక్కల్నీ, వంగ మొక్కల్నీ ఉత్త పుణ్యానికి పీకి పారేసేది.
డాక్టరుగారి పిల్లలు దాన్ని ‘కొండీ’ అని పిలిచేవారు. అందరూ ముద్దు చేసేవారు. క్రమంగా పెరిగి అది మూడున్నర జానలు ఎత్తయింది. కుర్రతనం మాయమైపోయింది.
మనుషుల సావాసం తగ్గించేసింది. వేళకు తినేది. కడమా అపుడు కూలిన ప్రహరీ గోడ సందులోంచి బైటకు వెళ్లి ఎక్కడెక్కడో తిరిగి వచ్చేది. గంటల తరబడి మామిడి చెట్ల మొదట నేలకి మోర ఆన్చి పడుకునేది. దాని కళ్లలోని తళుకు తగ్గిపోయింది.
ఓరోజు పొద్దునే కరివేపాకు కోయడానికి వచ్చిన డాక్టరుగారి అయిదో కొడుకు బగ్గీకి అది కనిపించలేదు. కొండీ కొండీ అని పిలిచాడు. అలికిడి లేదు.
బైటకు ఎక్కడికో వెళ్లి ఉంటుందని బగ్గీ లోపలికి వెళ్లిపోయాడు. ఆ మధ్యాహ్నమూ, ఆ సాయంత్రం కూడా అది రాలేదు. ఇంట్లో అందరూ కంగారు పడ్డారు. ఏ వేటకుక్కలో అందేసి వుంటాయేమోనని భయపడ్డారు.
మరునాటి ఉదయం బగ్గీ ఊరిలో వేటకుక్కలు పెంచే రాజుల ఇళ్లన్నీ తిరిగి, వాకబు చేశాడు.
జగ్గు అనే జ్ఞాతిని తీసుకుని కొవ్వాడ కొండలకు వెళ్లి గొంతెత్తి ‘కొండీ’ ‘కొండీ’ అని పిలిచాడు. ఆ పిలుపు కొండలో ఇంకిపోయింది.
‘‘కుక్కలు గాకపోతే రేచులు పట్టేస్తాయి. లేదా ఎవరో వేటజట్టు ఈటె బెట్టి పొడిచేస్తారు. నేన్చెపుతూనే వున్నాను. మొన్న దసరాకి కోసేస్తే పోయేది’’ అన్నాడు జగ్గు.
బగ్గీ మాటాడలేదు. అతని మనసు బాగాలేదు. ఊరి పొలిమేర చేరేసరికి వెనక ఏదో చప్పుడు.
‘కొండీ’ వెలిగిపోయింది బగ్గీ ముఖం. ఒళ్లంతా నిమిరాడు. సంబరంగా ఇంటికి తీసుకువెళ్లాడు.
డాక్టరు గారు దానికి కిలో బెల్లంముక్క చేత్తో తినిపించి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
మరో నాలుగు రోజుల తర్వాత మళ్లీ కొండి మాయమైపోయింది.
కొవ్వాడ కొండల్లో – లేనట్టుంది.
కొత్తవలస కొండల్లో – లేనట్టుంది.
గొడికొమ్మ కొండల్లో– లేనట్టుంది.
‘‘ఉంటే మన బగ్గీగాడు పిలిస్తే రాకుండా వుండేదా... అడవులు పట్టేసుంటుంది’’ అని సీతమ్మ సరిపెట్టుకుంటే,
‘‘పంది మరుపంటారు. అదీపాటికి మనల్ని మరిచిపోయి వుంటుంది’’ అన్నాడు బుచ్చిబాబు అన్న చినబాబు.
బగ్గీ కొవ్వాడ వేటదార్లకు, గంధవరం వేట జట్టుకు కబురు పెట్టాడు. ‘‘మా కొండికి బోరమీద, కుడికాలు మీద వెంట్రుకలు తెల్లగుంటాయి. కనబడితే కొట్టీ కండి.’’
ఫలితం లేకపోయింది.
రెండు నెలలు గడిచాయి.
అందరూ దాని గురించి మరిచిపోయారు.
డాక్టరు గారు కేంపుకెళ్లారు. ఊర్లో దొంగాటకం ఎక్కువగా వుందని సీతమ్మ పెద తమ్ముడు చినబాబు తుపాకి పట్టుకుని, ఆ రోజు ఇంట్లో వుండటానికి వచ్చి తూర్పు గదిలో పడుకున్నాడు.
తెల్లవారు రెండు గంటల వేళ–
ధడధడమనే శబ్దంతో వీధి తలుపులు ఊగిపోతున్నాయి. తలుపులు బలమైనవి కాకపోతే విరిగిపోయేవి. అందరూ లేచిపోయారు.
చినబాబు తుపాకీ పుచ్చుకుని వచ్చాడు.
సీతమ్మ, పిల్లలూ వెళ్లి అరుగు మీద నిల్చుని చూస్తున్నారు. ‘ఎవరది?’ కోపంగా అడిగాడు చినబాబు.
జవాబు లేదు.
తలుపులు విరగ్గొట్టడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారు. చినబాబు కుడిచేత్తో తుపాకి పట్టుకొని, ఎడమ చేత్తో తలుపు గెడ తీస్తుండగానే ఇంటిలోకి చొరబడిపోయింది కొండి.
అది ఘీమంటు నాలుగిళ్ల వాకిటిలో ఇటు అటూ పరుగెత్తింది. నీళ్ల గాబును ముట్టితో కొడితే పది బిందెల నీళ్లున్న అంత గాబూ తిరగబడిపోయింది. పెళ్లరుగు మీద, ఈశాన్యం మూలనున్న తులసికోటను ముట్టితో కొడితే ఆ ఇత్తడి తులసి కోట ఎగిరి అంతదూరం పడింది. బైట నుంచి కోపంగా అరుస్తూ వచ్చిన లైకాను గోడకేసి నొక్కేసింది. అంత కుక్కా కుయ్యోమంది.
దాన్నొదిలేసి పెళ్లరుగుమీదున్న సీతమ్మ వైపు పరిగెట్టింది. పిల్లలూ, సీతమ్మా కంగారుగా చెదిరిపోయారు. కొండీ కొండీ అని బగ్గీ పిలుస్తుంటే దురుసుగా వాడి మీదికి వెళ్లిపోయింది. బగ్గీ చటాలున డైనింగ్ టేబుల్ ఎక్కిపోయాడు.పనున్నట్లు అది ఇంట్లోంచి బైటకు పరిగెట్టింది.
‘‘దానికి పిచ్చెక్కినట్టుందోయ్’’ అంది సీతమ్మ భయంగా తమ్ముడితో. చినబాబు బీడీ వెలిగించుకున్నాడు. చినబాబు, బగ్గీ, సీతమ్మ, మిగిలిన పిల్లలూ ఇంట్లోంచి బైటకు వచ్చారు. కోళ్లగూడు విరిగిపోయి వుంది. బాతులు అరుస్తున్నాయి. కొండీ పెళ్లగిస్తే పళ్లతో సహా ఒక బొప్పాయి చెట్టు విరిగిపోయింది. తెల్లారి వెన్నెల్లో కొండీ దయ్యం పట్టినదానిలాగా కనిపిస్తోంది.
‘‘ఎందుకైనా మంచిది మీరందరూ ఆ పిట్టగోడ మీద కూర్చోండి’’ అన్నాడు చినబాబు. లైకా భయపడి పోయి చినబాబు వెనక నిల్చుని భౌభౌమని గోలగా అరుస్తున్నది.
కొండి ఉన్నట్టుండి చినబాబు వంక పరిగెత్తుకు రావడం మొదలుపెట్టింది. చినబాబు తుపాకీ ఎక్కుపెట్టాడు.
‘‘ఒద్దోయ్ చినమావయ్యా... ఒద్దు’’ అని బగ్గీ కేకలు వేసి పిట్టగోడ మీంచి దూకుతున్నప్పుడే చినబాబు ట్రిగ్గర్ నొక్కేశాడు. చినబాబుకు ఒక అడుగు దూరంలో కొండీ కూలిపోయింది.
‘‘దాన్ని చంపకపోతే మనం చస్తాం’’ అని వివరించి చినబాబు మరో బీడీ ముట్టించాడు.
‘‘రేపు బావొస్తే గొడవైపోతుంది’’ అన్నది సీతాదేవి భయంగా.
‘‘ఆ సంగతి నాకొదిలీ’’ అన్నాడు చినబాబు తుపాకీ సీతమ్మకు అందిస్తూ.
మేనమామ, మేనల్లుళ్లూ కలిసి పట్టుకొని ఆ పందిని ఇంట్లోకి చేరేసి పెళ్లరుగు మీద పడేశారు. చినబాబు పేల్చిన గుండు దాని నుదుటి మీద తగిలింది– నెత్తురు సన్నగా కారుతోంది. గిన్నీ కోళ్లు, బాతులు అరుస్తూనే వున్నాయి. లైకా చచ్చిపడివున్న పంది పక్క కూర్చుని మోర ఎత్తి ‘ఓ ఓ ఓ’మని ఏడిచింది. ఛీ!ఛీ! అని తిట్టి దాన్ని వీధిలోకి తరిమి చినబాబు వీధి తలుపు వేసేశాడు.
పొద్దున్న యాతప్పన్నకి కబురు చేస్తే వచ్చి ఆ పందిని పెరటిలోకి చేర్చి దానిని కోశాడు.
‘‘చూలుతో వుందండి బాబు... మూడు పిల్లలున్నాయి పొట్టలో’’ అని చెప్పేడు, తన పని తాను చేసుకుంటూనే.
చినబాబు గుండెలో కలుక్కుమంది. విషయం అంతా అతనికి అర్థం అయిపోయింది. ఆడపంది ఎదకొచ్చి జతకోసం అడవికి వెళ్లింది. చూలుతో కానుపు కోసం పుట్టింటికి వచ్చింది. ఆ సంబరంతో పిచ్చి పన్లు చేసింది. బుద్ధిహీనంగా తుపాకి బెట్టి నేను దాన్ని చంపేశాను... కళ్లలో నీళ్లు తిరిగాయి చినబాబుకు.
చెంపలు వాయించుకుని భగవంతుడికి క్షమాపణలు చెప్పుకుంది సీతమ్మ.
కె.ఎన్.వై.పతంజలి(1952–2009) ‘సీతమ్మ లోగిట్లో’ సంక్షిప్త కథ ఇది. ఆయన ‘వేట కథ’ల్లో ఇదొకటి. ‘ఇది మా ఇంట జరిగినది. ఆ డాక్టరు గారు మా తండ్రిగారు, ఆ సీతమ్మ మా అమ్మయ్య, ఆ చినబాబు మా రెండోమామ’ అని ఆయనే రాసుకున్నారు. పతంజలి ప్రసిద్ధ జర్నలిస్టు, రచయిత. సాక్షి పత్రిక తొలి సంపాదకుడు. గోపాత్రుడు, రాజుగోరు, ఖాకీవనం, వీరబొబ్బిలి, ఓ దయ్యం ఆత్మకథ ఆయన రచనల్లో కొన్ని.
కె.ఎన్.వై. పతంజలి
Comments
Please login to add a commentAdd a comment