ఓమ్... హీమ్... క్రీమ్ | summer special cool items ice cream | Sakshi
Sakshi News home page

ఓమ్... హీమ్... క్రీమ్

Published Wed, May 27 2015 11:56 PM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM

ఓమ్... హీమ్... క్రీమ్

ఓమ్... హీమ్... క్రీమ్

సమ్మర్ మటాష్!
ఈ మండుటెండల్లో బయటికి తీసుకెళ్లమని హఠం పట్టిన చిన్నారులకు తల్లులు వేయాల్సిన మంత్రం... ఓమ్ హీమ్ క్రీమ్! ఐస్ క్రీమ్ పేరు చెప్పగానే పిల్లలు హిమక్రీముల్లా కరిగిపోతారు. తిన్న తర్వాత హిమంలా శాంతిస్తారు. ఆలోచన దేనికి? మంత్రం జపించండి. ఇక్కడ ఇచ్చిన వెరైటీ వెరైటీ క్రీమ్‌లను తయారు చేసి, ప్రేమగా తినిపించండి.

 
మింట్ చాకో చిప్ ఐస్‌క్రీమ్
కావలసినవి: పాలు - 1 కప్పు, క్రీమ్ - 2 కప్పులు, తాజా పుదీనా ఆకులు - 2 కప్పులు, కోడిగుడ్లు - 2, చక్కెర - ముప్పావు కప్పు, చాక్లెట్ స్టిక్ (కొంచెం పెద్దది) - 1
తయారీ విధానం: క్రీమ్, పాలు, పుదీనా ఆకులు కలిపి బాగా బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేసి స్టౌమీద పెట్టాలి. సన్నని మంట మీద కాసేపు ఉడికించి దించేసుకుని, చల్లారబెట్టాలి. కోడిగుడ్డు సొనలో చక్కెర వేసి బాగా గిలకొట్టాలి. దీన్ని చల్లారిన పాల మిశ్రమంలో వేసి కలపాలి. చాక్లెట్ స్టిక్‌లో కొంత భాగాన్ని చిన్న చిన్న చిప్స్‌లాగా కోసుకోవాలి. మిగతాదాన్ని కరిగించాలి. కరిగించిన చాక్లెట్‌ను ఐస్‌క్రీమ్ మిశ్రమంలో వేసి కలిపి డీప్ ఫ్రీజర్‌లో పెట్టాలి. దగ్గరగా అయ్యాక తీసి, మరోసారి బ్లెండ్ చేయాలి. తర్వాత చాక్లెట్ చిప్స్ కలిపి మళ్లీ ఫ్రీజర్‌లో పెట్టాలి. తినేముందు కూడా కాస్త చాక్లెట్ సిరప్ చల్లుకుంటే బాగుంటుంది.
 
మధుమేహ వ్యాధిగ్రస్తులు, డైట్ కంట్రోల్ చేస్తున్నవారు చక్కెర తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి వాళ్లు ఐస్‌క్రీమ్ చేసుకునేటప్పుడు చక్కెరకు బదులు షుగర్ ఫ్రీ పిల్స్‌గానీ, పౌడర్‌గానీ వాడుకోవచ్చు. 1 కప్పు చక్కెరకు 5-6 పిల్స్‌గానీ, 2-3 చెంచాల పౌడర్‌గానీ వేసుకోవాలి. వాటిలో తియ్యదనం ఎక్కువ ఉంటుంది కనుక ఆమాత్రం వేస్తే సరిపోతుంది.
 
డేట్ చాకొలెట్ ఐస్‌క్రీమ్
కావలసినవి: ఖర్జూరాలు - 20, పాలు - 2 కప్పులు, క్రీమ్ - 1 కప్పు, కోకో పౌడర్ - 1 కప్పు, చక్కెర - పావుకప్పు, కోడిగుడ్లు - 2
తయారీ విధానం: ఖర్జూరాలను అరగంట పాటు నీటిలో నానబెట్టి, తర్వాత మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. కోడిగుడ్డు సొనలో చక్కెర వేసి బీట్ చేసుకోవాలి. పాలు, క్రీమ్ కలిపి స్టౌమీద పెట్టాలి. పది నిమిషాల తర్వాత తీసేసి చల్లారబెట్టాలి. చివరగా ఓ బౌల్‌లో ఖర్జూరం పేస్ట్, కోడిగుడ్డు మిశ్రమం, పాలు-క్రీమ్‌ల మిశ్రమంతో పాటు కోకో పౌడర్ కూడా వేసి కలిపి, డీప్ ఫ్రీజర్‌లో పెట్టాలి. గట్టిపడిన తర్వాత తీసి ఓసారి మిక్సీలో బ్లెండ్ చేసి మళ్లీ పెట్టెయ్యాలి. ఎగ్స్ వేయకుండా చేసుకున్నా కూడా ఈ ఐస్‌క్రీమ్ బాగుంటుంది.
 

కోకోనట్ ఐస్‌క్రీమ్
కావలసిన పదార్థాలు: పాలు - 2 కప్పులు, క్రీమ్ - 2 కప్పులు, కొబ్బరి పాలు - 2 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు, కోడిగుడ్లు - 2, చక్కెర - ఒకటిన్నర కప్పు
తయారీ విధానం: ఒక గిన్నెలో పాలు, కొబ్బరిపాలు, క్రీమ్, కొబ్బరి తురుము వేసి స్టౌమీద పెట్టాలి. సన్నని మంటమీద పది నిమిషాలు ఉడికించాక... దించేసి చల్లారబెట్టాలి.  ఈలోపు ఓ బౌల్‌లో కోడిగుడ్ల సొన, చక్కెర వేసి బాగా గిలకొట్టాలి. చల్లగా అయ్యాక కోడిగుడ్డు, చక్కెర మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపాలి. తర్వాత మొత్తాన్నీ మిక్సీలో వేసి బాగా బ్లెండ్ చేసి... ట్రేలోగానీ, గిన్నెలో గానీ వేసి డీప్ ఫ్రీజర్‌లో పెట్టాలి. గట్టిగా అయిన తర్వాత తీసి మరోసారి మిక్సీలో వేసి బ్లెండ్ చే సి మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టెయ్యాలి. రెడీ అయ్యాక ఇందులో కాస్త తేనె వేసుకుని తింటే చాలా బాగుంటుంది.
 
పీనట్ బటర్ ఐస్‌క్రీమ్
కావలసినవి: వేరుశెనగలు - పావుకిలో, చక్కెర - అరకప్పు, వెనిల్లా ఎసెన్స్ - 2 చెంచాలు, పాలు - 2 కప్పులు, క్రీమ్ - 1 కప్పు, కోడిగుడ్డు - 1, డ్రైఫ్రూట్స్ - కావలసినన్ని
తయారీ విధానం: వేరుశెనగల్ని వేయించి, మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. పాలను మరిగించి చల్లార్చాలి. ఇందులో క్రీమ్, చక్కెర, కోడిగుడ్డు సొన, వేరుశెనగ పేస్ట్ కలిపి మిక్సీలో బాగా బ్లెండ్ చేయాలి. చివరగా వెనిల్లా ఎసెన్స్, డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి డీప్ ఫ్రీజర్‌లో పెట్టేయాలి. దగ్గరగా అయ్యాక తీసి, ఇంకోసారి మిక్సీలో బ్లెండ్ చేసి మళ్లీ ఫ్రీజర్‌లో పెట్టాలి. పిల్లలకు ఈ ఐస్‌క్రీమ్ పెడితే టేస్ట్‌ని ఎంజాయ్ చేయడంతో పాటు బలం కూడా పుంజుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement