సూపర్ డూపర్ దుపట్టా! | Super dupar Dupatta! | Sakshi
Sakshi News home page

సూపర్ డూపర్ దుపట్టా!

Published Thu, Nov 12 2015 11:31 PM | Last Updated on Sun, Sep 3 2017 12:23 PM

సూపర్ డూపర్ దుపట్టా!

సూపర్ డూపర్ దుపట్టా!

మ్యాచింగ్ అనుకొనో, ఖరీదనో, కలర్‌ఫుల్‌గా ఉందనో.. ఏదో ఒకటి అనుకుని హడావిడిగా వేసుకునేది కాదు దుపట్టా. దానికో స్టైల్ ఉంది. ఓ హంగామా ఉంది. ఓ గ్రేస్ ఉంది. అందుకే ఈ మధ్య తారలు సైతం వీటికో ప్రత్యేకతను కల్పిస్తున్నారు. కచ్‌వర్క్, ప్యాచ్ వర్క్, పుల్కారీ వర్క్, కలంకారీ, అద్దకం.. ఒకటీ రెండు కాదు దుపట్టాకు ఎన్ని హంగులో.. కాస్త దృష్టి పెడితే సొంతంగా ఎవరికి వారు తామే దుపట్టా డిజైనర్ అయిపోవచ్చు.
 
ప్లెయిన్ ఓ ఆకర్షణ
సిల్క్ వాటికన్నా హ్యాండ్లూమ్ దుపట్టాల ఎంపిక సరైనది. దీంట్లో మంగళగిరి, కలంకారీ, పోచంపల్లి... వంటి మన చేనేతల దుపట్టాలు ప్రత్యేక ఆకర్షణనే కాదు డ్రెస్‌కు హుందాతనాన్ని జత చేర్చుతాయి. అందుకని వార్డ్‌రోబ్‌లో కొన్ని మన దేశీయ చేనేతల దుపట్టాలను చేర్చితే సాధారణ డ్రెస్సులు ధరించినప్పుడు వాటి లుక్ అసాధారణంగా కనిపించడానికి వీటిని ఎంచుకోవచ్చు.
 
ఎంబ్రాయిడరీ హవా!
కచ్, పుల్కారీ, గోటా, కాంతా, కశ్మీరీ, పార్శీ, జర్దోసి, మిర్రర్.. ఇలా మన దేశీయ హస్తకళలో పేరెన్నిక గన్న ఎంబ్రాయిడరీ వర్క్స్ ఎన్నో ఉన్నాయి. ఈ వర్క్‌లతో అందంగా రూపుకట్టిన దుపట్టాలలో కొన్నింటిని విడిగా ఎంపిక చేసి పెట్టుకోవాలి. ఒక ప్లెయిన్ డ్రెస్ ధరించినప్పుడు దాని మీదకు ప్రత్యేకమైన వర్క్‌తో ఆకట్టుకునే దుపట్టాను ధరిస్తే డ్రెస్ లుక్ పూర్తిగా మారిపోతుంది.
 
ట్రైబల్ కలర్స్
ముదురు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం... రంగు క్లాత్‌లను దుపట్టాలకు ఎంచుకుంటారు. వీటిని నలుచదరంగా కావల్సిన పరిమాణంలో కత్తిరించుకొని ఒక్కో రంగు క్లాత్‌ను వాడుతూ కుట్లు వేస్తారు. దీని మీద ఉదయ్‌పూర్, రాజస్థానీ, గుజరాతీ ప్రాంతాలో గిరిజనుల చేతి కట్లు, అల్లికలను పొందిగ్గా అమర్చుతారు. ఈ దుపట్టాలలో ఒక్కటైనా మీ దగ్గరుంటే లాంగ్ అనార్కలీ, షార్ట్ సల్వార్ కమీజ్‌ల మీదకు ధరిస్తే సంప్రదాయ, ఆధునిక కళ రెండూ ఉట్టిపడతాయి. ఈ కలర్స్, చేతిపనిలో ఉండే గ్రేస్‌ను పసిగట్టిన ప్రసిద్ధ డిజైనర్లు దుపట్టా డిజైనింగ్‌లో పోటీపడుతున్నారు.
 
ప్యాచ్‌ల మెరుపు
ఎంబ్రాయిడరీ పనితనం ఉన్నవీ, ప్లెయిన్‌వి, కలంకారీవి.. ఎన్నో ప్యాచ్‌లు విడిగానూ లభిస్తున్నాయి. ఒక డిజైనర్ దుపట్టాను కొనుగోలు చేయాలంటే ఖరీదు ఎక్కువ అని భావించేవారు, తమకుతామే మరింత అద్భుతంగా డిజైన్ చేసుకోగలం అనుకున్నవారు ఈ ప్యాచ్‌లను ఎంపిక చేసుకుంటే చాలు. సాధారణ కుట్లతో ఎంచుకున్న దుపట్టా మీద ప్యాచ్‌లతో అందంగా డిజైన్ చేయవచ్చు.
 
థీమ్ డిజైనింగ్‌పై దృష్టి
నేను డిజైన్ చేసిన బ్రైడల్ కలెక్షన్‌లో లెహంగా దుపట్టాలది ప్రత్యేక ఆకర్షణ. వీటి ద్వారానే బాగా పేరొచ్చింది. మోడల్స్, స్టార్స్ సంప్రదాయంగానూ, ఆధునికంగానూ కనిపించడానికి దుపట్టాలపై ప్రత్యేక శ్రద్ధ పెడతాను. నాణ్యమైన జరీ, కుందన్స్‌ను వీటి డిజైనింగ్‌లో ఉపయోగిస్తాను. పూర్తి కళాత్మకంగా ఉండేలా థీమ్ డిజైనింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. మనీష మల్హోత్రా డిజైన్స్ అంటేనే ఒక క్లాసీ, స్టన్నింగ్ లుక్ టచ్ తప్పక ఉంటుంది.
 - మనీష్ మల్హోత్రా,
 ఫ్యాషన్ డిజైనర్
 
లేసులు, పూసలు
ప్యాచ్‌ల తర్వాత దుపట్టా డిజైనింగ్‌లో చమ్కీ, లేసులు, పూసలు, అద్దాలది ప్రధానంగా ఉంటుంది. కొన్నింటిని దారంతో కుట్టవచ్చు. మరికొన్నింటిని ‘గ్లూ’తో అతికించవచ్చు. ఇది చాలా సులువైన ప్రక్రియ కూడా!
 లెహంగా దుపట్టా, సల్వార్ కమీజ్ దుపట్టా, అనార్కలీ దుపట్టా.. ఇవన్నీ సంప్రదాయ తరహాకు చెందినవైతే ఆధునిక వస్త్రధారణలోనూ ఈ డిజైనర్ దుపట్టాలను వాడచ్చు. మీదైన స్టైల్‌ని దుపట్టాతో మెరిపించవచ్చు.
 - ఎన్.ఆర్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement