మిగిలిన ఐఐటీలకు భిన్నం.. | Surya his campus specialties | Sakshi
Sakshi News home page

మిగిలిన ఐఐటీలకు భిన్నం..

Published Sun, Nov 16 2014 11:57 PM | Last Updated on Mon, Oct 22 2018 7:26 PM

మిగిలిన ఐఐటీలకు భిన్నం.. - Sakshi

మిగిలిన ఐఐటీలకు భిన్నం..

ఐఐటీ - ఇండోర్ కొత్తగా ఏర్పడినప్పటికీ మిగిలిన ఐఐటీలకు ఏ మాత్రం తీసిపోదు అంటున్నాడు.. బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో సెకండియర్ చదువుతున్న మేర్గు సూర్యతేజ. పరిశోధనలకు, ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేస్తారని అంటున్న సూర్య తన క్యాంపస్ ప్రత్యేకతలను వివరిస్తున్నాడిలా..

 మై క్యాంపస్ లైఫ్
 
తాత్కాలిక క్యాంపస్‌లో..

ఐఐటీ - ఇండోర్ 2009లో ఏర్పడింది. అందువల్ల పూర్తిస్థాయీ క్యాంపస్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం తాత్కాలి క క్యాంపస్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. రూమ్‌కు ఇద్దరు చొప్పున ఉండొచ్చు. బ్యాచిలర్‌‌స డిగ్రీలో కేవలం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్‌ఈ), మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రిక ల్ ఇంజనీరింగ్ కోర్సులు మాత్రమే ఉన్నాయి.
 
అత్యుత్తమ వసతులు
తాత్కాలిక క్యాంపస్‌లో అన్ని వసతులు ఉన్నాయి. క్యాంపస్ అంతా వై-ఫై సౌకర్యం ఉంది. లేబొరేటరీలు అత్యాధునికంగా ఉంటాయి. ముఖ్యంగా మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం జర్మనీ నుంచి అత్యుత్తమ పరికరాలు తెప్పించారు. లైబ్రరీ, క్రీడా మైదానాలు ఉన్నాయి. ఆన్‌లైన్ లైబ్రరీని కూడా విద్యార్థులు వినియోగించుకోవచ్చు. రుచికరమైన దక్షిణ, ఉత్తర భారత వంటకాలు అందించే భోజనశాలలు కూడా ఉన్నాయి.
 
ఫ్యాకల్టీ కొరత ఉన్నా
ఐఐటీ-బాంబే.. ఇండోర్ క్యాంపస్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తోంది. అక్కడ నుంచి విజిటింగ్ ఫ్యాకల్టీ ఇక్కడకు వచ్చి పాఠాలు బోధిస్తున్నారు. ఇక్కడ కూడా ఉన్నంతలో అత్యుత్తమ ఫ్యాకల్టీ ఉన్నారు. బోధనలో రీసెర్చ్ ఓరియెంటేషన్, ప్రాక్టికాలిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుత సమాజంలో ఎదురవుతున్న సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను సూచించేలా బోధిస్తారు. మూడే బ్రాంచ్‌లు కావడం.. ఒక్కో బ్రాంచ్‌లో 40 మంది విద్యార్థులు మాత్రమే ఉండటం వల్ల ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది. బోధనలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), ఆన్‌లైన్ వీడియోలు, ప్రొజెక్టర్‌లు ఉపయోగిస్తారు.

వీటివల్ల ఆయా అంశాలపై విద్యార్థులకు సులువుగా పట్టు లభిస్తుంది. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉన్న సమయంలో మధ్యాహ్నం వరకు తరగతులు, తర్వాత నుంచి ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. వారంలో మూడు రోజులు ట్యుటోరియల్ సెషన్ కూడా ఉంటుంది. విద్యార్థులకు అకడమిక్‌పరంగా ఎదురయ్యే సందేహాలను ఈ సెషన్‌లో నివృత్తి చేస్తారు. సీనియర్ స్టూడెంట్స్ కూడా ఎన్నో అంశాల్లో సహాయమందిస్తారు. అవసరమైతేవారు చేసే ప్రాజెక్టులు/పరిశోధనల్లో జూనియర్స్ సహాయం కూడా తీసుకుంటారు.
 
వినూత్న కరిక్యులం
మిగిలిన ఐఐటీలతో పోలిస్తే ఐఐటీ - ఇండోర్ ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకంటే మిగిలిన ఐఐటీల్లో బీటెక్ మొదటి ఏడాదిలో అందరికీ కామన్‌గా.. ఇంజనీరింగ్ ఫండమెంటల్స్‌పై అవగాహన కల్పిస్తారు. ఇక్కడ వాటికి భిన్నంగా ఫస్టియర్ నుంచే విద్యార్థులతో కంప్యూటర్/వీడియో గేమ్స్ డిజైన్ చేయించడంతోపాటు పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యత నిస్తారు. అలా ఏర్పడిందే రేడియో టెలిస్కోప్. దీన్ని బీటెక్ విద్యార్థులే నిర్మించి.. నిర్వహిస్తున్నారు. మిగిలిన ఏ ఐఐటీ లోనూ రేడియా టెలిస్కోప్ లేదు. దేశవ్యాప్తంగా జరిగిన కోడింగ్ కాంపిటీషన్స్‌లో ఐఐటీ - ఇండోర్ ద్వితీయ స్థానంలో నిలిచింది.

ఈ విభాగంలో ఐఐటీల్లోనే మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ఒక సర్వేలోనూ క్వాలిటీ రీసెర్చ్, రీసెర్చ్ పేపర్స్ ప్రచురణలలో కొత్త ఐఐటీలన్నింటిలో ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. ఇంజనీరింగ్ కోర్సులతోపాటే మైనర్ కోర్సులుగా హ్యుమానిటీస్ సబ్జెక్టులను అధ్యయనం చేయాలి. నాలుగేళ్ల కోర్సు పూర్తయ్యేలోపు కనీసం ఐదు హ్యుమానిటీస్ సబ్జెక్టులను పూర్తి చేయాలి. ఎకనామిక్స్, ఇంగ్లిష్ లిటరేచర్, ఫ్రెంచి లాంగ్వేజ్, సైకాలజీ, ఫిలాసఫీ వంటివి ఉంటాయి.

ప్రతి సెమిస్టర్‌కు పరీక్షలు నిర్వహిస్తారు. ఏటా పరిశ్రమలు- విద్యార్థుల మధ్య ఇంటరాక్షన్ కోసం ఇండస్ట్రీ- అకడమియా కాన్‌క్లేవ్‌ను నిర్వహిస్తారు. వివిధ కంపెనీలు/ పరిశ్రమల ప్రతినిధులు, విద్యార్థులు, ఫ్యాకల్టీ ఇందులో పాల్గొంటారు. కంపెనీలు విద్యార్థుల నుంచి ఎలాంటి లక్షణాలు ఆశిస్తున్నారో. అందుకనుగుణంగా ఏయే లక్షణాలను పెంపొందించుకోవాలో తెలుసుకునే సదవకాశం దీని ద్వారా లభిస్తుంది.
 
విదేశీ సంస్థలతో ఒప్పందాలు
ఇన్‌స్టిట్యూట్.. జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వంటి దేశాలకు చెందిన విద్యా సంస్థలతో మౌలిక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా స్టూడెంట్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్, అకడమిక్‌పరంగా పరస్పర సహకారం ఉంటాయి. స్టార్టప్స్ ఏర్పాటు చేయాలనుకునేవారికి క్యాంపస్‌లో మంచి ప్రోత్సాహం లభిస్తోంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆలోచనల నుంచి ఉత్తమమైనవాటిని ఎంపిక చేసి ఫండింగ్ సదుపాయం కల్పిస్తారు.

స్టార్టప్స్ విజయవంతం కావడానికి కావాల్సిన సూచనలు, సలహాలు అందిస్తారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కూడా ప్రతి ఏటా కంపెనీలు ఇచ్చే ప్యాకేజీలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఏడాదికి సగటున రూ. 10 లక్షల వరకు వేతనాలు లభిస్తున్నాయి. గతేడాది గరిష్టంగా ఏడాదికి రూ.60 లక్షల రూపాయల వరకు వేతనాలు అందించా యి. పదికి 7పైన సీజీపీఏ సాధిస్తే మంచి ప్లేస్‌మెంట్ ఆశించొ చ్చు. నాకు ప్రస్తుతం 7.8 (పదికి) సీజీపీఏ ఉంది.
 
స్టూడెంట్ జింఖానా ఆధ్వర్యంలో
క్యాంపస్‌లో ప్రతి ఏటా కల్చరల్ ఫెస్ట్‌లో భాగంగా డ్యాన్సులు, పాటలు, డ్రామాలు.. టెక్ ఫెస్ట్‌లో భాగంగా రోబో కాంపిటీషన్స్ వంటివి ఉంటాయి. ఇంకా ఉగాది, శ్రీరామ నవమి, జన్మాష్టమి, వినాయక చవితి, దీపావళి వంటి పండుగలను బాగా చేస్తాం. చదువు పూర్తయ్యాక సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలనేది నా కోరిక. తద్వారా సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలని కోరుకుంటున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement