IIT - indoor
-
అంజలి చదువుకు కేటీఆర్ ఆర్థిక సాయం
హసన్‌పర్తి: నిరుపేద కుటుంబానికి చెందిన ఓ విద్యార్థినికి మంత్రి కేటీఆర్ చేయూతనిచ్చారు. హనుమకొండ జిల్లా హసన్పర్తికి చెందిన ఆటోడ్రైవర్ మేకల రమేశ్ కూతురు అంజలికి రెండేళ్లక్రితం ఐఐటీ (ఇండోర్)లో సీటు వచ్చింది. అక్కడికి వెళ్లేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో తనకు సాయం చేస్తే ఐఐటీ చదువుతానని అంజలి ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌ను కోరింది. స్పందించిన మంత్రి ఆమె ఆర్థిక పరిస్థితులను తెలుసుకుని అప్పుడే రెండేళ్ల ఫీజు చెల్లించారు. ఇప్పుడు మరో రెండేళ్ల ఫీజుకు సంబంధించిన సాయాన్ని చెక్కు రూపంలో బుధవారం హైదరాబాద్‌లో అంజలికి అందించారు. ఈ సందర్భంగా ఆమె చదువు, భవిష్యత్ ప్రణాళిక గురించి అడిగి తెలుసుకున్నారు. చదువును దిగ్విజయంగా పూర్తిచేసి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అంజలి కుటుంబసభ్యులు మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: రేవంత్‌రెడ్డి కొత్త బిచ్చగాడిలా రాష్ట్రంలో తిరుగుతున్నాడు.. -
దేశంలోనే బెంగళూరు ఐఐఎస్సీ టాప్
సాక్షి, హైదరాబాద్: బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)ను దేశంలో ఉత్తమ విద్యా సంస్థగా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఆ సంస్థ 2019 సంవత్సరానికి గానూ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్‌లను ప్రకటించింది. అందులో ఐఐఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తరువాత స్థానంలో ఇండోర్ ఐఐటీ నిలిచింది. బోధన, ప్రమాణాలు, పరిశోధన, అంతర్జాతీయ స్థాయి తదితర 8 అంశాల్లో సర్వే చేసి ఆ సంస్థ ర్యాంకులను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 1,258 సంస్థలకు ర్యాంకులను కేటాయించింది. అందులో మొదటి ర్యాంకు యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌కు లభించగా, రెండో ర్యాంకు యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జికి లభించింది. అంతర్జాతీయ స్థాయిలో బెంగళూరు ఐఐఎస్సీకి 251–300 ర్యాంకు లభించింది. 351–400 ర్యాంకు ఇండోర్ ఐఐటీకి లభించగా, 401–500 ర్యాంకు బాంబే, రూర్కీ ఐఐటీలకు లభించాయి. రాష్ట్రంలోని ఐఐటీ హైదరాబాద్‌కు 601–800 ర్యాంకు లభించింది. ఉస్మానియా యూనివర్సిటీకి 801–1000 ర్యాంకు లభించింది. వీటితోపాటు కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు ర్యాంకులు లభించాయి. దేశవ్యాప్తంగా 49 విద్యా సంస్థలకు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ ర్యాంకులను ప్రకటించింది. వరల్డ్ ర్యాంకులు ఇవీ.. - 251–300 ర్యాంకులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ - 351–400 ర్యాంకులో ఇండోర్ ఐఐటీ - 401–500 ఐఐటీ బాంబే, ఐఐటీ రూర్కీ - 501–600 ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్, సావిత్రిబాయి పూలే పూణె యూనివర్సిటీ - 601–800 ఐఐటీ హైదరాబాద్, అమృత విశ్వ విద్యా పీఠం, బెనారస్ హిందూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఐఐఎస్సీ పూణె, ఐఐటీ భువనేశ్వర్, ఐఐటీ గౌహతి, ఐఐటీ మద్రాసు, జాదవ్‌పూర్ యూనివర్సిటీ, ఎన్ఐటీ రూర్కెలా, పంజాబ్ యూనివర్సిటీ, తేజ్‌పూర్ యూనివర్సిటీ - 801–1000 ఉస్మానియా యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బిట్స్ పిలానీ, ఐఐటీ ధన్‌బాద్, ఐఐఎస్ఈఆర్ కోల్‌కతా, ఎన్ఐటీ తిరుచురాపల్లి, పాండిచ్చేరి యూనివర్సిటీ. -
టాప్ 200లో 49 భారతీయ వర్సిటీలు
లండన్: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) 2019 సంవత్సరానికి విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్‌లు ప్రకటించింది. 43 దేశాలకు చెందిన 450 విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్‌లు ప్రకటించగా భారత్‌కు చెందిన 49 వర్సిటీలు టాప్ 200లో స్థానం సంపాదించాయి. ర్యాంకింగ్స్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగుళూరు) 14వ స్థానం, ఐఐటీ (బొంబాయి) 27వ స్థానం, ఐఐటీ (రూర్కీ) 35వ స్థానం, ఐఐటీ (ఇండోర్) 61వ స్థానం, జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 64వ స్థానంలో నిలిచాయి. సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్సిటీ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, అమృతా యూనివర్సిటీ ఈసారి టాప్ 150లో స్థానం సంపాదించాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పూణే, ఐఐటీ(హైదరాబాద్) తొలిసారిగా ర్యాంకింగ్‌లో చోటు సంపాదించాయి. 2018లో భారత్ నుంచి 42 వర్సిటీలు స్థానం సంపాదించగా ఈసారి అది 49కి పెరిగింది. టాప్‌లో చైనా వర్సిటీలు చైనాకు చెందిన నాలుగు వర్సిటీలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. జాబితాలో మొత్తం 72 వర్సిటీలతో చైనా అగ్రస్థానంలో ఉంది. భారత వర్సిటీల్లో విద్యాబోధన మెరుగుపడినా ప్రమాణాలతో పోలిస్తే వెనకబడే ఉన్నాయని టీహెచ్ఈ ఎడిటర్ ఎల్లీ బోత్వెల్ తెలిపారు. -
మిగిలిన ఐఐటీలకు భిన్నం..
ఐఐటీ - ఇండోర్ కొత్తగా ఏర్పడినప్పటికీ మిగిలిన ఐఐటీలకు ఏ మాత్రం తీసిపోదు అంటున్నాడు.. బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో సెకండియర్ చదువుతున్న మేర్గు సూర్యతేజ. పరిశోధనలకు, ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేస్తారని అంటున్న సూర్య తన క్యాంపస్ ప్రత్యేకతలను వివరిస్తున్నాడిలా.. మై క్యాంపస్ లైఫ్ తాత్కాలిక క్యాంపస్‌లో.. ఐఐటీ - ఇండోర్ 2009లో ఏర్పడింది. అందువల్ల పూర్తిస్థాయీ క్యాంపస్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం తాత్కాలి క క్యాంపస్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. రూమ్‌కు ఇద్దరు చొప్పున ఉండొచ్చు. బ్యాచిలర్‌స డిగ్రీలో కేవలం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ), మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రిక ల్ ఇంజనీరింగ్ కోర్సులు మాత్రమే ఉన్నాయి. అత్యుత్తమ వసతులు తాత్కాలిక క్యాంపస్‌లో అన్ని వసతులు ఉన్నాయి. క్యాంపస్ అంతా వై-ఫై సౌకర్యం ఉంది. లేబొరేటరీలు అత్యాధునికంగా ఉంటాయి. ముఖ్యంగా మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం జర్మనీ నుంచి అత్యుత్తమ పరికరాలు తెప్పించారు. లైబ్రరీ, క్రీడా మైదానాలు ఉన్నాయి. ఆన్లైన్ లైబ్రరీని కూడా విద్యార్థులు వినియోగించుకోవచ్చు. రుచికరమైన దక్షిణ, ఉత్తర భారత వంటకాలు అందించే భోజనశాలలు కూడా ఉన్నాయి. ఫ్యాకల్టీ కొరత ఉన్నా ఐఐటీ-బాంబే.. ఇండోర్ క్యాంపస్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తోంది. అక్కడ నుంచి విజిటింగ్ ఫ్యాకల్టీ ఇక్కడకు వచ్చి పాఠాలు బోధిస్తున్నారు. ఇక్కడ కూడా ఉన్నంతలో అత్యుత్తమ ఫ్యాకల్టీ ఉన్నారు. బోధనలో రీసెర్చ్ ఓరియెంటేషన్, ప్రాక్టికాలిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుత సమాజంలో ఎదురవుతున్న సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను సూచించేలా బోధిస్తారు. మూడే బ్రాంచ్‌లు కావడం.. ఒక్కో బ్రాంచ్‌లో 40 మంది విద్యార్థులు మాత్రమే ఉండటం వల్ల ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది. బోధనలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), ఆన్లైన్ వీడియోలు, ప్రొజెక్టర్లు ఉపయోగిస్తారు. వీటివల్ల ఆయా అంశాలపై విద్యార్థులకు సులువుగా పట్టు లభిస్తుంది. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉన్న సమయంలో మధ్యాహ్నం వరకు తరగతులు, తర్వాత నుంచి ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. వారంలో మూడు రోజులు ట్యుటోరియల్ సెషన్ కూడా ఉంటుంది. విద్యార్థులకు అకడమిక్‌పరంగా ఎదురయ్యే సందేహాలను ఈ సెషన్లో నివృత్తి చేస్తారు. సీనియర్ స్టూడెంట్స్ కూడా ఎన్నో అంశాల్లో సహాయమందిస్తారు. అవసరమైతేవారు చేసే ప్రాజెక్టులు/పరిశోధనల్లో జూనియర్స్ సహాయం కూడా తీసుకుంటారు. వినూత్న కరిక్యులం మిగిలిన ఐఐటీలతో పోలిస్తే ఐఐటీ - ఇండోర్ ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకంటే మిగిలిన ఐఐటీల్లో బీటెక్ మొదటి ఏడాదిలో అందరికీ కామన్‌గా.. ఇంజనీరింగ్ ఫండమెంటల్స్‌పై అవగాహన కల్పిస్తారు. ఇక్కడ వాటికి భిన్నంగా ఫస్టియర్ నుంచే విద్యార్థులతో కంప్యూటర్/వీడియో గేమ్స్ డిజైన్ చేయించడంతోపాటు పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యత నిస్తారు. అలా ఏర్పడిందే రేడియో టెలిస్కోప్. దీన్ని బీటెక్ విద్యార్థులే నిర్మించి.. నిర్వహిస్తున్నారు. మిగిలిన ఏ ఐఐటీ లోనూ రేడియా టెలిస్కోప్ లేదు. దేశవ్యాప్తంగా జరిగిన కోడింగ్ కాంపిటీషన్స్‌లో ఐఐటీ - ఇండోర్ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో ఐఐటీల్లోనే మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ఒక సర్వేలోనూ క్వాలిటీ రీసెర్చ్, రీసెర్చ్ పేపర్స్ ప్రచురణలలో కొత్త ఐఐటీలన్నింటిలో ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. ఇంజనీరింగ్ కోర్సులతోపాటే మైనర్ కోర్సులుగా హ్యుమానిటీస్ సబ్జెక్టులను అధ్యయనం చేయాలి. నాలుగేళ్ల కోర్సు పూర్తయ్యేలోపు కనీసం ఐదు హ్యుమానిటీస్ సబ్జెక్టులను పూర్తి చేయాలి. ఎకనామిక్స్, ఇంగ్లిష్ లిటరేచర్, ఫ్రెంచి లాంగ్వేజ్, సైకాలజీ, ఫిలాసఫీ వంటివి ఉంటాయి. ప్రతి సెమిస్టర్‌కు పరీక్షలు నిర్వహిస్తారు. ఏటా పరిశ్రమలు- విద్యార్థుల మధ్య ఇంటరాక్షన్ కోసం ఇండస్ట్రీ- అకడమియా కాన్క్లేవ్ను నిర్వహిస్తారు. వివిధ కంపెనీలు/ పరిశ్రమల ప్రతినిధులు, విద్యార్థులు, ఫ్యాకల్టీ ఇందులో పాల్గొంటారు. కంపెనీలు విద్యార్థుల నుంచి ఎలాంటి లక్షణాలు ఆశిస్తున్నారో. అందుకనుగుణంగా ఏయే లక్షణాలను పెంపొందించుకోవాలో తెలుసుకునే సదవకాశం దీని ద్వారా లభిస్తుంది. విదేశీ సంస్థలతో ఒప్పందాలు ఇన్స్టిట్యూట్.. జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వంటి దేశాలకు చెందిన విద్యా సంస్థలతో మౌలిక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా స్టూడెంట్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్, అకడమిక్‌పరంగా పరస్పర సహకారం ఉంటాయి. స్టార్టప్స్ ఏర్పాటు చేయాలనుకునేవారికి క్యాంపస్‌లో మంచి ప్రోత్సాహం లభిస్తోంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆలోచనల నుంచి ఉత్తమమైనవాటిని ఎంపిక చేసి ఫండింగ్ సదుపాయం కల్పిస్తారు. స్టార్టప్స్ విజయవంతం కావడానికి కావాల్సిన సూచనలు, సలహాలు అందిస్తారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కూడా ప్రతి ఏటా కంపెనీలు ఇచ్చే ప్యాకేజీలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఏడాదికి సగటున రూ. 10 లక్షల వరకు వేతనాలు లభిస్తున్నాయి. గతేడాది గరిష్టంగా ఏడాదికి రూ.60 లక్షల రూపాయల వరకు వేతనాలు అందించా యి. పదికి 7పైన సీజీపీఏ సాధిస్తే మంచి ప్లేస్మెంట్ ఆశించొ చ్చు. నాకు ప్రస్తుతం 7.8 (పదికి) సీజీపీఏ ఉంది. స్టూడెంట్ జింఖానా ఆధ్వర్యంలో క్యాంపస్‌లో ప్రతి ఏటా కల్చరల్ ఫెస్ట్‌లో భాగంగా డ్యాన్సులు, పాటలు, డ్రామాలు.. టెక్ ఫెస్ట్‌లో భాగంగా రోబో కాంపిటీషన్స్ వంటివి ఉంటాయి. ఇంకా ఉగాది, శ్రీరామ నవమి, జన్మాష్టమి, వినాయక చవితి, దీపావళి వంటి పండుగలను బాగా చేస్తాం. చదువు పూర్తయ్యాక సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలనేది నా కోరిక. తద్వారా సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలని కోరుకుంటున్నాను.