
సాక్షి, హైదరాబాద్: బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)ను దేశంలో ఉత్తమ విద్యా సంస్థగా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఆ సంస్థ 2019 సంవత్సరానికి గానూ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్‌లను ప్రకటించింది. అందులో ఐఐఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తరువాత స్థానంలో ఇండోర్ ఐఐటీ నిలిచింది. బోధన, ప్రమాణాలు, పరిశోధన, అంతర్జాతీయ స్థాయి తదితర 8 అంశాల్లో సర్వే చేసి ఆ సంస్థ ర్యాంకులను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 1,258 సంస్థలకు ర్యాంకులను కేటాయించింది. అందులో మొదటి ర్యాంకు యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌కు లభించగా, రెండో ర్యాంకు యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జికి లభించింది.
అంతర్జాతీయ స్థాయిలో బెంగళూరు ఐఐఎస్సీకి 251–300 ర్యాంకు లభించింది. 351–400 ర్యాంకు ఇండోర్ ఐఐటీకి లభించగా, 401–500 ర్యాంకు బాంబే, రూర్కీ ఐఐటీలకు లభించాయి. రాష్ట్రంలోని ఐఐటీ హైదరాబాద్‌కు 601–800 ర్యాంకు లభించింది. ఉస్మానియా యూనివర్సిటీకి 801–1000 ర్యాంకు లభించింది. వీటితోపాటు కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు ర్యాంకులు లభించాయి. దేశవ్యాప్తంగా 49 విద్యా సంస్థలకు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ ర్యాంకులను ప్రకటించింది.
వరల్డ్ ర్యాంకులు ఇవీ..
- 251–300 ర్యాంకులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
- 351–400 ర్యాంకులో ఇండోర్ ఐఐటీ
- 401–500 ఐఐటీ బాంబే, ఐఐటీ రూర్కీ
- 501–600 ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్, సావిత్రిబాయి పూలే పూణె యూనివర్సిటీ
- 601–800 ఐఐటీ హైదరాబాద్, అమృత విశ్వ విద్యా పీఠం, బెనారస్ హిందూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఐఐఎస్సీ పూణె, ఐఐటీ భువనేశ్వర్, ఐఐటీ గౌహతి, ఐఐటీ మద్రాసు, జాదవ్‌పూర్ యూనివర్సిటీ, ఎన్‌ఐటీ రూర్కెలా, పంజాబ్ యూనివర్సిటీ, తేజ్‌పూర్ యూనివర్సిటీ
- 801–1000 ఉస్మానియా యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బిట్స్ పిలానీ, ఐఐటీ ధన్‌బాద్, ఐఐఎస్‌ఈఆర్ కోల్‌కతా, ఎన్‌ఐటీ తిరుచురాపల్లి, పాండిచ్చేరి యూనివర్సిటీ.
Comments
Please login to add a commentAdd a comment