ఆత్మార్పణే ముక్తిపథం
లోకంలో కనిపించే చెడు అంతా, దురవస్థ అంతా అజ్ఞానప్రభావమే. మానవుడు జ్ఞానిగానూ, విశుద్ధుడుగానూ ఆత్మ బలాఢ్యుడుగానూ, విద్యా వంతుడుగానూ అయిన తరువాతే లోకంలోని దుఃఖం ఉపశమిస్తుంది. అంతేకానీ, ప్రతి ఇంటిని మనం ధర్మసత్రంగా మార్చినా, దేశాన్నంతా చికిత్సాలయాలతో నింపినా, మానవుడి శీలం మార్పు చెందే వరకు దుఃఖం అతడిని వెన్నంటే ఉంటుంది.
ఒక బొమ్మను దేవుడని మనం పూజించవచ్చు. కానీ, దేవుణ్ణి బొమ్మగా భావించరాదు. ప్రతిమలో భగవంతుడున్నాడని తలచడం తప్పుకాదు. భగవంతుడే ప్రతిమ అనుకోరాదు.
దానాన్ని మించిన దొడ్డగుణం మరేదీ లేదు. దేనినైనా ఇతరులకు ఇవ్వడానికి చేయి చాపేవాడు మనుష్యుల్లో మహోత్కృష్టస్థానాన్ని అలంకరిస్తారు. ఎల్లప్పుడూ ఇతరులకు ఇవ్వడం కోసమే చేయి రూపొందించబడింది. మీరు ఆకలితో బాధపడుతున్నా, మీ వద్ద ఉన్న ఆఖరి కబళం వరకూ పరులకు ఇచ్చి వేయండి. ఇతరులకు ఇచ్చేసి మీరు క్షుద్బాధ వల్ల ఆత్మార్పణ చేసుకుంటే, క్షణంలో ముక్తి మీకు ముంచేతి కంకణమవుతుంది. ఇలా చేసిన మంగళ ముహూర్తంలో మీకు పరిపూర్ణత సిద్ధిస్తుంది.