స్ట్రెస్‌లో ఉన్నారా? డాన్స్ చేయండి...
బాలీవుడ్ బాత్
అని సలహా ఇస్తోంది మాధురి దీక్షిత్. ‘ఆందోళనలో ఉన్నప్పుడు చాలా మంది యోగా చేస్తారు. కాని డాన్స్ చేయడం చాలా మంచి ఉపాయం. నేను అదే చేస్తాను’ అందామె. తాజాగా మాధురి దీక్షిత్ తన భర్త శ్రీరామ్ నెనెతో కలిసి టాటా స్కై ద్వారా ఆన్‌లైన్ డాన్స్ అకాడెమీ ‘డాన్స్ స్టుడియో’ ప్రారంభించింది. టాటా స్కై వినియోగదారులు ఈ ఆన్‌లైన్ అకాడెమీ సాయంతో ఇంట్లో నుంచే డాన్స్ పాఠాలు నేర్చుకోవచ్చు.
హిప్ హాప్, సల్సా, టాంగో... వంటి నృత్యరీతులను మాధురి ఔత్సాహికులకు నేర్పనుంది. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ ‘నేను క్లాసికల్ కథక్ డాన్సర్‌ని. సినిమాల్లో వచ్చిన కొత్తల్లో బాలీవుడ్ డాన్సులు ఎలా చేయాలో నాకు తెలియలేదు. సరోజ్ ఖాన్ (డాన్స్ మాస్టర్) మాస్టరే నాకు నేర్పించారు. ముఖ్యంగా ‘తేజాబ్’లోని ‘ఏక్ దో తీన్’... పాటకు ఎన్నో రిహార్సల్స్ చేయించి నాతోటి ఆ డాన్స్ చేయించారు’ అని గుర్తు చేసుకుంది. ‘డాన్స్ అనేది యువతుల కంటే కూడా గృహిణులకే ఎక్కువ అవసరం’ అని ముక్తాయించిందామె.