సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు పెళ్లంటే..ఐటీ, అమెరికా అంటూ సాఫ్ట్‌వేర్ అల్లుళ్ల కోసం వధువు తల్లితండ్రులు పరుగులు పెట్టేవారు. ట్రంప్ దెబ్బతో ఇప్పుడు అమెరికా అంటేనే ఆడపిల్లల తల్లితండ్రులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లతో తమ కుమార్తెలకు వివాహం జరిపించాలని తల్లితండ్రులు ఆరాటపడే పరిస్థితి క్రమంగా మారిపోతోంది. పెళ్లిళ్ల మార్కెట్‌లో భారత టెకీలకు గిరాకీ మసకబారుతోంది. ట్రంప్ ఆంక్షలతో పాటు వేతనాల్లో కోత, లేఆఫ్‌ల వంటి ముప్పులతో ఇంజినీర్‌లను ఎంచుకునేందుకు వధువు తల్లితండ్రులు వెనుకడుగు వేస్తున్నారు.
హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వామికి వర్క్‌పర్మిట్లను నిరాకరించాలన్న ట్రంప్ యంత్రాంగ తాజా యోచన భారత ఐటీ ఇంజనీర్ల వైవాహిక ఆశలను మరింత నీరుగార్చింది. ఐటీ వరులు కావాలంటూ ఇచ్చే ప్రకటనలు సైతం ఇటీవల తగ్గిపోవడం మారుతున్న పెళ్లిళ్ల ధోరణులకు అద్దం పడుతుందని ఓ సర్వే నివేదిక వెల్లడించింది. గత ఏడాది ఆరంభం నుంచే ఐటీ ప్రొఫెషనల్స్‌ను వరుడిగా కోరుకునే యువతుల సంఖ్య తగ్గిపోతూ వస్తోందని వివాహ వెబ్‌సైట్ షాదీ.కామ్ సీఈవో గౌరవ్ రక్షిత్ అంటున్నారు.
అమెరికాలో నివసించే ప్రొఫెషనల్స్‌ను జీవిత భాగస్వాములుగా ఎంచుకోవాలని కోరుకునే మహిళల సంఖ్య కూడా తగ్గిందని చెప్పుకొచ్చారు. ట్రంప్ నిర్ణయాలు టెకీల పెళ్లిళ్లనూ ప్రభావితం చేస్తున్నాయన్నారు. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలీని టెకీల కంటే స్థిరమైన కెరీర్‌తో కూడిన ప్రభుత్వ ఉద్యోగులు, ఐఏఎస్, ఐపీఎస్‌లూ, వైద్యులు, వ్యాపారులు, ఇతర ప్రొఫెషనల్స్ వైపు మొగ్గుచూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment