తేజస్వి చాలా సాధారణమైన అమ్మాయి... మన పక్కింటి అమ్మాయిలాంటిది. అందరినీ తన పక్కింటి వాళ్లే అన్నంతగా ఆదరిస్తుంది... యోగసాధన చేయండి, ధ్యానం చేయండి, బాడీని ఇలా స్ట్రెచ్ చేయండి... రోజులో ఎన్ని పనులున్నా ఒక గంట టైమ్‌ని మీ కోసం కేటాయించుకోండి... అని చెబుతూ ఉంటుంది.
స్ట్రెస్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుకోవడం, మితిమీరిన ఒత్తిడిని బయటకు వదిలేయడం ఎలాగో నేర్పిస్తుంది. ఆఫీస్‌లో కొలీగ్స్‌తో మొదలు పెట్టి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల వరకు విస్తరించింది. ఆ అలవాటే ఆమెని ఇప్పుడు జర్మనీకి పంపిస్తోంది. ఆ ఆసక్తే ఆమెకు జర్మనీలో భారతీయ సంస్కృతిని నేర్పించే బాధ్యతను ఇచ్చింది.తేజస్వి పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. సికింద్రాబాద్‌లోని సెయింట్‌ఆన్స్ గర్ల్స్ స్కూల్‌లో చదివింది. లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఉన్న రామకృష్ణ మఠంలో యోగసాధన, ధ్యానసాధన నేర్చుకుంది.
రామకృష్ణ మఠం నుంచి జర్మనీలోని ఇండియన్ ఎంబసీకి దారి తీసిన తేజస్వి ప్రయాణం ఇది. ‘‘అంత చిన్నప్పుడు ప్రత్యేకమైన లక్ష్యాలతో యోగా నేర్చుకోలేదు, ఇంట్లో అమ్మానాన్నలు ప్రాక్టీస్ చేస్తుండటంతో అలవాటైంది. నాన్న చార్టర్డ్ అకౌంటెంట్, అమ్మ గృహిణి. వాళ్లిద్దరికీ ధ్యానసాధన అలవాటుండేది. ఇంజనీరింగ్ పూర్తయ్యాక బెంగళూరులో హెచ్‌పిలో ఉద్యోగంలో చేరాను. బెంగళూరులో పోస్టింగ్ రావడం నా అదృష్టమనే చెప్పాలి. అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసులకు వెళ్లే అవకాశం కలిగింది.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసుల్లో నేర్చుకున్న నాలెడ్జ్‌ని అప్లయ్ చేయడానికి నా సాఫ్ట్‌వేర్ కంపెనీ చక్కటి వేదికైంది. ఐటీ రంగంలో వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్‌ని అదుపులో పెట్టుకోవడానికి మనవంతుగా కొంత సాధన అవసరం. అలాగే ఒత్తిడిని వదిలించుకోవడం కూడా చాలా అవసరం. అయితే నేను నేర్చుకున్న నాలెడ్జ్ మొత్తాన్ని యథాతథంగా కుమ్మరిస్తానంటే వినే ఓపిక, టైమ్ ఎవరికీ ఉండవు. అందుకే ఆ ఉద్యోగంలో ఉండే వారికి ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాను. కొన్ని గంటలు పని చేసిన తరవాత సీట్లోనే కూర్చుని బాడీని స్ట్రెచ్ చేయడం, నిలబడి ఐదు నిమిషాల పాటు బాడీని ట్విస్ట్ చేయడం, నెక్ ఎక్సర్‌సైజ్, షోల్డర్ స్ట్రెచ్ చేయడం, ఐ ఎక్సర్‌సైజ్ చేయించేదాన్ని.
యోగా హైకింగ్! : మన కొలీగ్స్ మాత్రమే ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, సొసైటీ మొత్తం ఆరోగ్యకరంగా ఉండాలి... అలా ఉండాలంటే నా సర్వీస్‌ని విస్తృతం చేయాలనిపించింది. హెచ్‌పీలో ఏడేళ్ల అనుభవాన్ని వదిలేశాను. ‘సిట్ అండ్ కామ్’ అని సొంత స్టార్టప్‌తో యోగ, మెడిటేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్పిస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్స్‌లో ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాను. ప్రైవేట్ స్కూళ్లలో మినిమమ్ ఫీజుతో సర్వీస్ ఇస్తున్నాను. ఈ రంగాన్ని చాదస్తంగా చూస్తారు. దానిని డైలీ లైఫ్‌తో ఇన్‌కార్పొరేట్ చేయగలిగాను. ట్రెక్కింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ చేసే వాళ్లకు ‘యోగా హైకింగ్’ని పరిచయం చేశాను. ఈ ప్రాక్టీస్‌తో వాళ్లు ట్రెక్కింగ్‌లో త్వరగా అలసిపోకుండా దృఢంగా ఉంటారు.
ఒప్పించాను... మెప్పించాను: ఉద్యోగం మానేయాలన్నప్పుడు ఇంట్లో కొంత వాగ్వాదం జరిగింది. నీకు ఇష్టమైన రంగాన్ని హాబీగా కొనసాగించుకోవచ్చు కానీ ఉద్యోగం మానేసి మరీ కల్చరల్ స్కిల్స్‌ని విస్తరింపచేయాలనుకోవడం కరెక్ట్ కాదన్నారు. ఉద్యోగంలో వచ్చినంత రాబడి ఉండేలా, ఆర్థిక ఇబ్బంది రాకుండా చూసుకోగలను. కెరీర్ పరంగా అంతకంటే మంచి పొజిషన్‌లో స్థిరపడతాను... అని అమ్మానాన్నలను ఒప్పించాల్సి వచ్చింది. ఆ టైమ్‌లో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ గంటలు శ్రమించాను.
ఇచ్చిన మాట వెంటాడింది!: ఉద్యోగాన్ని వదిలిన తర్వాత అంతకంటే మంచి పొజిషన్‌లో స్థిరపడతానని పేరెంట్స్‌కి ఇచ్చిన మాట వెంటాడుతుండేది. యోగ, ధ్యానంతో ఇంకా ఏయే అవకాశాలుంటాయోనని అన్వేషించాను. ఆయుష్ పెట్టిన క్యూసీఐ పరీక్షలో పాసయ్యాను. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగాని విస్తృతం చేయడానికి విదేశాలకు కూడా పంపిస్తారని తెలిసి మినిస్ట్రీలో సంప్రదించాను. అప్పటికే వారి ఎంపిక పూర్తయింది. అయితే అప్పుడే తెలిసింది మన గవర్నమెంట్ కొత్తగా కల్చరల్ టీచర్ అనే కొత్త పోస్టును క్రియేట్ చేసిందని. ప్రతి దేశంలో ఉండే మన ఎంబసీలకు ఒక్కొక్కరిని నియమిస్తారు. నేను జర్మనీలో ఉండే ఇండియన్ ఎంబసీకి సెలెక్ట్ అయ్యాను.
కల్చరల్ టీచర్స్ ఆయా దేశాలలో ఇండియన్ కల్చర్ గురించి తెలియచేస్తారు. ఆ దేశాల్లో ఉన్న భారతీయులను సంఘటితం చేయడానికి కూడా ఇవి పనికొస్తాయి. వారిని ఇండియన్ కల్చర్‌తో మమేకం చేయడం, ఒక వేదిక మీదకు తీసుకురావడం వంటివన్నీ ఉంటాయి. ఇప్పటి వరకు క్లాసికల్ డ్యాన్స్ వంటి కొన్నింటికే ప్రాతినిధ్యం ఉండేది. ఇప్పుడు యోగా, ధ్యానం కూడా విస్తృతంగా పరిచయమవుతాయి. నాకు ఇష్టమైన రంగంలో పని చేయడమే కాకుండా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉంది’’.
– తేజస్వి, కల్చరల్ టీచర్
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment