థాంక్యూ మేడమ్ | thank you madam | Sakshi
Sakshi News home page

థాంక్యూ మేడమ్

Published Thu, Feb 4 2016 11:27 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM

వృత్తి బాధ్యతలకు అతీతంగా వికాస్, వారధిలతో యువతకు ఉపాధి కల్పిస్తున్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్..

వృత్తి బాధ్యతలకు అతీతంగా వికాస్, వారధిలతో యువతకు ఉపాధి కల్పిస్తున్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్..

చదువు ఒక  ఒడ్డున... ఉద్యోగం ఇంకో ఒడ్డున... యువతకు నిరుద్యోగమన్న భవసాగరాన్ని దాటించే ప్రయత్నమే నీతూ ప్రసాద్ ఐఏఎస్ కట్టిన వారధి. కలెక్టర్‌గా బాధ్యతలను, విధులను నెరవేరిస్తే మంచి కలెక్టర్ అనిపించుకునేవారు. అంతకుమించి చేస్తున్నారు కాబట్టే మంచి మనిషి అనిపించుకుంటున్నారు. కరీంనగర్ యువత ప్రతిరోజూ ఆమెను మనస్ఫూర్తిగా థాంక్యూ మేడమ్ అని తలచుకుంటున్నారు.
 
ఐఏఎస్ కావాలనేది నీతూ చిన్నప్పటి కల. తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీర్, ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఎంత క్రేజో బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఐఏఎస్‌కు అంత మోజు. స్కూల్లో ఎవరైనా బాగా చదివితే కలెక్టర్ అవుతావని ప్రోత్సహిస్తారు. అలాగే పాఠశాల విద్య నుంచే చాలా చురుకుగా ఉన్న నీతూను టీచర్లు, బంధువులు కలెక్టర్ అవుతావు అనేవాళ్లట. ఆ మాటను నిజం చేసుకోవడానికి కష్టపడుతూ వచ్చింది. టెన్త్ వరకు ఒక ఎత్తయితే ఇంటర్ నుంచి మరో ఎత్తు.  ఇంటర్‌లో ఉన్నప్పుడే ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. నీతూను మైగ్రేన్ తీవ్రంగా బాధించింది. ఒక దశలో పుస్తకం తెరవడం కూడా దుర్భరమై ఐఏఎస్ అనే తన లక్ష్యాన్ని  చేరుకోలేనేమోనని కలత చెందింది.ఆ పరిస్థితుల్లో  మహాభారతంలోని అర్జునుడు స్ఫూర్తిగా నిలిస్తే తండ్రి పోత్సాహాన్నిచ్చాడు.  అలా 2001లో సివిల్స్‌కి ఎంపికై శిక్షణ పూర్తిచేసుకొని  భద్రాచలం సబ్‌కలెక్టర్‌గా తొలి పోస్టింగ్‌తో తెలుగురాష్ట్రాల్లో బాధ్యతలు చేపట్టింది. ఏ పోస్టులో ఉన్నా ఆ పోస్టులో ఒదిగిపోయి  అంకితభావంతో పనిచేయడం నేర్చుకుంది. ఏ పోస్ట్‌లో ఉన్నా దానికి అనుగుణంగా  నైపుణ్యాన్ని పెంపొందించుకోవడమే ఆమెకు  ప్రధానం.

సేవకు కొత్తమార్గాలు..
 సాధారణంగా ఏ ఐఏఎస్ అయినా తొలుత జిల్లా కలెక్టర్లుగా చేసి ఆ తర్వాత వివిధ శాఖల్లోకి వెళ్లాలనుకుంటారు. కానీ నీతూప్రసాద్ మాత్రం అందుకు భిన్నం. ఆమె మొదట వివిధ శాఖల్లో పనిచేశాక కలెక్టర్‌గా వెళ్లింది. ‘అలా ఆయా శాఖల్లో పని చేయడం వల్ల ఆ పాలనా అనుభవం కలెక్టర్ అయ్యాక చాలా హెల్ప్ అయింది’ అంటారామె. ఆ అనుభవం ఆమెకు ఒకటి అర్థం చేయించింది. అదేమిటంటే చాలా మందికి ప్రభుత్వ ఉపాధి అందటం లేదు. ఉద్యోగికీ ఉపాధికీ మధ్య చాలా అడ్డంకులున్నాయి. వాటిని తీసి వేసి నేరుగా ఉపాధి అందించాలి అని అనుకున్నారామె. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యత తీసుకోగానే అలా వికాస్  సొసైటీకి నాంది పలికారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా వారధి అనే సొసైటీకి ప్రాణం పోశారు. ఇది ప్రస్తుతం ఎందరో నిరుద్యోగులకు ఉపాధి మార్గాలను చూపుతోంది. ఈ రెండు సొసైటీలు ఆమె బ్రెయిన్ చిల్డ్రన్!

ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు చెక్
ఔట్‌సోర్సింగ్‌లో ప్రైవేట్  ఏజెన్సీలకు చెక్‌పెట్టాలనే సదుద్దేశంతో కరీంనగర్ జిల్లాలో ‘వారధి’ అనే సొసైటీని ప్రారంభించింది నీతూ ప్రసాద్. ఇది ఆమె వ్యక్తిగత శ్రద్ధకు ప్రతిరూపం. తొమ్మిదినెలల కిందట మొదలైన వారధి  దాదాపు 4 వేల మందికి ఉద్యోగాలు కల్పించింది. మరోమూడు వేల మంది యువతకు వివిధ ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణనిచ్చింది. ఇప్పటి వరకు సుమారు 25 వేల మంది నిరుద్యోగులు వారధిలో దరఖాస్తు చేసుకున్నారంటే ఈ సొసైటీ పట్ల యువతకున్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.  ప్రతియేటా ఔట్‌సోర్సింగ్  ఏజెన్సీ నిర్వహణ కోసం ప్రభుత్వం విడుదల చేసే 3 శాతం కమీషన్ సొమ్ముతోనే  వారధి సొసైటీలోని ఉద్యోగులకు జీతాలు, శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన కల్పించే ఉద్యోగాలన్నింటినీ వారధి ద్వారానే చేపడుతుండడంతో అర్హులైన వారికే ఉద్యోగాలు దక్కుతున్నాయి.  ఈ ఏడాది సెస్టెంబర్ 10న వారధి ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో జాబ్‌మేళాలో  30 కంపెనీలు 2801 మంది నిరుద్యోగులకు వివిధ ఉద్యోగాలను కల్పించాయి. గ్రూప్-1, 2, 3తోపాటు బ్యాంకింగ్ రంగంలోని ఉద్యోగాల కోసం యువతకు ఈ సొసైటీ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. ఇప్పటికే సుమారు రెండువేల మంది ఈ సొసైటీ ద్వారా ఆయా ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ పొందారు. వారధి సొసైటీ వద్ద దరఖాస్తు చేసుకునే నిరుద్యోగుల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ మొదలు ఐటీఐ, పీజీ కోర్సులు, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు చేసినవారూ  ఉన్నారు. వీరి అర్హతలకు తగినట్లుగా ప్రభుత్వ, ప్రై వేటు కొలువులు సాధించేందుకు వీలుగా నిష్ణాతులైన ఫ్యాకల్టీలచే ఉచిత బోధనను అందిస్తున్నారు.  మెట్రో నగరాల్లో పేరుగాంచిన ప్రై వేట్ కోచింగ్ సెంటర్లకు దీటుగా వారధి ఉండడం విశేషమే కాదు నీతూప్రసాద్ కృషికి తార్కాణం కూడా!
 - పసునూరు మధు, సాక్షి ప్రతినిధి, కరీంనగర్
 
కలెక్టర్ పోస్టు అనేది చాలా బాధ్యాతాయుతమైంది. ఎన్ని విపత్తులు ఎదురైనా అధిగమించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాలను మరింత మెరుగ్గా అమలు చేయడమే నా ప్రధాన బాధ్యత. ఆరోగ్యం, విద్య అనేవి ఏ కలెక్టర్‌కైనా పునాదులే. ఈ రెండింటినీ వృత్తికి అతీతంగా కూడా  నిర్వహించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాకు ఎన్నో పథకాలు, ప్రాజెక్టులు మంజూరు చేసింది. రోడ్లకు వందల కోట్ల రూపాయలు కేటాయించింది. ఇవిగాక ఎన్నో ప్రాజెక్టు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ నిర్ణీత సమయంలోగా పూర్తి చేయడం నా ముందున్న  లక్ష్యం. సకాలంలో పనులు పూర్తయితేనే మంచి ఫలితాలు వస్తాయి.
 - నీతూప్రసాద్
 
వారధిలో మొదటి ఉద్యోగి
 వారధి కండక్ట్ చేసిన ఫస్ట్ ఇంటర్వ్యూలో ఫస్ట్ ఉద్యోగిని నేనే.  వారధి మేనేజర్‌గా నాకు జాబ్ దొరికింది. అంకితభావంతో పనిచేస్తున్నానని కలెక్టరమ్మ మెచ్చుకున్నారు.  - విష్ణువర్ధన్
 
కొండంత ధైర్యం ..
మేం ముగ్గురం ఆడపిల్లలమే. నేను మూడో అమ్మాయిని. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంది.  ప్రజావాణి ద్వారా కలెక్టర్‌ను కలిసి ఉద్యోగం కోసం రిక్వెస్ట్ చేస్తే  వెంటనే స్పందించి  వారధి ద్వారా  కేజీబీవీలో అటెండర్ ఉద్యోగం ఇప్పించారు. ఈ ఉద్యోగం నాకు జీతాన్నే కాదు కొండంత ధైర్యాన్నీ ఇచ్చింది.
  - నిరోష
 
ఆధారం చూపారు..
నాకు భర్త లేడు. ముగ్గురు పిల్లలు. అమ్మాన్నా, అత్తామామా ఎవరూ పట్టించుకోరు. కలెక్టరమ్మను వేడుకుంటే దారి చూపింది. వారధి ద్వారా నాకు ఉద్యోగమిప్పించింది. ఎస్టీ స్టడీ సర్కిల్‌లో అటెండర్‌పోస్టులో పెట్టించింది. కలెక్టరమ్మను మరువను.
 - గాలిపెల్లి స్వరూప
 
కూతుర్ని చదివించుకుంటా
నా భర్త విడాకులిచ్చాడు. ఒక కూతురు, కష్టపడి చదివించే సమయంలో భర్త దూరమవడంతో పోషణే భారమయ్యింది. బీటెక్ చదువుతున్న కూతురు చదువును మధ్యలోనే  ఆపించేయాల్సిన  పరిస్థితి వచ్చింది. కలెక్టరమ్మను కలుసుకుని  నా గోడు చెప్పుకున్న. వారధి ద్వారా కేజీబీవీ మల్లారంలో కొలువునిచ్చి దేవతగా నిలిచింది.
 - భూక్య సమ్మక్క
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement