ఆ నేడు 15 అక్టోబర్, 1969
అణువణువూ నినాదమై...
‘యుద్ధాలు ఎందుకు?’ అనే సీరియస్ ప్రశ్నకు, ఎవరో ఇచ్చిన సరదా సమాధానం...‘యుద్ధాల కోసమే!’ చరిత్రలో చాలా యుద్ధాలు ఈ కోవకే చెందుతాయి. ‘వియత్నాం వార్’ను ఈ కోవలోనే చేర్చినా... ఇంకా చెప్పుకోవడానికి అది మాత్రమే సరిపోదు. వియత్నాం వార్ అంటే... రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధం అని చరిత్ర అంటుంది. చాలామంది మాత్రం ఈ చారిత్రక నిర్వచనానికి భిన్నంగా స్పందించారు. ‘అది యుద్ధం కాదు’ అన్నారు. ‘బలమైన ఏనుగు చలి చీమపై కయ్యానికి కాలుదువ్వడం’అన్నారు. ‘బలహీనుల బలమైన ఐక్యత ముందు బలవంతుడు ఎలా బలహీనుడవుతాడో చెప్పిన యుద్ధం’ అన్నారు. సుమారు ఇరవై ఏళ్ల సాగిన వియత్నాం వార్‌లో... ఆస్తినష్టం, ప్రాణనష్టం ఎంతో జరిగింది. ఈ యుద్ధం నుంచి అమెరికా ఏం బావుకుంది?అనే ప్రశ్నకు కొందరు చెప్పే సమాధానం ‘గుణపాఠం’!
అగ్రరాజ్యం అమెరికా గుణపాఠం నేర్చుకుందా, పాత పాఠాలనే మళ్లీ మళ్లీ వల్లిస్తుందా అనేది వేరే విషయంగానీ వియత్నాం వార్‌ని ఆపడానికి ప్రజాస్వామిక వాదులు, శాంతికాముకులు చాలా ప్రయత్నాలే చేశారు. ఈ శాంతి ఉద్యమంలో ప్రపంచమే కాదు... అమెరికా కూడా ఉండడం విశేషం! వియత్నాం వార్‌పై మారటోరియం విధించాలని అమెరికాలో ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. మేధావులే కాదు సామాన్యులు కూడా ఈ శాంతి ఉద్యమంలో పాల్గొని తమ యుద్ధ వ్యతిరేఖతను గట్టిగా చాటారు.