అందానికి సింగారం కలప బంగారం
ఆభరణాలు అతివకు అందం. అతివ ధరిస్తేనే ఆభరణాలకు అందం. అందుకే... బంగారం, వెండి, వజ్రం, ప్లాటినమ్.. లాంటి లోహాలే కాదు
అమ్మాయి మేనికి అలంకరణగా మారడానికి కలప కూడా పోటీపడుతోంది. కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి చెందిన ఏటికొప్పాకలో భామల మనసును ఆకట్టుకునేలా కలపతో రూపుదిద్దుకున్న ప్రత్యేక ఆభరణాలు ఇవి...
తయారీ ఇలా!
అంకుడు చెట్టు కలపను తగిన పరిమాణంలో చెక్కి.. బొమ్మలు, ఆభరణాలను అత్యంత నైపుణ్యంతో తయారు చేస్తారు లక్క(చెట్ల నుంచి వచ్చిన జిగురు)ను ‘ఫినిషింగ్’ కోసం వాడుతారు. పసుపు రంగు కోసం పసుపుకొమ్ములను పొడిచేసి, ఉడకబెట్టగా వచ్చిన రసాన్ని లక్కలో కలుపుతారు కరక్కాయ, పాతబెల్లం కలిపి మూడు నెలల పాటు నిల్వ ఉంచి, దీని నుంచి నలుపురంగును తయారుచేస్తారు లేత, ముదురు ఆకుపచ్చ, నీలం రంగుల కోసం... ఇండుప ఆకులను రుబ్బి, ముద్దలా చేసి, నీరు పోసి ఉడకబెట్టి ఆ రసాన్ని లక్కలో కలుపుతారు
తయారుచేసుకున్న ఆభరణాలకు రంగు కలిపిన లక్కను అద్దుతారు
మొగలి చెట్టు ఆకులను ఎండబెట్టి, ఆ ఆకుతో కలప డిజైన్ పై భాగాన్ని ‘షైన్’ చేస్తారు చీర, డ్రెస్ రంగులను చెబితే వాటికి సరిపోలే ఆభరణాలను తయారుచేసి ఇస్తారు.
రోజంతా ధరించవచ్చు...
వేసవిలో ఇతర లోహపు ఆభరణాలు చర్మ సమస్యలు కలిగిస్తుంటాయి. కలపతో తయారైనవి కాబట్టి ఇవి పూర్తిగా పర్యావరణ అనుకూలమైనవి, తేలికైనవి కావడంతో ఈ ఆభరణాలను రోజంతా ధరించినా ఇబ్బంది అనిపించదు. రంగు వెలిసిపోవు కనుక వర్షాకాలంలోనూ నిరభ్యంతరంగా వీటిని ధరించవచ్చు. పగలు వేడుకలకు బాగా నప్పుతాయి.
ఏటికొప్పాకకే ప్రత్యేకం అనదగ్గ ఈ కలప ఆభరణాలు మరెక్కడా దొరకవు. ఈ ఆభరణాలు జీవితకాలం మన్నుతాయి. రూ. 200/- నుంచి లభిస్తున్నాయి. ఈ ఆభరణాలు సంప్రదాయ దుస్తులైన చీరలు,చుడీదార్లు, పంజాబీ డ్రెస్సుల మీదకే కాదు ఆధునిక దుస్తులకూ కొత్త హంగులను అద్దుతున్నాయి. మన హస్తకళా వైభవాన్నిచాటుతున్నాయి.
అవార్డుల కళ
ఏటికొప్పాక గ్రామం కొయ్యబొమ్మల తయారీకి ప్రసిద్ధి. విశాఖపట్టణానికి-ఏటికొప్పాకకి మధ్య దూరం 60 కి.మీ. 200 ఏళ్ల క్రితం నుంచే ఏటికొప్పాకలో కలపతో బొమ్మలు, ఇతర అలంకరణ వస్తువులు తయారుచేయడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఇక్కడి 200 కుటుంబాలు బొమ్మల తయారీలోనే ఉపాధిని వెతుక్కుంటున్నాయి. పదేళ్లుగా నేను ఆభరణాల తయారీని మొదలుపెట్టాను. చెవిలోలాకులు, గాజులు, హారాలు, కేశాలంకరణ సామగ్రి తయారుచేస్తున్నాను. కలపతో చేసిన చేతి గడియారం, పెళ్లి తంతుతో నిండిన హారానికి రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ నుంచి అవార్డు లభించింది.
- పెదపాటి శరత్,
కలప ఆభరణాల డిజైనర్, ఏటికొప్పాక