
లోకంచుట్టిన తొలి వీరురాలు
పీఛేముడ్
ఆధునిక వాహనాలేవీ అందుబాటులో లేని కాలంలోనే జీన్ బారెట్ అనే ఫ్రెంచి మహిళ ప్రపంచాన్ని చుట్టివచ్చింది. పద్దెనిమిదో శతాబ్దిలో ఆమె ఈ సాహసకృత్యం చేసి, ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి మహిళగా చరిత్రలో నిలిచిపోయింది. అడ్మిరల్ లూయీ ఆంటోనీ ఆధ్వర్యంలో ఫ్రెంచి నౌకాదళం 1766లో ప్రపంచాన్ని చుట్టివచ్చేందుకు నౌకాయానాన్ని తలపెట్టింది. అప్పట్లో నౌకాదళంలోకి మహిళలకు అనుమతి ఉండేది కాదు. అయితే, జీన్ బారెట్ పురుషవేషం ధరించి, నౌకాదళంలో చేరింది.
బోగన్‌విల్లె రేవు నుంచి బయలుదేరిన బృందంతో కలసి నౌకపైకి చేరుకుంది. జీన్ బారెట్‌కు మొదటి నుంచి మొక్కలపై ఆసక్తి ఉండేది. ఔషధ మొక్కలపై విస్తృతంగా ఆమె అధ్యయనం సాగించేది. మొక్కలపై పరిశోధనలు సాగిస్తున్న కాలంలోనే వృక్షశాస్త్రవేత్త ఫిలిబెర్ట్ కామర్సన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోకుండానే సహజీవనం సాగించారు. ఆ కాలంలోనే ఫ్రెంచి నౌకాదళంతో కలసి ప్రపంచయాత్ర చేసే అవకాశం ఫిలిబెర్ట్‌కు దక్కింది. ఎలాగైనా బారెట్‌ను కూడా తనతో తీసుకుపోవాలని అతను భావించాడు.
ప్రపంచమంతా తిరిగి మొక్కలపై పరిశోధనలు చేయవచ్చని బారెట్ కూడా ఉత్సాహపడింది. మహిళగా ఆమెను రానిచ్చే పరిస్థితి లేకపోవడంతో పురుషవేషం ధరించి ఫిలిబెర్ట్‌తో కలసి నౌకాయాత్రకు బయలుదేరింది. మూడేళ్ల యాత్ర తర్వాత కొందరు నావికులు ఆమెను మహిళగా గుర్తించారు. దీంతో మార్గమధ్యంలోనే ఫిలిబెర్ట్‌ను, బారెట్‌ను అప్పటి ఫ్రెంచి పాలిత ప్రదేశమైన మారిషస్‌లో విడిచిపెట్టారు.