వినూత్న ఫీచర్లతో నికాన్ డీ5500..
కెమెరాలు హైటెక్ హంగులు సమకూర్చుకుని చాలాకాలమైనప్పటికీ జపనీస్ కంపెనీ నికాన్ మరో అడుగు ముందుకేసి మరిన్ని అదనపు ఫీచర్లతో తాజాగా డీ 5500 కెమెరాను మార్కెట్‌లోకి తెచ్చింది. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ల కోసం ఉద్దేశించిందైనప్పటికీ ఫొటోగ్రఫీని చాలావరకూ సులభతరం చేయడం ద్వారా సామాన్యులు కూడా దీన్ని అలవోకగా ఉపయోగించవచ్చు. డీఎక్స్ ఫార్మాట్‌లో 24.2 మెగాపిక్సెళ్ల రెజల్యూషన్ ఫొటోలను అందించే డీ5500లో వేరీయాంగిల్ ఎల్‌సీడీ మానిటర్, టచ్‌స్క్రీన్ కంట్రోల్ దీంట్లోని చెప్పుకోదగ్గ రెండు ఫీచర్లు. ఫొటోలు తీసేటప్పుడు ఎల్‌సీడీలోని టచ్ సెన్సిటివ్ ఆపరేషన్స్ ఏవీ పనిచేయవు.
ఫలితంగా అనుకోకుండా కమాం్డడ్స్ నొక్కుకుపోయి ఫొటోల్లో తేడా వచ్చే ప్రమాదం తప్పుతుంది. వ్యూఫైండర్ దగ్గరి నుంచి కన్ను తొలగిన వెంటనే ఇమేజ్ రివ్యూ ఆపరేషన్లు వాటంతట అవే ప్రారంభం కావడం, ఎల్‌సీడీ మానిటర్ ఆన్/ఆఫ్‌లను నియంత్రించడం ద్వారా బ్యాటరీని ఆదా చేయడం మరికొన్ని ఫీచర్లు. వచ్చే నెల నుంచి అందుబాటులోకి వచ్చే ఈ డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరా ఖరీదు లెన్సులను బట్టి రూ.55 వేల నుంచి రూ.69 వేల వరకూ ఉంది.