పిల్లలు గోళ్లు కొరుకుతూనే ఉన్నారా?
సెల్ఫ్ చెక్
పిల్లలకు నోట్లో వేలు వేసుకోవడం, గోళ్లు కొరకడం సులభంగా అలవాటవుతాయి. వాటిని మాన్పించడానికి తల్లి సహనాన్ని అరువు తెచ్చుకోవలసిందే. ఇలాంటప్పుడు ఏం చేస్తారు?
1. గోళ్లు కొరకడం లేదా నోట్లో వేలు వేసుకోవడం అనేది పైకి కనిపించే లక్షణమేనని, ఇందుకు పిల్లలు మానసిక ఘర్షణకు లోనుకావడం కూడా కారణం కావచ్చని ఆలోచిస్తారు.
ఎ. అవును బి. కాదు
2. స్కూలు, హోమ్‌వర్క్ లేదా ఇతర పిల్లలతో ఆడుకోవడంలో సరిగా కలవలేక పోవడం... ఇలా ఏ విషయంలో ఆందోళన పడుతున్నారో గమనించి దానిని పరిష్కరిస్తారు.
ఎ. అవును బి. కాదు
3. గోళ్లు కొరకవద్దని, నోట్లో వేలు వేయకూడదని ఆంక్షలు పెడితే అలవాటు మానలేరని, పైగా మరింత మొండిగా పంతాన్ని నెగ్గించుకోవాలనుకుంటారని మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
4. వేళ్ల మీద కొట్టడం వల్ల ఆ నిమిషంలో ఏడుస్తారు, ఆ బాధ నుంచి సాంత్వన పొందడానికి తిరిగి ఆ అలవాటునే ఆశ్రయిస్తారు.
ఎ. అవును బి. కాదు
5. గోళ్లలో ఇన్‌ఫెక్షన్ చేరుతుందని, నోట్లో పెట్టుకున్నప్పుడు అది కడుపులోకి చేరితే అనారోగ్యమని జాగ్రత్త చెప్పాలి.
ఎ. అవును బి. కాదు
6. నోట్లో వేలు వేసుకుంటే నీ చేతితో ఏదైనా పెడితే నీ ఫ్రెండ్స్ తినరు, అప్పుడు నువ్వు ఎంత బాధపడతావో ఆలోచించమని చెప్తే ఈ అలవాటుని మానడానికి ప్రయత్నిస్తారు.
ఎ. అవును బి. కాదు
7. ఏమీ తోచనప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు కూడా ఇలాగే చేస్తుంటారు. వాళ్లను ఆటలు లేదా ఏదో ఒక యాక్టివిటీలో నిమగ్నమయ్యేటట్లు చూస్తే తమకు తెలియకుండానే మానేస్తారు.
ఎ. అవును బి. కాదు
8. ‘ఒక గంట సేపు గోళ్లు కొరకకుండా ఉండి ఆ తర్వాత మాత్రమే ఈ చాక్లెట్ తినాలి’ అని సరదాగా కండిషన్ పెడితే తమ మీద తాము కంట్రోల్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు.
ఎ. అవును బి. కాదు
మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే పిల్లల పెంపకంలో వాళ్ల సైకాలజీని గమనించి జాగ్రత్తలు తీసుకోవడం మీకు తెలుసు. ‘బి’లు ఎక్కువైతే పిల్లలు చేసే పనులకు దారి తీస్తున్న కారణాలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి.