నెంబర్ వన్ షూటర్! | The number one shooter! | Sakshi
Sakshi News home page

నెంబర్ వన్ షూటర్!

Published Wed, Apr 23 2014 10:42 PM | Last Updated on Tue, Aug 21 2018 3:16 PM

నెంబర్ వన్ షూటర్! - Sakshi

నెంబర్ వన్ షూటర్!

మామయ్య తుపాకుల దుకాణంలో చిన్నారి హీనా సిద్ధు ఆటలు ఆడుకుంటూ ఉండేది.  ఆ తుపాకులను ఎప్పుడూ చూస్తుండడం వల్ల అవి అంటే ఆసక్తి పెరిగింది. బొమ్మ తుపాకీని చేతుల్లోకి తీసుకొని ‘ఢిష్యూం’ ‘డిష్యూం’ అని గాల్లోకి  ఉత్తుత్తి కాల్పులు జరిపేది. షూటింగ్ అనేది ‘ప్రొఫెషనల్ స్పోర్ట్’ అనే సంగతి హీనాకు తెలియని వయసు అది.
 
ఆమె తండ్రి రక్బీర్‌సింగ్ నేషనల్ షూటర్. కుమార్తెను కూడా తన లాగే  షూటర్‌ను చేయాలని సంకల్పించాడు. కథల మాదిరిగా  షూటింగ్‌కు సంబంధించిన విషయాలను హీనా సిద్ధుకు ఆసక్తిగా చెబుతుండేవాడు.
 
‘‘ప్రపంచంలో ఏ మూల షూటింగ్ అనే పదం వినబడినా...నీ పేరు గుర్తుకు రావాలి. నువ్వు నెంబర్‌వన్ కావాలి!’’ అనేవాడు కుమార్తె కళ్లలోకి చూస్తూ.
 
ప్రపంచ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో నెంబర్‌వన్ షూటర్‌గా నిలిచి తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది హీన. ఐయస్‌యస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకోవాలనేది ప్రతి షూటర్ కల. ఆ కలను గత సంవత్సరం నెరవేర్చుకుంది హీన. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన ఐయస్‌యస్‌ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో బంగారు పతకాన్ని గెల్చుకుంది.
 
ఐఎస్‌ఎస్‌ఎఫ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించిన ‘ఫస్ట్ ఇండియన్ షూటర్’ హీనా. పంజాబ్‌లోని లూథియానాకు  చెందిన హీనాకు పెయింటింగ్ అంటే కూడా చాలా ఇష్టం. చక్కగా బొమ్మలు వేస్తుంది. పది సంవత్సరాల వయసు నుంచి బొమ్మలు గీస్తోంది హీనా. బొమ్మలు గీయడం ద్వారా తాను సేద తీరుతానని  చెబుతోంది.
 
‘‘గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటే... నాలోని శక్తిని సరిగ్గా వినియోగించుకోలేదు అనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఆటకు వెళ్లే ముందు గతంలో చేసిన పొరపాట్లను గుర్తుకు తెచ్చుకుంటాను. అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాను. మరింత ఎక్కువగా కష్టపడతాను’’ అంటున్న హీనా సిద్ధును-
 ‘‘మీలో ఉన్న శక్తి  ఏమిటనుకుంటున్నారు?’’ అని అడిగితే-
 ‘‘సాధించాలనే తపన’’ అంటు తన విజయరహస్యాన్ని చెప్పకనే చెబుతుంది.
 
హీనాకు పెయింటింగ్ అంటే కూడా చాలా ఇష్టం. చక్కగా బొమ్మలు వేస్తుంది. పది సంవత్సరాల వయసు నుంచి బొమ్మలు గీస్తోంది హీనా. బొమ్మలు గీయడం ద్వారా తాను సేద తీరుతానని  చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement