
లెక్కల్లో రికార్డు
తిక్క లెక్క
ఒకటి.. రెండు.. మూడు.. ఇలా ఎన్ని అంకెలు లెక్కపెట్టగలరు? వంద వరకు లెక్కపెడితే చాలు కొంచెం అలసట వస్తుంది. మరీ పట్టుదలకు పోతే వెయ్యి వరకు లెక్కపెట్టొచ్చేమో! లెక్కపెట్టడం సరే, అంకెలను అక్షరాల్లో రాయాలంటే..? కలం పట్టుకుని రాయనక్కర్లేదనుకోండి.. కనీసం టైపు చేయాలంటే..? ఆస్ట్రేలియన్ పెద్దమనిషి లెస్ స్టీవర్ట్‌కు ఇలాంటి ఆలోచనే వచ్చింది. టైప్ మెషిన్ ముందు కూర్చుని ఒకటి నుంచి అంకెలను అక్షరాల్లో టైప్ చేయడం మొదలుపెట్టాడు.
వన్ నుంచి వన్ మిలియన్ వరకు... అంటే ఒకటి నుంచి పదిలక్షల వరకు ఇలా టైపు కొట్టాడు. స్టీవర్ట్ 1998 నవంబర్ 25న మొదలుపెట్టిన ఈ టైపింగ్ యజ్ఞం పూర్తయ్యే సరికి పదహారేళ్ల ఏడు నెలలు పట్టింది. ఇన్నాళ్లలో మొత్తం 19,890 పేజీలు టైపు కొట్టి, వాటిని పుస్తకాలుగా బైండ్ చేశాడు. వీటి కోసం వెయ్యి ఇంకు రిబ్బన్లు, ఏడు టైప్ మెషిన్లను ఉపయోగించాడు.