నీలి రిబ్బన్ – ఇంద్రధనుస్సు
సముద్రం మీద ఆగ్రహించి నురగ పొందగా çసుడులు తిరుగుతూ ఎగిరెగిరి పడుతున్న కెరటాన్ని ఎవరో పట్టుకొని ఆకాశంలో తగిలించినట్లు ఒక మేఘం.. ఆ కింద వీధి మొనలో మట్టితో కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు.వాళ్ళ వెనుక దృశ్యం. ఖాకీ నిక్కరు మీద చొక్కా లేదు. వెనుక ‘ఎక్స్’ ఆకారంలో నిక్కరు పట్టీలు. ఆ రెండుప్రక్కల క్రిందకు జాన దూరంలో రాగి రంగులో ఉన్న రెండు జడలు. ఒక జడ చివర నీలిరంగు రిబ్బన్ కట్టి ఉంది. నిక్కరు వేసుకున్నది ఆడపిల్లా లేక జడలు వేసుకున్న మగపిల్లాడా?... తిరిగి చూస్తే ముఖంలో గాని, స్వరంలో గాని భేదం తెలియలేదు. కేవలం బాల్యరూపం. మిగిలిన పిల్లలు కూడా ఇలాగే నిక్కరుతో ఉన్నారు. చింతాద్రిపేట ఆ సన్నని సందులో వరుసగా దుకాణాలు, కూడా చిన్న చిన్న వీధులు. ఒక సైకిలు రిపేరు దుకాణం ముందు.. అది దుకాణం ముందరి భాగమా లేక వీధిలోనడిచేదా? పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. వాళ్ళు అంతా అక్కడి చిన్నచిన్న వీధుల నుండి వచ్చిన వారే!దుకాణదారుడు తన పనిలో నుంచి ఒకసారి ముఖం ఎత్తి వాళ్ళను చూసి చిరునవ్వు నవ్వాడు. సాయంకాలం పూట ఈ రకమైన ఆటలు అక్కడ సాధారణం. గౌను చివర రెండు వ్రేళ్ళతో పట్టుకొని, నెమ్మదిగా ఎత్తిపట్టుకొని, చిరిగిపోయి మాసిన చోటు తెలియకుండా పట్టుకున్న ఆ పిల్ల ‘నేనే! శ్రీదేవిని’ అని ప్రకటించింది.‘‘నిన్న శ్రీప్రియ అని చెప్పావే!’’ అన్నాడు దుకాణదారుడు. ‘‘నిన్న కదా!’’ ఆ చిన్నారి ప్రపంచంలో నేడు అన్నది నిన్న నుంచి ఒక జన్మ దూరం.
తొందర తొందరగా వ్యాపించి పోయిన చీకటి. గాలిలో చల్లదనం. దూరంలో ఎక్కడో మందుగుండు సామాన్లు కాలుతున్నట్లు ఎక్కడో దూరంగా ఆకాశంలో ఉరుములు ఉరుముతున్న శబ్దం. వర్షం వస్తుందేమో! పిల్లలు దాగుడుమూతలు, చెడుగుడు వంటి ఆటలు ఆడుకోసాగారు. దగ్గరలో వాహనాల రద్దీకి, ప్రాణాన్ని నిమిషానికొకసారి పణంగా పెట్టే ఆపదను, వీధిలో చెత్తా చెదారం మధ్య శరీరం మట్టితో నిండిపోయినా లెక్కచెయ్యకుండా ఆడారు. కొందరు తమ సంతోషాన్ని, చిరిగిన బట్టలను నవ్వించడం ద్వారా ప్రదర్శించారు. మరికొందరు నాట్యమాడి, ఆ సందువీధిని రంగస్థలంగా చేశారు.వరుస దుకాణాల్లో ఒక పాన్షాపుకు వచ్చే వాడుకదారుడు, చేతిలో వున్న ఐదు రూపాయల నోటును స్టూలు మీద పెట్టి ఎప్పటిలాగే ‘‘50 గ్రాములు వక్కపొడి!’’ అని చెప్పి అక్కడ గోడమీద వాడిన పూలమాలతో ఉన్న గజలక్ష్మి ఫోటోను చూసి చేతులు జోడించాడు. వాడుకదారుని చూపు వీధి మీద పడింది. వీధిలో పది సంవత్సరాల పిల్లవాడు ఒక ప్లేటులో రెండు గాజుగ్లాసుల్లో కాఫీ తీసుకువెళుతున్నాడు. వీధి మలుపులో ఉన్న గీతా కేఫ్ నుండి ఎవరో తెమ్మంటే, వాళ్ళ కోసం తీసుకుపోయే పనివాడులా ఉన్నాడు. పిల్లవాడు కొంచెం ఆగాడు. ఒక గ్లాసు ఎత్తి కొంచెం కాఫీ గుటక వేశాడు. కళ్ళల్లో మెరుపు. పెదవులను నాలుకతో తుడుచుకున్నాడు. పిదప ఆ గ్లాసును పెట్టేసి రెండవగ్లాసును ఎత్తి ముందు మాదిరిగానే ఒక గుక్కెడు కాఫీ తాగి ఆనందించాడు. ఆ తర్వాత నోరు తుడుచుకొని గంభీరంగా ప్లేటు చేతిలో పెట్టుకొని వేగంగా ముందుకు కదిలాడు. ఆ దృశ్యాన్ని చూసి ‘‘అందరూ దొంగవెధవలు. మోసగాళ్ళు!’’ అన్నాడు వక్కపొడి వాడుకదారుడు. నోరు తెరిచి ఎవర్నో తిట్టినందుకు ఏదో తృప్తి కలిగింది అతడికి. రెండు షాపులు దాటి, ఆడుకుంటున్న పిల్లలపై పడింది అతడి దృష్టి. పాతవైనా రంగుల మయంగా ఉన్న చొక్కాలు, నిక్కర్లు, పావడాలు, గౌనులు. ఆ రంగుల్లో ఆ ఖాకీ దీవిని చప్పున గమనించాడు.
‘‘అరే! నిక్కరు జడలు ఆడా–మగా?’’వక్కపొడి దుకాణదారుడు తల బయటకు పెట్టి చూశాడు. ‘‘మగ పిల్లవాడే! పేరు ఉలగనాథన్. తిరుత్తణిలో పుట్టువెంట్రుకలు తీయించాలని మొక్కుబడి పాపం! వీడు కడుపులో ఉండగానే తండ్రి కన్నుమూశాడు. ఈ వీధిలోనే నాలాగే వక్కపొడి దుకాణం పెట్టుకొని ఉండేవాడు. ‘‘చిన్నాన్’’ ముక్కుపొడి దుకాణం అంటే ఈ ఏరియాలో చాలా ప్రసిద్ధి. కారులో కూడా వచ్చి ముక్కుపొడి తీసుకుపోయే వాళ్ళు. సడన్‌గా ఒకరోజు గుండెపోటు వచ్చి గుటుక్కుమన్నాడు. పాపం! అతడితోపాటే సంపద అంతా పోయింది. వాడి తల్లి అప్పుడప్పుడు కూలిపని, లేదంటే ఏ పని దొరికితే ఆ పని చేసుకొని కడుపు కట్టుకొని పిల్లవాడిని సాకుతోంది. ఈ పిల్లవాడి కోసమే బతుకుతున్నానని తల్లి పదేపదే చెబుతుంది పాపం! వీడిని తిరుత్తణికి తీసుకుపోయి, తలనీలాలు ఇవ్వాలని ఆమెకు ఆశ’’ అన్నాడు దుకాణదారుడు.రిబ్బను కట్టని ఉలగనాథన్ జడ, వాడు గెంతుతూ ఉంటే ఊడిపోయింది. జడలు కట్టిన భాగం గాలిలో ఆడుతూ కంటిలో పడ్తూ ఆటకు అడ్డం పడుతోంది. పిల్లవాడు మాటి మాటికి చికాకుగా ఎడమచేతితో జుత్తును వెనక్కు తోసుకుంటున్నాడు.‘‘ఏం అర్ధనారీశ్వరా! ఒక పిలకకు రిబ్బన్ ఏమైంది?’’ అని పాన్ షాపువాడు అడిగాడు.‘‘నాపేరు అర్ధనారీశ్వరుడు కాదు’’ అని మొదటే సరిదిద్ది, ‘‘మా అమ్మ కట్టలేదు’’ అన్నాడు ఆ పిల్లవాడు.టైము ఉండి ఉండదు. నాలుగు రోజుల పస్తు తర్వాత ఈవేళే ఎక్కడో ఇల్లు కట్టేచోట పని దొరికిందని వెళ్ళింది వీళ్ళ అమ్మ. ఆ మాట ఆ మూడవ ఇంటివాళ్ళు చెప్పారు. వీడికి రిబ్బన్ వేసి కట్టి అందం చూడ్డానికి టైమ్ దొరకాలి కదా?!’’ అన్నాడు సైకిల్ షాపు వాడు.
‘‘ఒక జడ కట్టడానికి టైముంది, ఇంకొక దానికి కట్టడానికి తొందర వచ్చిందా? ఏరా! అర్ధనారీ ఇంటిలో మరో రిబ్బన్ లేదా? లేకపోతే ఒకే జడ వేసుకోవచ్చు కదా! తిరుత్తణి స్వామి వద్దన్నాడా? రెండు జడలు లేకపోతే స్టయిల్‌కు కొరతా?’’‘‘నా పేరు అర్ధనారీ కాదు. ఇంకొక రిబ్బను ఉంది. అది మా అమ్మకు నచ్చలేదు. వద్దంది.’’‘‘మీ అమ్మ పెద్ద మహారాణిరా! తిండిలేక పస్తులు పడివుంటుందిగానీ, నచ్చే రిబ్బన్ నచ్చని రిబ్బన్ ఒకటా?’’‘ఛీ! జడ పూర్తిగా ఊడిపోయింది.’ అని ఉలగనాథన్, ఊడిపోయిన పిలకజుత్తును చేతిలో పట్టుకొని, దానివంక కోపంగా చూశాడు.‘‘ఉన్న రిబ్బన్‌తో కట్టి ఉండొచ్చుకదా మీ అమ్మ? ఇప్పుడు పడు అవస్థ! ఏరా అర్ధనారీ నీవైనా పిలక కట్టుకోకూడదు?’’ అన్నాడు పాన్ షాపువాడు. ఉలగనాథన్ బదులు చెప్పలేదు.‘‘ఏరా! కుర్రాడా! అడుగుతూనే ఉన్నాను నువ్వేం బదులు పలకడంలేదు పొగరా?’’‘‘అర్ధనారీ! అని పిలిస్తే బదులు చెప్పను.’’‘‘శభాష్! బాగా చెప్పావురా! ఇంతలోనే పెద్దమనిషివి అయిపోయావా? సరే పోనీ! నీకు జడ కట్టుకోవడం తెలీదా ఉలగూ?’’‘‘ఉహూ! ఈ శనినివదిలించుకోవాలంటే అమ్మ వినడంలేదు.’’‘‘ఛీ! ఛీ! స్వామికిచ్చేదిరా! శని–గిని అని మాట్లాడకూడదు. కళ్ళుపోతాయి. స్వామిని తలచుకొని మన్నింపుకోరి, చెంపలు వేసుకో!’’ఉలగనాథన్ భయపడి స్వామిని తలచుకోసాగాడు. గీతా కేఫ్‌లో డబుల్ సెవెన్ తాగి చేతిలో జంతికల పొట్లంలోని జంతికలు కొరుక్కు తింటూ వస్తున్న యువజంట, ఈ పిల్లలను చూసి నవ్వుకుంటూ దగ్గరకు వచ్చి, ఒకొక్కరికి ఒకొక్క జంతిక ఇచ్చారు. రెప్పపాటు కాలంలో ఆట ఆగిపోయి, చురుకుగా వాళ్ళ కళ్లు మెరిశాయి. చేతులు ఎండాయి. ఒక చిన్న పాప జంతిక కొంచెం కొరికి, మిగిలింది చివరిన గౌనులో జాగ్రత్తగా ముడివేసుకుంది. ఇంకొక పాప తొందరగా మురికిగా ఉన్న చేతితో జంతికను నోటినిండా కూరుకొని, నోరు అరచేయితో మూసుకొని, జంతికను రెండే రెండు గుటకల్లో మింగేసి మళ్ళీ చెయ్యి చాపింది. ఒక పిల్లవాడు జంతిక తిన్న తర్వాత దట్టంగా మురికి పట్టిన నిక్కరు వెనుక పక్క చేతిని తుడుచుకున్నాడు. ఉలగనాథన్ నోరు ఊరింది. అయినప్పటికి చేతులు వెనక్కు పెట్టుకొని గీరగా ‘‘నాకు వద్దు’’ అన్నాడు.
‘‘ఏరా! బాబూ! ఏం అలా? జంతిక బాగుంటుంది వీళ్ళంతా తింటున్నారుకదా! నువ్వూ తీసుకో!’’ అని ఆ యువజంట బలవంతం చేసింది.ఉలగనాథన్ గట్టిగా ‘‘వద్దు’’ అన్నట్లు తల ఆడించాడు.
కళ్ళు జంతికల మీద పడినప్పుడు కళ్ళల్లో నీరు తిరిగింది. దానితోపాటు నోరు ఊరింది. జంతికను లాక్కోవాలని ఉన్నా, కడుపు ఖాళీగా ఉన్నా కూడా వద్దని చెప్పాడు.‘‘ఊహు! వద్దు!’’‘‘ఏరా?’’‘‘మా అమ్మ ఎవరి దగ్గరా చెయ్యి చాపకూడదు అని చెప్పింది. ఈవేళ పని చేసి కూలి తీసుకొని, నాకు ఒక బన్ తీసుకువస్తానని చెప్పింది.’’‘‘సరే! పోరా! పెద్దగా బెట్టు ఎప్పుడు నేర్చుకున్నావ్? ఊ! తలరాత అలావుంటే ఎవరు మార్చగలరు? పస్తుండు! చెయ్యి చాపడు కదా దొర! పెద్ద జమీందారు పరంపర అనుకుంటున్నాడు. అవునురా అర్ధనారీ..! సారీ! మిష్టర్ ఉలగనాథన్’’ అని వేదనతో కూడిన కోపంతో మాట్లాడి దుకాణం లోపలకు వచ్చి వ్యాపారం గమనించసాగాడు. ఆ వాడుకదారు పోయి, మరికొంత మంది వచ్చారు. వీధిలో జనం వస్తూ పోతూ ఉన్నారు. ఆటలాడుకుంటున్న పిల్లలు ఒకొక్కరే వెళ్ళిపోయారు. వాన చినుకులతోనే సరిపెట్టుకుంది. పెద్దది అవలేదు. ఎక్కడో పడుతున్న పెద్ద వర్షానికి తోకలా మేఘాల్లో ఒక ఇంద్రధనుస్సు తొంగి చూసింది.‘‘ఇంద్రధనుస్సు!’’‘‘రెయిన్ బో!!’’‘‘అక్కడ చూడండి!’’ ‘‘అస్తమిస్తున్న సూర్యుడు రంగురంగులుగా కన్పిస్తున్నాడు. ఇంద్రధనుస్సు కాదు.’’‘‘కాదు! కాదు! ఇంద్రధనుస్సే! పెద్దగా వేరుగా కన్పిస్తుందే! గోళాకారంలో మీదకు పోతోంది చూడండి. తెలియలేదా? అదిగో పచ్చరంగు. ఇంద్రధనుస్సే!’’ఇలా ఎవరెవరో మాట్లాడుతున్నారు. ఉలగనాథన్ అదేం గమనించలేదు. అతడి కంటి ముందు ఇంకా ఆ జంతికే ఉంది. తోటిపిల్లలు జంతికను ‘కటక్’మని కొరుక్కు తింటున్న శబ్దం ఇంకా చెవిలో పడుతూనే ఉంది. నోటిలో ఊరుతున్న నీటిని బయటకు ఉమ్మాడు.మట్టి తడిసిన వాసన. ఇలాంటి చినుకులతో వాన ఆగిపోతే తర్వాత తప్పక ఉక్క పెరిగిపోతుంది. అయితే ఈ క్షణం చల్లగా గాలి వీచింది. శరీరానికి హాయిగా ఉంది. ఒకరకంగా చల్లదనాన్ని అనుభవించాడు. చొక్కాలేని ఉలగనాథన్ రెండు చేతులు గుండెలపై పెట్టుకొని గట్టిగా పట్టుకున్నాడు. గాలి వెయ్యడంతో కళ్ళల్లో పడుతున్న జడను, తల ఊపి వెనక్కు నెట్టుకోవాలని చూశాడు. సైకిలు షాపు వానితో ‘‘మా అమ్మ వచ్చే వరకు ఇలాగే మెట్లమీద కొంచెం కూర్చునేదా?’’ అని అడిగాడు.‘‘సరే!’’ అన్నాడు. ఓ పక్కగా కూర్చున్నాడు. ఆకాశాన్ని చూశాడు. గమనించి చూస్తే నారింజా, పసుపా, నీలమా, పచ్చా! అని భేదం తెలియకుండా కళ్ళను మోసగించి కరిగిపోతాయి. ఆ రంగులు ఒక గుంపులా అర్ధవృత్తాకారంలో ఇమిడి పోయాయి. సాయంకాలం అవగానే ఆకాశం తన విల్లును ఎత్తుకొని మెల్లగా అదృశ్యం కాసాగింది.
‘‘అరే ఉలగూ! కూర్చొనే నిద్రపోతున్నావా? ఆకలి వేస్తోందా?’’కళ్ళు తెరచినప్పుడే, ఇంతవరకూ కళ్ళు మూసుకొని ఉన్నట్లు వాడికి తెలిసింది. ఎదురుగా చూస్తే అమ్మ! ముఖం వికసించింది.‘‘అమ్మా!’’‘‘ఇంటికి పోదామా! ఇంద! ముందు ఇది తిను.’’చేతిలో ఉన్న ఒక పేపరు పొట్లాన్ని, విస్తరాకులో చుట్టిన పొట్లాన్ని అతడికి ఇచ్చింది. లోపల ఒక బన్, మూడు ఇడ్లీలు ఉన్నాయి.‘‘ఇడ్లీ అమ్మా!!’’ పిల్లవాడు సంతోషంగా అన్నాడు.‘‘నీకే! తిను’’‘‘నీకమ్మా?’’‘‘నేను వచ్చేటప్పుడే టీ తాగాను. ఒక బన్ ఉంది. చాలు. ఇంకా డబ్బులు ఉన్నాయి. రాత్రికి వేరేదయినా కావలిసివస్తే కొనుక్కుందాం!’’ అంది. పిల్లవాడు ఆత్రంగా తినసాగాడు. ఆమె చిరునవ్వుతో పిల్లవాడిని చూసింది. ఆ చిరునవ్వు తప్ప వేరే సంతోషం ఆమె ముఖంలో కన్పించడంలేదు. బక్కగా, ఎండిపోయిన శరీరం. బక్కపలచగా ఉండడం చేత నోరు కొంచెం ముందుకు తీసుకువచ్చినట్లు ఉంది. మాసిపోయిన చీర. చెవుల కన్నాల్లో చీపురుపుల్లలు. బోసిమెడ. చేతులకు మట్టి గాజులు. కళ్ళల్లో అలసట. ఆ ఒక్కరోజే పని చేసిన అలసట కాదు. అది జీవిత యాతనవల్ల కలిగిన అలసట. చెప్పాలంటే ఈ వేళ ఆమె మంచి రోజుల్లో ఒకటి. ఈ వేళ పని దొరికింది. తిండి దొరికింది.చెమటతో నిండిన ముఖాన్ని, మెడను చేతులను తుడుచుకుంది. ‘‘రిబ్బను లేకుండా జడ ఊడిపోయింది కదూ!!’’ అని ఆమె కొడుకు ఊడిపోయిన జుత్తును వేళ్ళతో సవరించి జడవేసింది. తరువాత చివరలో ముడివేసింది. లోపల నుంచి ఒక అడుగు పొడవున్న నీలిరంగు రిబ్బన్ తీసింది. ఒక జడకు అందంగా నీలిరిబ్బన్ కట్టింది.‘‘ఇంటిలో ఉన్న ఇంకొకటి నల్లటిది కదూ! అది ఎలా కట్టడం? అది ఎలా నీలిరంగుతో జోడీ అవుతుంది? రెండు జడల్లో ఒకొక్క దానికి ఒకొక్క రంగు రిబ్బన్ కడ్తే అసహ్యంగా ఉండదా? అందుచేత ఈ వేళ దొరికిన డబ్బులతో దీనికి జతగా ఇంకొక నీలిరంగు రిబ్బన్ కొని తెచ్చాను.’’ అని మాట్లాడుతూ ఆ నీలిరిబ్బన్ కొడుకు రెండవ జడకు కట్టింది. రెండు జడల్ని మార్చిమార్చి జోడీగా చూస్తే ఆమె రెండుకళ్ళు కాంతితో నిండాయి.
‘‘ఇప్పుడు ఎంతో బాగుంది. రెండు జడలు వాటి రిబ్బన్లు రెండూ ఒకేరంగులో ముచ్చటగా ఉన్నాయి.’’షాపు మూసెయ్యడానికి తయారుగా వాకిలి తలుపు దగ్గరకు వచ్చిన పాన్‌షాపు వాని దృష్టిలో ఆ దృశ్యం పడింది. రెండు జడలకు వేసిన నీలి రిబ్బన్లతో ఆమె కొడుకు ఉన్నాడు. ఆ వెనుక తల్లి, రెండు రిబ్బన్లు మార్చిమార్చి చూసి, జత అందాన్ని చూసి మురిసిపోతున్న ఆమె కళ్ళల్లో కాంతిని కొంచెంసేపు చూశాక అతడి చూపు ఆకాశంలోకి పోయింది. అక్కడ ఇప్పుడు ఇంద్రధనుస్సు లేదు. ఉరుముల కారణంగా కొంచెంసేపటి వరకు బయటకు వచ్చి అంతర్ధానమైంది ఇంద్రధనుస్సు. అయితేనేం ఆకాశాన్ని ఎంత అందంగా అలంకరించింది. అతడు మళ్ళీ ఉలగనాథన్ తల్లిని చూశాడు. ఆమె తాను కట్టిన రెండవ జడను తృప్తిగా చేతితో పట్టుకొని చూస్తోంది. ఇంద్రధనుస్సు ఆమె చేతిలో ఒక నీలిరిబ్బన్ రూపం దాల్చింది.