గర్భధారణకు సరైన సమయం
గర్భధారణకు సరైన సమయం ఏదీ అనే విషయంలో చాలామందికి సందేహం ఉంటుంది. స్వాభావికంగా మహిళల్లో ముప్పయి ఏళ్ల లోపు గర్భధారణ జరిగితే చాలావరకు అన్నీ సజావుగా జరిగిపోతాయి. కాకపోతే వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే ముప్పులు (రిస్క్‌ఫ్యాక్టర్స్) పెరుగుతుంటాయి. సాధారణంగా 35 ఏళ్ల తర్వాత జరిగే గర్భధారణల్లో పుట్టబోయే పిల్లల్లో అనేక ఆరోగ్యపరమైన రిస్క్‌లతో పాటు అబార్షన్స్‌కు అవకాశం ఎక్కువ.
వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యకరమైన అండం విడుదల సక్రమంగా జరగదు. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ అండం విభజన అంత సక్రమంగా ఉండదు. దాంతో క్రోమోజోముల సంఖ్యలో విభజన సక్రమంగా జరగదు. దాన్ని నాన్‌డిస్‌జంక్షన్ అంటారు. దాంతో పెద్దవయసులోని మహిళల సంతానంలో డౌన్స్ సిండ్రోమ్ వంటివి రావచ్చు. అందుకే 35 ఏళ్లు దాటిన మహిళల్లో గర్భధారణ తర్వాత క్రమం తప్పకుండా డాక్టర్స్‌ను సంప్రదిస్తూ మరింత జాగ్రత్తగా ఉండాలి.
అబార్షన్స్ రిస్క్ ఎక్కువ...
మామూలుగా ఇరవైలలో ఉన్న మహిళల్లో 20 వారాల తర్వాత జరిగే అబార్షన్స్ 12% నుంచి 15% ఉంటాయి. అదే 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న మహిళలకు 20 వారాల తర్వాత అబార్షన్ అయ్యే అవకాశాలు 25% ఉంటాయి.
ఇతర సమస్యలు...
మహిళల్లో 30 ఏళ్లు దాటాక అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గర్భధారణపై కూడా ప్రభావం చూపవచ్చు.పెద్ద వయసు మహిళల్లో పుట్టే పిల్లలు తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంది. ముప్పయయిదేళ్లు దాటిన మహిళల్లో సహజ ప్రసవం జరిగే అవకాశాలు తగ్గుతాయి. సిజేరియన్ చేయాల్సిన సందర్భాలే ఎక్కువ.