ఫేయ్‌మస్
అమ్మాయి బలంగా ఉండటం మన సమాజం చూడలేదా? ధీటుగా మాట్లాడితే తట్టుకోలేదా? కాన్ఫిడెంట్‌గా ఉంటే భరించలేదా? సత్తా చూపిస్తే జీర్ణించుకోలేదా? నేటి ప్రపంచంలో ఫేయ్ డిసూజా కాగడా పట్టుకుని పరుగెడుతున్న కాంతి ఖడ్గం! ఈ అమ్మాయి తెగబడితే మగ పురుగుల నాలుక తెగి పడాల్సిందే! చాటు దాడుల తాటతీసే ఇవాళ్టి సూపర్ గర్ల్!
జూన్ 9... 2017..
సనా ఫాతిమా షేక్ (బాలీవుడ్ నటి) తన తాజా చిత్రం షూటింగ్ స్పాట్ నుంచి బికినీతో ఉన్న ఫొటోగ్రాఫ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దాంతో సనా మీద నిరసన, అసభ్యకరమైన కామెంట్లు వెల్లువెత్తాయి. రమ్‌జాన్ పవిత్ర మాసంలో ఈ సిగ్గుమాలిన చర్యలేంటి? అసలు ఆమె మర్యాదస్తురాలేనా? అంటూ ఆమె వ్యక్తిత్వాన్నీ తూలనాడారు.అంతకుముందే బెర్లిన్‌లో.. మోకాళ్ల వరకు స్కర్ట్ వేసుకొని మోదీ ముందు కూర్చున్న ప్రియాంక మీదా దాదాపు ఇలాంటి కామెంట్లే చేశారు సోషల్ మీడియాలో. ఈ రెండింటి నేపథ్యంలో వచ్చిన ట్రోల్స్ మీద ప్యానల్ డిస్కషన్ పెట్టింది మిర్రర్ నౌ ఎడిటర్ ఫేయ్ డిసూజా!
డిస్కషన్‌లో కొంత మంది ఆ కామెంట్లను ఖండిస్తున్నారు. కొంతమంది సమర్థిస్తున్నారు. ప్యానలిస్ట్‌లో ఒకరైన మౌలానా ఖాస్మి కూడా సమర్థించారు. అసలు ఇలాంటి చిన్న విషయాలను ప్యానల్ డిస్కషన్‌కు తేనేవద్దంటూ కొట్టిపారేశారు. అయినా ఫేయ్ డిఫెన్స్‌లో పడలేదు. ‘మగప్యానలిస్ట్‌లకు ఇదెంత పెటీ ఇష్యూ అయినా నో మ్యాటర్. ఇదే కాదు స్త్రీల ఆత్మాభిమానానికి సంబంధించిన ఇంకా ఇలాంటి ఎన్నో పెటీ ఇష్యూస్‌ను నేను ప్యానల్ డిస్కషన్‌కు తెస్తూంటా’ అంటూ చిరునవ్వుతో స్థిరంగా కౌంటర్ ఇచ్చింది.
మౌలానా వినకుండా తన వాదనను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు ట్రోలర్స్‌కి మద్దతుగా. మధ్యలో ఇంకో మహిళా ప్యానలిస్ట్ చెబుతుంటే కూడా వినకుండా. ఆయన తీరు చూసిన డిసూజా..‘బహుశా.. మౌలానాజీకి ఆడవాళ్ల గొంతువినే అలవాటు లేదనుకుంటా! బికినీ వేసుకోవాలనుంటే వేసుకుంటారు.. ఎవరికి ఏది వేసుకోవాలనుంటే అది వేసుకునే స్వేచ్ఛ ఈ దేశంలో ఉంది’ అంటుండగానే మధ్యలో అడ్డుపడి.. ‘అయితే అండర్‌వేర్ వేసుకొని రండి డిబేట్‌కి.. అప్పుడు మగవాళ్లతో సమానమవుతారు ఆడవాళ్లు’ అని నోరుపారేసుకున్నారు మౌలానా. ఒక్క క్షణం నిశ్శబ్దం స్టూడియోలో.
మౌలానా మాటలకు డిసూజా అదరలేదు.. బెదరలేదు.. స్థయిర్యం అసలే కోలుపోలేదు. అదే చిరునవ్వుతో.. అంతే స్థిరత్వంతో... ‘ఈ ప్యానల్‌లో ఉన్న లేడీస్ అండ్ జెంటిల్‌మెన్.. నేను పురుషుడితో సమానం కావాలంటే అండర్‌వేర్ వేసుకొని రావాలని మౌలానాజీ నన్ను థ్రెట్ చేస్తున్నారు. ఆయన మాటలతో నేను కుంగిపోయి.. నా ప్యానల్ మీద కంట్రోల్ కోల్పోయి నా కర్తవ్య నిర్వహణను మరిచిపోతానని ఆయన ఆశ. లెట్ మి టెల్ యూ మౌనాలాజీ... మీలాంటి వాళ్లను చాలా మందిని చూశా! మీ మాటల ప్రకంపనలతో నేను అదరను.. బెదరను... భయపడను. చాలా చవకబారు మాటలతో నన్ను థ్రెట్ చేశారు.
నా ఉద్యోగం నన్ను చేసుకోనివ్వకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అలా సనా ఫాతిమా తన పని తాను చేసుకుంటుంటే.. సానియా మీర్జా తన పని తాను చేసుకుంటుంటే... మిగిలిన మహిళలంతా వాళ్ల పని వాళ్లు చేసుకుంటుంటే.. మీ మాటలతో వాళ్లను ఇబ్బంది పెట్టి.. భయపెడితే.. వాళ్లు బెదిరిపోయి మళ్లీ వంటింట్లో సెటిల్ అయి ఈ ప్రపంచాన్ని మీకు వదిలేస్తే... అప్పుడు దాన్ని ఆక్రమించుకుందామనుకుంటున్నారేమో మీ మగవాళ్లంతా! అలాంటి ఆశలేవీ పెట్టుకోకండి. మేం బయటి ప్రపంచాన్ని వదిలి ఎక్కడికీ వెళ్లడంలేదు. యెస్ మౌలానాజీ.. ఓ స్త్రీ నడుపుతున్న చానల్ ఇది. కాని మీ తీరు ఆ స్త్రీని భయపెట్టలేదు’ అని జవాబిచ్చింది డిసూజా!
అంతేకాదు అంతకుముందే.. అదే చర్చలో మౌలానా యాసూబ్ అబ్బాస్ అనే ప్యానలిస్ట్ సనా ఫాతిమా షేక్‌ను ‘బాజారు’ అని సంబోధించారు. డిసూజా వెంటనే తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ స్త్రీని అయినా బాజారు అంటే భరించేది లేదు... అంటూ ఆ మాటను ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేసింది. కాని మౌలానా తనేమీ తప్పు మాట్లాడలేదని సమర్థించుకున్నాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ లైవ్ డిబేట్‌లోనే అబ్బాస్‌ను ప్యానలిస్ట్‌గా తొలగించి ఇంకో ప్యానలిస్ట్‌ను హాజరుపర్చింది డిసూజా! దటీజ్ యాన్ యాంకర్, న్యూస్ ప్రెజెంటర్, జర్నలిస్ట్, ఎ ఉమెన్ విత్ గట్స్!
మగాళ్లే రాజ్యమేలుతున్న మీడియా సామ్రాజ్యంలో ఓ స్త్రీ... తన ఆత్మాభిమానం దెబ్బతింటే ఊరుకునేది లేదని.. ఆగ్రహావేశాలతో కాకుండా ఆలోచన కలిగేలా చెప్పింది. ఆడవాళ్ల వస్త్రధారణ, వ్యక్తిగత అభిరుచిని మతానికి, సంస్కృతికి ముడిపెట్టి మహిళల వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా మాట్లాడితే ఎంతటివారైనా సరే సహించేది లేదని చాటి చెప్పింది. యాంకర్ అంటే.. నాట్ ఓన్లీ బ్యూటీ బట్ విత్ బ్రెయిన్స్ అండ్ కరేజ్ అని ప్రూవ్ చేసింది. స్త్రీని కించపరిచేలా ఏ చిన్న కామెంట్ చేసినా ప్యానల్‌కీడుస్తానని హెచ్చరించింది కూల్‌గా.
దటీజ్ ఫేయ్ డిసూజా.. ఇప్పుడు చర్చల్లో వ్యక్తి! సీనియర్ మహిళలకు గర్వకారణం.. జూనియర్స్‌కి ఆదర్శం. టోటల్‌గా ఉమెన్‌కి గౌరవం.. తెచ్చిన లేడీ! మన మీడియాలో మహిళల సమస్యల మీద సరైన తీరులో గళమెత్తే సున్నితమైన ప్రాతినిధ్యం ఎంత అవసరమో రుజువు చేసింది.
ప్రస్తుత ప్రాజెక్టులు
ఈటీ నౌలో ఇన్వెస్టర్స్ గైడ్, ది ప్రాపర్టీ గైడ్, ఆల్ ఎబౌట్ మనీ పేరుతో ప్రోగ్రామ్స్ చేస్తోంది. అలాగే మిర్రర్ నౌ చానెల్‌కు ఎడిటర్‌గా పనిచేస్తోంది. అందులోనే ‘ది అర్బన్ డిబేట్’ పేరుతో ఓ ప్యానల్ డిస్కషన్ షోను హోస్ట్ చేస్తోంది. ఇవి కాకుండా పర్సనల్ ఫైనాన్స్, మనీ మేనేజ్‌మెంట్ అండ్ గోల్ బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ మీద సెషన్స్ కూడా నిర్వహిస్తోంది. ఆర్థికమే కాదు ఫేయ్‌కి ఆహారమూ ఇష్టమే. జర్నలిజంలోకి రాకపోయుంటే జనాలకు భోజనం పెట్టే పనేదైనా చూసుకునే దాన్ని అంటారు.
స్ఫూర్తి...
ఇన్వెస్టర్స్ గైడ్ ప్రోగ్రామ్ చేయడం వల్ల చాలామంది ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్స్‌తో పరిచయం, ఇంటరాక్షన్ కలిగాయి. అలాంటి వాళ్లలో యాక్సిస్ బ్యాంక్ సీఎమ్‌డీ శిఖా శర్మ ఒకరు. ఒకరకంగా ఆమే ఫేయ్‌కి స్ఫూర్తి. ‘చేస్తున్న పనిమీద మనసు లగ్నం చేస్తే.. సాధ్యం కానిది, సాధించలేనిది ఏదీ లేదని మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన వనిత’ అని శిఖాకు కితాబిస్తుంది ఫేయ్. భారతీయ మహిళల కోసం హార్పర్ కొలిన్స్‌తో కలిసి మనీ మేనేజ్‌మెంట్ గైడ్‌లాంటి పుస్తకం మీద వర్క్ చేస్తోంది. ఈ పుస్తకం బహుశా వచ్చే యేడాది రావచ్చు.
స్త్రీకి.. లక్ష్మికి దగ్గరి సంబంధం
మన దేశంలో డబ్బును లక్ష్మీదేవతలా చూస్తారు. స్త్రీని కూడా. అలాగే డబ్బు విలువ కూడా స్త్రీకి తెలిసినంతగా పురుషుడికి తెలియదు. అయినా తొలి నుంచి ఆమె సంపాదనలో లేకపోవడం వల్ల మహిళ మనీ మ్యాటర్స్‌ను డీల్ చేయలేదనే అపోహను పెంచి పోషించారు. కాని డబ్బు విషయంలో పురుషులకన్నా మహిళలే ఎక్కువ ప్రాక్టికల్ అని, మహిళలే సక్సెస్‌ఫుల్ ఇన్వెస్టర్స్ అని పరిశోధనల్లో తేలిన సత్యం. ఇప్పుడు కాలం మారింది. స్త్రీ .. పురుషుడితో సమానంగా సంపాదిస్తున్నా డబ్బును మేనేజ్ చేయలేమనే భయంలోనే ఉంటున్నారు. కానీ వారికి ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి కొంచెం చెబితే చాలు.. చాంతాడంత అల్లుకుపోతారని అర్థమైంది ఫేయ్‌కి. అందుకే కొన్నేళ్లుగా కేవలం మహిళల మీదే ఫోకస్ చేస్తోంది. విమెన్ ఇన్వెస్టర్స్‌ను వెలికి తీస్తోంది.
పెట్టుబడుల రంగంలో ఆడవాళ్లకు ప్రోత్సాహాన్ని కలిగిస్తోంది. డబ్బును మేనేజ్ చేస్తూ దాని మీద నియంత్రణ సాధించినప్పుడే స్త్రీకి ఆర్థికస్వాతంత్య్రం, స్వావలంబన సిద్ధిస్తుందని నమ్ముతుంది ఫేయ్. దాని కోసమే తన షోల ద్వారా పాటుపడుతోంది. మనీ మేనేజ్‌మెంట్‌కి సంబంధించి ఉద్యోగినులకు ఇన్‌స్పిరేషనల్ స్పీచెస్ కూడా ఇస్తోంది.
ఏడు వార్తా పత్రికలు
ప్రతి ఉదయం ఏడు దినపత్రికలను చదువుతుంది. అలాగే ఇంటర్నెట్‌లో అప్‌డేట్స్ చెక్ చేసుకుంటుంది. తన స్క్రిప్ట్‌ను తానే రాసుకుంటుంది. వార్తా పత్రికలే కాకుండా చరిత్ర, సాహిత్యం, ఆత్మకథలు, సమకాలీన రాజకీయాలు, ఆర్ట్, సంగీతానికి సంబంధించిన పుస్తకాలనూ చదువుతుంది.
యాంకర్‌నని అనుకోను..
‘న్యూస్ చానెల్‌లో యాంకర్‌లా నటించను. నా జీవితంలో నాకు కనిపించిన, ఎదురైన మంచిచెడులు తీర్చిదిద్దిన మనిషిగా న్యూస్‌రూమ్‌లో కూర్చుంటా. నన్ను నేను యాంకర్‌గా కంటే కూడా జర్నలిస్ట్‌గానే పరిగణించుకుంటా. నా ఉద్యోగంలో నేను ప్రెజెంట్ చేస్తున్న షో ఒక భాగం మాత్రమే. యాంకరింగ్‌కి గుడ్ లుకింగ్స్ మాత్రమే సరిపోతాయనుకుంటే పొరపాటు. స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ రెస్పెక్టెడ్ యాంకర్స్ అంతా సబ్జెక్ట్స్‌లో ఎక్స్‌పర్ట్స్, స్పెషలిస్ట్‌లే. విషయ పరిజ్ఞానం, అవగాహన చాలా ముఖ్యం. ఈ ఫీల్డ్‌లో తెలియకపోవడం నేరం కాదు. తెలుసుకోక పోవడం నేరం’ అంటుంది ఫేయ్ డిసూజా.
జీఎస్‌టీ మీదా సెగకక్కింది...
మన దేశంలో బ్రెడ్‌తోపాటు సామాన్యులకు అందుబాటులో ఉన్న ఏకైక ఆహారం గ్లూకోజ్ బిస్కట్స్. గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్‌టీ)లో గ్లూకోజ్ బిస్కట్స్‌తో పాటు అన్నిరకాల బిస్కట్స్‌మీద 18 శాతం పన్ను విధించడాన్ని తప్పు పట్టింది ఫేయ్. కిలో వంద రూపాయల కన్నా తక్కువ ధర పలికే ఈ బిస్కట్స్‌ను సెరిలాక్ కొనే స్థోమతలేని కుటుంబాల్లో పిల్లలకు ఆహారంగా పెడుతున్నారు.
పిల్లలకు కాల్షియం, ఐరన్‌ను అందించే పోషకాలుగా కూడా ఉన్న వాటి మీద 18 శాతం టాక్స్ వేయడం సరికాదని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని వాడి, వేడి చర్చను చేపట్టారు. జీఎస్‌టీ కౌన్సిల్‌లో మహిళా సభ్యులు లేనందువల్లే బిస్కట్స్ మీద 18 శాతం టాక్స్ పడిందని.. ఒక్క మహిళా సభ్యురాలున్నా ఈ నిర్ణయం తీసుకునేవాళ్లు కాదని వాఖ్యానించారు.
ఎవరీమె?
ఈటీ నౌ చానెల్ చూసేవాళ్లందరికీ పరిచయం. పెట్టుబడుల రంగం మీద ఆసక్తి ఉన్న వీక్షకులందరికీ సుపరిచితం. ఈటీ నౌ లో ప్రసారమయ్యే ఇన్వెస్టర్స్ గైడ్ ప్రోగ్రాం ఆమెదే. దానికి కర్త, కర్మ, క్రియా అన్నీ ఫేయ్ డిసూజానే. ఎకనామిక్స్ అంటే ఆమెకిష్టం. మనీ, ఇన్వెస్ట్‌మెంట్స్, ఇన్వెస్టర్ రైట్స్, స్టాక్స్, రియల్ ఎస్టేట్.. అంశాలను డీల్ చేయడమంటే ఆసక్తి. ఇన్వెస్ట్‌మెంట్ రంగం.. సంపాదన ఉన్న సామాన్యులను కూడా భయపెడుతుంది. ఆ భయాన్ని బ్రేక్ చేసింది తన టీవీ షోస్‌తో.
ఫైనాన్స్ రంగాన్ని కామన్‌మెన్ ఫ్రెండ్‌ని చేసింది. ఇన్వెస్ట్‌మెంట్‌ను సామాన్యుడి ఇంట్లో కరివేపాకు మొక్కలా నాటేసింది. అందుకే ఆమె షో.. లాంగెస్ట్ రన్నింగ్ షోయే కాదు హయ్యెస్ట్ రేటింగ్ ఉన్న ఫైనాన్స్ షో కూడా. ఆర్థికశాస్త్రంలో ఓనమాలు తెలియని వాళ్లు కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ను రాసేంత నాలెడ్జ్‌ను అందిస్తోంది. మధ్యతరగతి కూడా షేర్స్‌లో షేర్‌లయ్యే అవకాశాన్ని కల్పిస్తోంది. కాబట్టే ఫేయ్ ఫైనాన్స్ జర్నలిస్ట్‌గా అంత ఫేమస్ అయింది.
నేపథ్యం.. కెరీర్
జర్నలిజం, ఇంగ్లిష్ లిటరేచర్‌తో బ్యాచ్‌లర్స్ డిగ్రీ చదివిన ఫేయ్.. మాస్‌కమ్యూనికేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్. పదేళ్ల కిందట సీఎన్‌బీసీ టీవీ 18లో జర్నలిస్ట్‌గా అడుగుపెట్టింది. ముంబైలో ఉద్యోగం. కెరీర్ మొదట్లో ఇన్సూరెన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ సెక్టార్స్‌ను రిపోర్ట్ చేసేది.
స్టేట్ పాలసీ, ఆర్థికనేరాలు, పర్సనల్ ఫైనాన్స్‌లో స్టోరీస్ చేస్తున్నప్పుడు గ్రహించింది ఆమె.. ఉత్పత్తి దారుడికి, కొనుగోలు దారుడికి మధ్య దూరాన్ని తగ్గించే వారధి కావాలని, అది ఈ దేశ సగటు పెట్టుబడిదారుడికి అవసరమని. క్లిష్టమైన అంశాన్ని అందరికీ అర్థమయ్యే పద్ధతిలో చెప్పించేందుకు చాలా కష్టపడింది. ఆర్థికనిపుణులను.. సరళమైన భాషను వాడే వక్తలను వెదికి పట్టుకుంది. ఆర్థికరంగాన్ని సగటు భారతీయుల పాకెట్స్‌లో సర్దేసింది. దానికోసం ఒక్క టీవీ షోనే కాదు.. రేడియోవన్ ముంబై, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనమిక్ టైమ్స్, ఫెమినా, ట్విట్టర్, ఫేస్‌బుక్, బ్లాగ్‌లనూ వేదికగా మలచుకుంది.