షబానా అజ్మీ జగద్విఖ్యాత ఫెమినిస్ట్. 74 ఏళ్ల ఈ వయసులోనూ ఆమె నవ్వులో హుషారు ఉంటుంది. ఆమె మంచి నటి, చురుకైన సోషల్ యాక్టివిస్ట్ కూడా అయినప్పటికీ.. పెద్ద పెద్ద ఇంటర్వ్యూ లలో ఆమెను ఫెమినిజం గురించే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతుంటారు. బయట ఆమెకు తారసపడే యువతులు కూడా... ‘మేడమ్.. ఫెమినిజం అంటే మీ ఉద్దేశంలో ఏమిటి?‘ అని ప్రాథమిక స్థాయి ప్రశ్న వేస్తుంటారు. ఆ ప్రశ్నకు షబానా నవ్వేస్తుంటారు. ‘ఈ అమ్మాయిలున్నారే.. తాము ఫెమినిస్ట్‌లము కాదు అని గర్వంగా చెప్పుకుంటారు, మళ్లీ ‘బ్రా – బర్నింగ్‘ మూవ్ మెంట్ గురించి గొప్పగా మాట్లాడుతుంటారు’ అంటారు షబానా.
(పితృస్వామ్య వ్యవస్థను నిరసిస్తూ, అందుకు సంకేతంగా 60 లలో ఆనాటి మహిళా యాక్టివిస్టులు బ్రా లను మంటల్లో వేసి తగలబెట్టిన మూవ్‌మెంటే ‘బ్రా బర్నింగ్‘ ఉద్యమం).
ఫాయే డి సౌజా యూట్యూబ్ ఛానల్ కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫెమినిజానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు షబానా. ఓసారి ఆమె అమెరికాలో ఉన్నప్పుడు జావేద్ (అఖ్తర్) కుర్తాను ఇస్త్రీ చేస్తూ ఉండగా చూసిన ఒక తెలిసినావిడ.. ‘మిమ్మల్ని ఫెమినిస్ట్ అంటారు. మీరేమో మీ భర్త దుస్తుల్ని ఇస్త్రీ చేస్తున్నారు?!‘ అని అన్నారు. షబానా నవ్వుతూ, ‘దీనికి దానికీ సంబంధం ఏమిటి?!‘ అని అడిగారు. అందుకు ఆవిడ... ‘మరైతే మీ వారు మీ శారీని ఇస్త్రీ చేస్తారా?!‘ అన్నారు.
‘లేదు. నేను ఎప్పటికీ ఆయన్ని ఆ పని చేయనివ్వను‘ అన్నారు షబానా.
డిసౌజాకు ఈ సంగతి చెప్పినప్పుడు... డిసౌజా కూడా షబానాను ఇదే ప్రశ్న అడిగారు. ‘మరి మీ ఉద్దేశంలో ఫెమినిజం అంటే ఏమిటి?! అని. ప్రపంచాన్ని మనం చూసే దృష్టిలో ఉండేదే ఫెమినిజం. స్త్రీ పురుషులు వేర్వేరు. అంతే తప్ప ఎక్కువా కాదు, తక్కువా కాదు. ‘ప్రపంచం అనాదిగా ప్రతి సమస్యకూ పురుషుడి దృష్టి కోణం నుంచే పరిష్కారం వెతుకుతూ వస్తోంది. పరిష్కారం కోసం స్త్రీ వైపు నుంచి కూడా ఆలోచించటమే ఫెమినిజం’ అని చెప్పారు షబానా. ఇంతకుమించిన నిర్వచనం ఉంటుందా స్త్రీవాదానికి? ఎంతైనా షబానా కదా!
Comments
Please login to add a commentAdd a comment