ఈల వేసింది... ఊరు మారింది! | The town has change as become a whistling! | Sakshi
Sakshi News home page

ఈల వేసింది... ఊరు మారింది!

Published Sun, Jun 5 2016 11:33 PM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

ఈల వేసింది... ఊరు మారింది! - Sakshi

ఈల వేసింది... ఊరు మారింది!

మెరుగుదొడ్డి
పిల్లలంటే ఆకతాయి పనులకు కేరాఫ్ అడ్రస్. చత్తీస్‌గఢ్‌లోని రాజనందన్‌గావ్ జిల్లా, ధోబ్నీ గ్రామంలోనూ పిల్లలున్నారు. వారికీ ఆకతాయి పనులంటే ఇష్టం. అయితే తమ ఆకతాయితనాన్ని వారంతా ఓ మంచి పనికోసం ఉపయోగించారు. అలా తమ ఊరినే మార్చేశారు. ఇంతకీ వారంతా ఏం చేశారంటే... ఆర్తీ రావ్తే.. నిండా 11 ఏళ్లు కూడా నిండని ఓ గిరిజన బాలిక. ఆమెకు ప్రతిరోజూ ఉదయాన్నే నాలుగు గంటలకే లేవడం అలవాటు.

అయితే ఆమె మేల్కొనేది చదువుకునేందుకు కాదు... ఊరికి పట్టిన ఓ జాడ్యం నుంచి గ్రామ ప్రజలను మేల్కొల్పేందుకు. లేచిన వెంటనే తన స్నేహితులను వెంటబెట్టుకొని బహిర్భూమికి వెళ్లడం, అక్కడ విజిల్స్‌తో ఈలలు వేయడం ఈ ఆకతాయిల పని. ఇదంతా ఎందుకంటే ఆ గ్రామాన్ని బహిర్భూమిరహిత గ్రామంగా మార్చేందుకే. మరి ప్రజలంతా వారి అవసరాలను ఎలా తీర్చుకోవాలి? అనేకదా... అయితే మీరోసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాలి...
 
ఫ్లాష్‌బ్యాక్...

రెండేళ్ల క్రితమే ధోబ్నీ గ్రామంలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు అందరి ఇళ్లల్లో మరుగుదొడ్లు ఉన్నాయి. దీంతో ధోబ్నీ గ్రామాన్ని ‘బహిర్భూమిరహిత గ్రామం’గా ప్రకటించారు. ఎవరైనా బహిర్భూమికి వెళ్తే వారికి రూ. 500 జరిమానా కూడా విధించాలని కూడా నిర్ణయించారు. అయితే ఎవరూ తమ అలవాటును మార్చుకోకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. మరుగుదొడ్లు ఉన్నా.. అవి స్టోర్ రూమ్‌లుగా మారిపోయాయి. ఈ పరిస్థితిని మార్చాలనుకుంది ఆర్తీ రావ్తే. అందుకోసమే స్నేహితులను కూడగట్టి ఈలలు వేయడం మొదలుపెట్టింది.
 
ఇంతలో ఎంత మార్పు?
పిల్లలతో చెప్పించుకోవడం ఎందుకనుకున్నారో ఏమో..? గ్రామస్థుల్లో అనూహ్యమైన మార్పు వచ్చేసింది. ఇప్పుడంతా ఇంట్లోని మరుగుదొడ్లనే ఉపయోగిస్తున్నారు. దీనికంతటికీ కారణం ఆర్తీ పట్టుదలేనని ఊరంతా చెప్పుకుంటారు. పదకొండేళ్లకే ఇంత గొప్ప లక్ష్యంతో ఉన్న రావ్తేకు పెద్దయ్యాక డాక్టర్ కావాలనేది ఆమె ఆశయమట. డాక్టరై పరిసర గ్రామాల్లోని ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తానని చెబుతోంది. ఆర్తీ కృషిని గుర్తించిన యూనిసెఫ్ తాము చేపట్టే పరిశుభ్రత ప్రచార బృందంలో సభ్యురాలిగా చేర్చుకుంది. ప్రస్తుతం జనకళ్యాణ్ సంస్థాన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పరిసర గ్రామాల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తోంది.
- ఎస్. సుధాకర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement