
పొడవాటి పొగచుట్ట
తిక్క లెక్క
పొగచుట్టలు కొత్త కాదు. అలాగే వాటితో ‘చుట్ట’రికం కూడా. అయితే, పొగచుట్టల తయారీలో మన కంటే క్యూబాదే అగ్రస్థానం. క్యూబాలో తయారయ్యే హవానా సిగార్లు అంటే ప్రపంచవ్యాప్తంగా పొగరాయుళ్లకు విపరీతమైన మక్కువ. క్యూబాలోని జోస్ క్యాసెలర్ (67) అనే సీనియర్ ‘చుట్ట’కారుడు (సిగార్ మేకర్) తన వృత్తి నైపుణ్యంతో అరుదైన ఘనత సాధించాడు. పద్నాలుగేళ్ల వయసులోనే ఇతగాడికి పొగాకుతో ‘చుట్ట’రికం ఏర్పడింది.
అప్పటి నుంచి రకరకాల సిగార్లు చుడుతూనే ఉన్నాడు. వృత్తినైపుణ్యంలో తన ఘనతను ప్రపంచానికి చాటాలని సంకల్పించుకుని, నాలుగేళ్ల కిందట ఏకంగా 81.80 మీటర్ల పొడవైన చుట్టను చుట్టి పారేసి గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నాడు. అయితే, జోస్ ఈ రికార్డుతో తృప్తిపడటం లేదు. ఏనాటికైనా వంద మీటర్ల చుట్టను చుట్టేయడమే తన లక్ష్యమని చెబుతున్నాడు.