
'ఈ'మ్యూజియానికి 'ఆ' గుర్తింపు
తాజాగా...
ఢిల్లీ సులభ్ ఇంటర్నేషనల్ మ్యూజియం ఆఫ్ టాయిలెట్స్‌లోకి ఒకసారి అడుగు పెడితే చాలు...టాయిలెట్లకు సంబంధించి 4,500ల సంవత్సరాల క్రితం నాటి చరిత్ర కళ్లకు కడుతుంది. ఈరకమైన మ్యూజియం ప్రపంచంలో ఎక్కడా లేదు. తాజాగా టైమ్ మ్యాగజైన్ ‘ప్రపంచంలో పది భిన్నమైన మ్యూజియం’ జాబితాలో సులభ్ మ్యూజియం చోటు చేసుకుంది.
1992లో నిర్మించిన ఈ మ్యూజియానికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది.విదేశీ పర్యాటకులు, విద్యార్థులకు ఇదొక ప్రధాన ఆకర్షణగా మారింది. రకరకాల వింత ఆకారాలలో ఉన్న టాయిలెట్లతో పాటు ఎలక్ట్రికల్, సోలార్ మోడల్ టాయిలెట్లు కూడా మ్యూజియంలో ఉన్నాయి.
ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డ్ డావిన్సి గీసిన ఫ్లష్ టాయ్‌లెట్ స్కెచ్‌లు మరో ఆకర్షణ. ‘టాయ్‌లెట్స్ మ్యానర్స్’ అంటే ఏమిటో కూడా ఈ మ్యూజియాన్ని దర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వస్తువులు చేర్చడం ఈ మ్యూజియం ప్రత్యేకత.
ఫతేపూర్ సిక్రి, అంబర్ ఫోర్ట్, గోల్కోండ ఫోర్ట్‌లలో తొలిరోజులలో, హరప్పా నాగరికత కాలంలో మరుగుదొడ్లు ఎలా ఉండేవో కూడా ఈ మ్యూజియంలో కొలువు తీరిన ఛాయాచిత్రాల ద్వారా తెలుసుకోవచ్చు.
‘‘నాగరిక సమాజాలలో మరుగుదొడ్లు అనేవి శుభ్రతకు సంబంధించిన ముఖ్య సాధనాలుగా ఉండేవి. మరుగుదొడ్ల గురించి మాట్లాడుకోవడం ఏమిటి? అనే స్థాయి నుంచి వాటి గురించి పూర్తి స్థాయిలో మాట్లాడుకునే పరిస్థితి కలిపించడానికే ఈ ప్రయత్నం చేశాను. మరుగుదొడ్ల మీద మరింత అవగాహన పెంచడానికి, రకరకాల ప్రశ్నలు మదిలో మొలకెత్తడానికి ఈ మ్యూజియం ఉపయోగపడుతుంది’’ అంటున్నాడు ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దిన బిందేశ్వర్ పాఠక్.