రాణిస్తాన్‌ వంట గది | These are Rajasthan cuisine | Sakshi
Sakshi News home page

రాణిస్తాన్‌ వంట గది

Published Sat, Feb 16 2019 12:41 AM | Last Updated on Sat, Feb 16 2019 12:41 AM

These are Rajasthan cuisine - Sakshi

ఇవిగో రాజస్తాన్‌ వంటలు.స్నాక్‌స్నాక్‌లో రాజసం కనపడుతుంది.మీ ఇంటి రాజావారి కోసం ...రాణీవారు ప్రేమగా వండితే...అవి రాణిస్తాన్‌ వంటకాలు కావా మరి!

ఘేవార్‌
కావలసినవి
నెయ్యి – అర కప్పు; ఐస్‌ క్యూబ్‌ – 1 (పెద్దది); మైదా పిండి – 2 కప్పులు;
పాలు – అర కప్పు; చల్లటి నీళ్లు – 3 కప్పులు; నిమ్మరసం – ఒక టీ స్పూను;
ఏలకుల పొడి – పావు టీ స్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా; డ్రై ఫ్రూట్స్‌ తరుగు – అలంకరించడానికి తగినన్ని; మిఠాయి రంగు – చిటికెడు; పంచదార పాకం కోసం: పంచదార – ఒక కప్పు; నీళ్లు – పావు కప్పు

తయారీ
►ఒక పాత్రలో అర కప్పు నెయ్యి వేసి, ఆ నేతిని ఐస్‌ క్యూబ్‌తో బాగా రుద్దాలి
►నెయ్యి బాగా తెల్లగా అవుతుంది ∙రెండు కప్పుల మైదా పిండి వేసి ఉండలు లేకుండా జాగ్రత్తగా కలపాలి
►అర కప్పు చల్లటి పాలు జత చేసి మరోమారు కలపాలి ∙ఆ తరవాత మరో మూడు కప్పుల చల్లటి నీళ్లు, ఒక టీ స్పూను నిమ్మరసం వేసి దోసె పిండిలా కలపాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాచాలి
►గరిటెడు పిండి తీసుకుని, కాగిన నూనెలో కొద్దికొద్దిగా ఆగుతూఆగుతూ వేస్తుండాలి
►మధ్యలో రంధ్రం ఉండేలా జాగ్రత్తపడాలి
►బంగారురంగులోకి వచ్చే వరకు వేయించి, కాడలాండి దానితో ఘేవార్‌ను ప్లేట్‌లోకి తీసుకోవాలి (నూనె కారిపోయేలా నిలబెట్టాలి)
►ఈ విధంగా అన్నీ తయారుచేసుకోవాలి.

పంచదార పాకం తయారీ
►ఒక పాత్రలో పంచదార, నీళ్లు పోసి స్టౌ మీద సన్నని మంట మీద సుమారు ఐదు నిమిషాలు ఉంచాలి
►మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙మిఠాయి రంగు, కుంకుమ పువ్వు, ఏలకుల పొడి జతచేసి బాగా కలిపి, తీగ పాకం వచ్చేవరకు కలిపి దింపేయాలి
►తయారుచేసి ఉంచుకున్న ఘేవార్‌ల మీద గరిటెడు పంచదార పాకం సమానంగా పోయాలి
►డ్రైఫ్రూట్స్‌తో అలంకరించాలి.

గులాబ్‌ శక్రీ
కావలసినవి
చిక్కటి పాలు – ఒక లీటరు; నిమ్మ రసం – ఒక టేబుల్‌ స్పూను; అరటి పండు గుజ్జు – ఒక కప్పు; కుంకుమ పువ్వు – చిటికెడు; ఏలకుల పొడి – కొద్దిగా; డ్రై ఫ్రూట్స్‌ – ఒక టేబుల్‌ స్పూను; పంచదార – 3 టేబుల్‌ స్పూన్లు
తయారీ
►ఒక గిన్నెలో పాలు పోసి స్టౌ మీద ఉంచి, మరిగించాలి (పాలు సగానికి ఇగిరిపోవాలి) 

►కొద్దికొద్దిగా నిమ్మ రసం జత చేస్తూ, పాలు విరిగేవరకు కలుపుతుండాలి ∙పాలు విరిగినట్లు తెలియగానే ఇక నిమ్మరసం వేయక్కర్లేదు ∙అరటి పండు గుజ్జు జత చేసి కలపాలి ∙పంచదార కూడా జత చేసి సుమారు ఐదు నిమిషాలు ఉడికించి దింపేయాలి బాగా చల్లారాక కుంకుమ పువ్వు వేసి కలపాలి ∙డ్రై ఫ్రూట్స్‌ తరుగు, అరటి పండు ముక్కలతో అలంకరించి అందించాలి.

చుర్మా
కావలసినవి
గోధుమ పిండి – ఒక కప్పు; నెయ్యి – 10 టేబుల్‌ స్పూన్లు; నూనె – ఒకటిన్నర కప్పులు; పాలు – తగినన్ని; బొంబాయి రవ్వ – 4 టేబుల్‌ స్పూన్లు; పంచదార లేదా బెల్లం పొడి – అర కప్పు; డ్రైఫ్రూట్స్‌ తరుగు – 4 టేబుల్‌ స్పూన్లు

►ఒక పెద్ద పాత్రలో గోధుమ పిండి, బొంబాయి రవ్వ వేసి కలపాలి
►నాలుగు టేబుల్‌ స్పూన్ల నెయ్యి జత చేసి ఉండలు రాకుండా జాగ్రత్తగా చేతితో కలపాలి
►కొద్దికొద్దిగా పాలు పోస్తూ చపాతీపిండిలా కలుపుకోవాలి
►తడి వస్త్రంతో మూత వేయాలి
►పిండి గట్టిపడ్డాక, చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి
►ఒక్కో బాల్‌ని చేతిలోకి తీసుకుని కొద్దిగా ఒత్తాలి
►ఈ విధంగా అన్నిటినీ ఒత్తుకోవాలి
►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, నూనె వేసి కాచాలి
►ఒక్కో ఉండను నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి
►బాగా చల్లారాక ఈ బాల్స్‌ని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పొడి చేయాలి
►ఒక పెద్ద పాత్రలోకి, ఈ పొడి వేసి, కరిగించిన నెయ్యిని, బెల్లం పొడి జత చేసి బాగా కలపాలి ∙డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించి వెంటనే అందించాలి.

ఆనియన్‌ కచోరీ
కావలసినవి
స్టఫింగ్‌ కోసం
నూనె – 3 టీ స్పూన్లు; జీలకర్ర – అర టీ స్పూను; ధనియాలు – అర టీ స్పూను (చేతితో మెదపాలి); సోంపు – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; తరిగిన పచ్చిమిర్చి – 1; అల్లం ముద్ద – అర టీ స్పూను; ఉల్లి తరుగు – ఒక కప్పు; మిరప కారం – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; గరంమసాలా – అర టీ స్పూను; ఆమ్‌చూర్‌ పొడి – పావు టీ స్పూను; పంచదార – పావు టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; శనగ పిండి – పావు కప్పు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు.

పూరీ పిండి కోసం
మైదా పిండి – 2 కప్పులు; బొంబాయి రవ్వ – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు; నీళ్లు – తగినన్ని; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ
►ఒక పాత్రలో రెండు కప్పుల మైదా పిండి, ఒక టేబుల్‌ స్పూను బొంబాయి రవ్వ, అర టీ స్పూను ఉప్పు వేసి బాగా కలపాలి
►రెండు టేబుల్‌ స్పూన్ల నెయ్యి జత చేసి ఉండలు లేకుండా జాగ్రత్తగా కలపాలి
►రెండు టేబుల్‌ స్పూన్ల నెయ్యి జత చేయాలి
►అర కప్పు నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి
►ఒక టీ స్పూను నూనె వేసి బాగా కలిపి, తడి వస్త్రంతో కప్పేసి 20 నిమిషాలు ఉంచేయాలి. 

ఆనియన్‌ స్టఫింగ్‌
►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక మూడు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి కాగాక జీలకర్ర, ధనియాలు, సోంపు, ఇంగువ వేసి దోరగా వేయించాలి
►పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు వేసి వేయించాలి
►మంట బాగా తగ్గించాలి
►పావు టీ స్పూను పసుపు, మిరప కారం, గరం మసాలా, ఆమ్‌చూర్‌ పొడి, పంచదార, ఉప్పు జత చేసి బంగారురంగులోకి వచ్చేవరకు కలియబెట్టాలి
►పావు కప్పు సెనగ పిండి జతచేసి మరోమారు కలపాలి
►కొత్తిమీర జత చేసి కలిపితే, ఆనియన్‌ స్టఫింగ్‌ సిద్ధమైనట్లే
►కలిపి ఉంచుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేయాలి
►ఒక్కో ఉండను తీసుకుని చేతితో పల్చగా ఒత్తాలి ∙తయారుచేసి ఉంచుకున్న ఆనియన్‌ స్టఫింగ్‌ ఒక టీ స్పూను తీసుకుని, ఒత్తిన పూరీ మధ్యలో ఉంచి, అన్నివైపులా మూసేసి, చేతితో కొద్దిగా అదమాలి
►ఈ విధంగా అన్నీ తయారుచేసుకోవాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న కచోరీలను నూనెలో వేసి వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి
►టమాటా సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి.


దిల్‌ కుశాల్‌
కావలసినవి
సెనగ పిండి – 2 కప్పులు; నెయ్యి – ఒక కప్పు; పచ్చి కోవా తురుము – ఒక కప్పు
ఏలకుల పొడి – ఒక టీ స్పూను; పంచదార పాకం కోసం: పంచదార – ఒకటిన్నర కప్పులు; నీళ్లు – ఒక కప్పు; పాలు – 2 టేబుల్‌ స్పూన్లు; అలంకరించడం కోసం: పిస్తా తరుగు – తగినంత
తయారీ.

►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి
►శనగ పిండి జత చేసి దోరగా వేయించాలి
►మిగిలిన నెయ్యి వేసి మరోమారు కలిపి, బంగారు రంగులోకి మారేవరకు ఆపకుండా కలుపుతూ వేయించాలి
►పచ్చి కోవా తురుము, ఏలకుల పొడి జత చేసి మరో పది నిమిషాలు కలిపి దింపి చల్లారనివ్వాలి.

పంచదార పాకం
►ఒక పాత్రలో పంచదార, నీళ్లు వేసి స్టౌ మీద ఉంచి పది నిమిషాల పాటు మరిగించాలి
►రెండు టేబుల్‌ స్పూన్ల పాలు జత చేసి తీగ పాకం వచ్చేవరకు కలిపి దింపేయాలి
►చల్లారిన శనగ పిండి మిశ్రమం మీద ఈ పాకం పోసి బాగా కలపాలి
►ఒక పళ్లానికి నెయ్యి పూసి, ఈ మిశ్రమాన్ని ఆ పళ్లెంలో పోయా లి
►పిస్తా తరుగు, బాదం తరుగులను పైన చల్లి, సుమారు ఐదు గంటల పాటు ఆరబెట్టాక, చాకుతో ముక్కలు కట్‌ చేసి అందించాలి.

పాపడ్‌ కీ సబ్జీ
కావలసినవి
నూనె – 4 టీ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 1; కశ్మీరీ మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; నీళ్లు – ఒక కప్పు; పెరుగు – ఒక కప్పు; అప్పడాలు – 4; ఉప్పు – పావు టీ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను; కసూరీ మేథీ – ఒక టీ స్పూను; సన్నగా తరిగిన కొత్తిమీర – 2 టేబుల్‌ స్పూన్లు.

తయారీ
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక నాలుగు టీ స్పూన్ల నూనె వేసి కాచాలి
►ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాలి
►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
►అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి తరుగు వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి
►అర టీ స్పూను పసుపు, ఒక టీ స్పూను మిరప కారం, అర టీ స్పూను ధనియాల పొడి జత చేసి, సన్నటి మంట మీద వేయించాలి
►బాగా వేగిన తరువాత ఒక కప్పుడు నీళ్లు, ఒక కప్పుడు చిలికిన పెరుగు జత చేయాలి
►అన్నీ బాగా కలిసేవరకు ఆపకుండా కలుపుతుండాలి
►వేయించిన అప్పడాలను ముక్కలుగా చేసి ఉడుకుతున్న మిశ్రమంలో వేసి కలపాలి
►పావు టీ స్పూను ఉప్పు జత చేసి రెండు నిమిషాలు ఉడికించాలి
►అర టీ స్పూను గరం మసాలా, ఒక టీ స్పూను కసూరీ మేథీ, 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసి కలిపి దింపేయాలి
►ఈ సబ్జీ చపాతీలలోకి రుచిగా ఉంటుంది.



గట్టే కీ సబ్జీ 
కావలసినవి

శనగ పిండి – 2 కప్పులు; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – 3 టేబుల్‌ స్పూన్లు; పెరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; నీళ్లు – 4 టేబుల్‌ స్పూన్లు; 

ఆనియన్‌ పేస్ట్‌ కోసం
ఉల్లి తరుగు – అర కప్పు; వెల్లుల్లి తరుగు – అర టీ స్పూను; అల్లం తరుగు – అర టీ స్పూను; నీళ్లు – 2 టేబుల్‌ స్పూన్లు; 

గ్రేవీ కోసం
జీలకర్ర – ఒక టీ స్పూను; లవంగాలు – 3; దాల్చిన చెక్క ముక్క – చిన్నది; ఏలకులు – 2; ఎండు మిర్చి – 2; పెరుగు – ఒక కప్పు; ఇంగువ – చిటికెడు; పసుపు – అర టీ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – ఒక టేబుల్‌ స్పూను; గట్టేలను ఉడికించిన నీళ్లు – ఒక కప్పు; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు

గట్టే తయారీ
ఒక పాత్రలో రెండు కప్పుల శనగ పిండి వేయాలి ∙కొద్దిగా ఇంగువ, పావు టీ స్పూను పసుపు, అర టీ స్పూను వాము, అర టీ స్పూను మిరప కారం, ఒక టీ స్పూను ధనియాల పొడి, ఒక టీ స్పూను ఉప్పు వేసి కలపాలి ∙మూడు టేబుల్‌ స్పూన్ల నూనె, రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు జత చేసి అన్నీ బాగా కలిసేవరకు కలియబెట్టాలి ∙నీళ్లు పోసి పిండి గట్టిగా వచ్చేలా సుమారు పది నిమిషాల పాటు కలపాలి  అవసరాన్ని బట్టి నీళ్లు జత చేసి, పూరీ పిండిలా తయారుచేసుకోవాలి ∙అలా చేయడం వలన గట్టేలను తేలికగా ఒత్తుకోవచ్చు. 

ఉడికించడం...
ఒక పాత్రలో నాలుగు కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి కలిపి ఉంచుకున్న శనగ పిండిని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙ఒక్కో ఉండను పొడవుగా కడ్డీలా ఒత్తి, అంగుళం పొడవుగా ముక్కలు చేయాలి తగినన్ని ముక్కలను మరుగుతున్న నీటిలో వేయాలి ∙బాగా ఉడికి, పైకి తేలిన తరువాత వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.

ఆనియన్‌ పేస్ట్‌ తయారీ
మిక్సీ చిన్న జార్‌లో ఉల్లి తరుగు, వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు వేసి మెత్తగా పేస్ట్‌ చేయాలి ∙అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జత చేయాలి

గ్రేవీ తయారీ
ఒక పాత్రలో ఒక కప్పు పెరుగు వేసి మెత్తగా అయ్యేవరకు బాగా గిలక్కొట్టాలి గట్టేను ఉడికించిన కప్పు వేడినీళ్లను పక్కన ఉంచాలి ఉడికించిన గట్టేలను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి

►స్టౌ మీద బాణలిలో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె లేదా నెయ్యి వేసి సన్నని మంట మీద వేడి చే యాలి జీలకర్ర, లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఏలకులు, బిర్యానీ ఆకు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి ఆనియన్‌ పేస్ట్‌ జత చేసి మరోమారు వేయించి దింపేయాలి గిలక్కొట్టిన పెరుగు వేసి బాగా కలిపి మళ్లీ స్టౌ మీద ఉంచి మంట బాగా తగ్గించాలి పెరుగును ఆపకుండా కలుపుతుండాలి బాగా ఉడికిన తరువాత పసుపు, మిరప కారం, ధనియాల పొడి, ఇంగువ వేసి కలియబెట్టాలి
►గట్టేకు ఉడికించిన నీళ్లను జత చేయాలి ∙తగినంత ఉప్పు వేసి కలపాలి
►గ్రేవీ బాగా ఉడికిన తరువాత గట్టే ముక్కలను అందులో వేసి మృదువుగా కలపాలి ∙గ్రేవీ బాగా చిక్కబడ్డాక దింపేసి, కొత్తిమీర తరుగుతో అలంకరించాలి ∙రోటీలతోను, పరోటాలతోను తింటే రుచిగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement