అరెస్ట్ దిస్ దెయ్యం | This arrest was the devil | Sakshi
Sakshi News home page

అరెస్ట్ దిస్ దెయ్యం

Published Thu, Jul 14 2016 11:10 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

అరెస్ట్ దిస్ దెయ్యం - Sakshi

అరెస్ట్ దిస్ దెయ్యం

గౌరవ్ తివారీ దెయ్యాల్ని పట్టుకుంటాడు. ఇది తెలిసి దెయ్యాలన్నీ కలిసి ఓ మీటింగ్ పెట్టుకున్నాయట. దెయ్యమంటే భయం ఉండాలి కానీ గౌరవ్‌కి గౌరవం పెరగడం ఏంటని మీటింగ్‌లో నిరసనలు. ‘వెంటనే ఖతమ్ చేసెయ్యాలి’ అంది దెయ్యాల ప్రెసిడెంట్.అలా ఎందుకని ఓ పిల్లదెయ్యం అడిగింది. లేకపోతే ప్రజలకి మనమీద భయం పోతుంది,చెప్పాడు ప్రెసిడెంట్. సారీ, చెప్పింది ప్రెసిడెంట్ దెయ్యం.అంతే... నెక్స్ట్ డే మార్నింగ్... సారీ, నైట్ గౌరవ్ గొంతు పిసికి చంపేశాయట. దెయ్యాలుంటాయని నమ్మేవారు రాసుకున్న కథలివి.. హేతువాదులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు..  దెయ్యాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనుకునేవాళ్లు  మాటిమాటికీ మంచం కిందికి తొంగి చూసుకుంటున్నారు... జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్. దెయ్యాల్లేవ్, భూతాల్లేవ్... కానీ భయమైతే ఉంది.  భయాన్ని మించిన దెయ్యం లేదు! లేదూ దెయ్యమే చంపింది అంటే...
 
దెయ్యాల వేట సాగించే ఆ సాహసవంతుడు మరిలేడు. అనుమానాస్పదంగా మరణించాడు. ప్రమాదవశాత్తూ చనిపోయాడా... ఆత్మహత్య చేసుకున్నాడా... లేదా దెయ్యాలే చంపేశాయా? ఇదో మిస్టరీ. వారం రోజుల క్రితం మరణించిన ఘోస్ట్ హంటర్ గౌరవ్ తివారీ కథ ఇప్పుడు దేశ విదేశాల్లో పారా నార్మల్ యాక్టివిటీల్లో నిమగ్నమైన గ్రూపులలో ఉత్కంఠ రేపుతోంది. ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. గౌరవ్ తివారీ ఎవరో తెలుసుకునే ముందు అతడేం చేసేవాడో చూద్దాం.
 
   
కోల్‌కతాలోని ఓ అపార్ట్‌మెంటు...
ఐదో అంతస్తులోని ఒక ఫ్లాట్ తలుపు బర్రున తెరుచుకుంది. లోపలంతా చిక్కటి చీకటి. కన్ను పొడుచుకుని చూసినా ఏమీ కనిపించడం లేదు. ‘ఏంటిది... భూత్ బంగ్లాలా ఇలా ఉంది’ అంటూ లోపలికి అడుగు పెట్టాడా వ్యక్తి. చేతిలోని టార్చ్‌ను ఆన్ చేశాడు. ఆ వెలుగులోనే స్విచ్‌బోర్డ్ ఎక్కడుందో వెతుక్కుని లైట్ ఆన్ చేశాడు. ఒక్కసారి చుట్టూ పరికించి చూశాడు. ‘వావ్... చీకటిలో కనిపించలేదు కానీ ఫ్లాట్ అదిరింది’ అనుకుంటూ ఒక్కో గది తలుపూ తెరిచి చూడటం మొదలుపెట్టాడు. కిచెన్, డైనింగ్ హాల్, స్టడీ రూమ్... అన్నీ చాలా బాగున్నాయి. ఇక బెడ్‌రూమ్ ఎలా ఉందో చూడాలి అనుకుంటూ డోరు తీశాడు. లోనికి అడుగుపెడుతుంటే ఎవరిదో నవ్వు వినిపించింది. ఎవరిదో అర్థం కాలేదు. కిటికీ తీసి చూశాడు బయట ఎవరైనా ఉన్నారేమో అని. ఎవరూ లేరు. మరి నవ్వింది ఎవరు అనుకుంటూ ఉండగానే మళ్లీ నవ్వు వినిపించింది. అతని వెన్నులో వణుకు. ఒకవేళ అది తన భ్రమ అయివుంటుంది అనుకున్నాడు. కానీ అది భ్రమ కాదని ఆరోజు రాత్రి అర్థమయ్యిందతనికి. ఎవరో అమ్మాయి నవ్వులు... అంతలోనే ఏడుపులు... మధ్యలో మూలుగులు. ఉన్నట్టుండి కప్పుకున్న దుప్పటి గాల్లోకి లేచింది. సైడ్ టేబుల్ మీద ఉన్న నీళ్ల గ్లాసు కింద పడి భళ్లున బద్దలయ్యింది. ఏసీ లేకపోయినా గది మొత్తం చల్లగా అయిపోయింది. మళ్లీ అంతలోనే వేడెక్కిపో యింది. మొత్తానికి ఆ రాత్రి అతనికి కాళరాత్రి అయ్యింది.

అంతా శ్రద్ధగా విన్నాడు గౌరవ్ తివారీ. వెంటనే ఆ వ్యక్తిని తీసుకుని అతని ఫ్లాట్‌కి బయలుదేరాడు. ఆ గదిలో అడుగుపెడుతూనే అతనికి అర్థమైపోయింది అక్కడ ఏం జరుగుతోందో, ఎవరి వల్ల జరుగుతోందో. కొద్దిపాటి  అన్వేషణ సాగించాడు. ఆచూకీ తెలిసింది. ఎస్. అక్కడ ఒక ఆత్మ ఉంది. కొన్ని సంవత్సరాలుగా అక్కడే ఉంది. భర్త చేతిలో వంచనకు గురై, హింసకు గురై, చివరికి ప్రాణాలే కోల్పోయిన వేదనతో దెయ్యమై అక్కడే తిరుగాడుతోంది.

ఇక్కడ గౌరవ్ రెండు విషయాలు చెబుతాడు. ఒకటి: అక్కడ దెయ్యం ఉంది కనుక ఆ స్థలం విడిచి పెట్టమని. లేదా ఆ దెయ్యాన్ని తాను పారదోలదలుచుకుంటే అందుకు సహకరించమని. గౌరవ్ ఎక్కువగా దెయ్యాలు ఆ ప్రదేశంలో కచ్చితంగా ఉన్నాయి అని నిరూపించడమే తన పనిగా పెట్టుకున్నాడు.
 
దెయ్యాలతో చెలిమి...
‘దెయ్యం అన్న మాట వింటేనే అందరూ హడలిపోతారు. అవి తమను ఏదో చేస్తాయని భయపడతారు. కానీ అన్ని దెయ్యాలూ చెడ్డవి కావు. మంచివి కూడా ఉంటాయి’... అంటాడు గౌరవ్ తివారీ. ఎన్నో పారానార్మల్ యాక్టివిటీస్‌ని ఇన్వెస్టిగేట్ చేసిన అనుభవంతో అన్న మాట ఇది.

నిజానికి ఒకప్పుడు దెయ్యం అన్న మాటనే నమ్మేవాడు కాదు గౌరవ్. కానీ టెక్సాస్‌లో పైలట్ ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు అతణ్ని మొదటిసారి దెయ్యం అన్న మాట వణికించింది. లేదా దెయ్యాన్ని చూసిన అనుభవం కలిగింది. ఆ రోజుల్లో నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి ఓ ఫ్లాట్‌లో ఉండేవాడు గౌరవ్. అక్కడ అతనికి విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి. ఏవో ఆకారాలు కన్పించేవి. ఏవేవో శబ్దాలు వినిపించేవి. నవ్వులు, అరుపులు, ఏడుపులు... ఒక్క క్షణం ప్రశాంతత ఉండేది కాదు. చివరికి ఆ ఫ్లాట్‌ను ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే దెయ్యం అన్న దానిపై ఆసక్తి మొదలైంది గౌరవ్‌కి. పైలట్ కోర్సుతో పాటుగానే ‘పారానెక్సస్ అసోసియేషన్ ఆఫ్ ఫ్లారిడా’లో ‘పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ కోర్సు’ పూర్తి చేశాడు. రెండు లెసైన్సులూ పట్టుకుని ఇండియాకు వచ్చాడు. పారానార్మల్ సొసైటీని స్థాపించి దెయ్యాల వేట మొదలెట్టాడు. చూస్తూండగానే ఫేమస్ ఘోస్ట్ హంటర్ అయ్యాడు. దేశ విదేశాల్లో ఉన్న ఎన్నో దెయ్యాలను అతను వేటాడాడు. కానీ చివరికి అతనినే ఒకరు వేటాడారు. అతని ఉసురు తీశారు. కానీ అది మనిషా? దెయ్యమా? అదే ఇప్పుడు పెద్ద మిస్టరీ.
 
ఎలా చనిపోయాడు...
జూలై 7, 2016. ఢిల్లీలోని ద్వారక. ఉదయం పది గంటలు కావస్తోంది. గౌరవ్ తివారీ గది తలుపు మూసి ఉంది. కాఫీ తీసుకొచ్చిన భార్య సున్నితంగా తలుపు తోసింది. తెరచుకోలేదు. చిన్నగా తట్టింది. లోపలి నుంచి అలికిడి లేదు. దబదబా బాదింది. అయినా తెరవలేదు. తలుపు తెరవమంటూ అరిచింది. అతను పలకలేదు. దాంతో కంగారుపడి అత్తమావల్ని పిలిచింది. వాళ్లు కూడా ప్రయత్నించారు. కానీ ఫలితం లేదు. దాంతో బల వంతంగా తలుపు తెరిచారు. లోపలికి వెళ్లి చూస్తే అటాచ్డ్ బాత్రూమ్‌లో నేలమీద పడివున్నాడు గౌరవ్. ఉలుకూ పలుకూ లేదు. వెంటనే అతణ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఉపయోగం లేకపోయింది. అతని ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఆ క్షణం అతని జీవితం అంతమైపోయింది. కానీ ఓ కొత్త మిస్టరీకి తెర లేచింది.

గౌరవ్ మెడ చుట్టూ తాడుతో బిగించినట్టుగా నల్లని గీత ఒకటుంది. అంటే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అన్నారు పోలీసులు. ఊపిరాడకే చనిపోయాడని పోస్ట్‌మార్టం రిపోర్టు కూడా తేల్చడంతో అతనిది సూసైడ్ అని డిసైడైపోయారంతా. గౌరవ్ భార్య నోరు తెరవకపోయి ఉంటే అందరూ అదే నిజం అనుకునేవారు. కానీ ఆమె చెప్పింది విన్న తర్వాత కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి. ఇంతకీ ఆమె ఏం చెప్పింది?
 
వెంటాడుతున్న ఆత్మ...
‘నా భర్త గౌరవ్‌ని ఓ ఆత్మ వెంటాడుతోంది’ అని చెప్పిందామె. ‘ఆ సంగతి నాతో తరచూ చెప్పేవాడు. అది తనను ఎప్పుడో ఒకప్పుడు తన అధీనంలోకి తీసేసుకుంటుందని గౌరవ్ భయపడ్డాడు. కొన్నాళ్లుగా ఆ విషయాన్ని  తరచూ చెబుతున్నాడు కానీ పని ఒత్తిడిలో ఏదో అలా మాట్లాడుతున్నాడు అనుకుని పట్టించుకోలేదు’ అందామె. గౌరవ్ తండ్రి కూడా అది నిజమే కావచ్చు అంటున్నారు. గౌరవ్ అభిమానులు కూడా అలాగే జరిగిందేమో అని అనుమానపడుతున్నారు. అందరూ చెప్తున్నదాన్ని బట్టి ఆత్మహత్య చేసుకునేంత సమస్యలు, బాధలు గౌరవ్‌కి లేవు. పైగా అయిదు నెలల క్రితమే పెళ్లయ్యింది. మరి ఎందుకు ప్రాణం తీసుకుంటాడు? ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నా తాడుకి వేళ్లాడుతూ ఉండాలి. కానీ అతడు నేలమీద పడివున్నాడు. కనీసం అతడు ఉరి వేసుకున్న తాడు కూడా అక్కడ లేదు. అంటే గౌరవ్‌ని దెయ్యం చంపిందా? అది సాధ్యమేనా?

దేవుడు, దెయ్యాలు లేవనే నాస్తికులు ఈ సంగతి విని నవ్వి ఊరుకున్నారు. కానీ దెయాల్ని నమ్మేవారు, వాటి ఉనికిని రుచి చూసినవాళ్లు మాత్రం భయంతో వణుకుతున్నారు. దెయ్యాల్ని వేటాడేవాడు ఆ దెయ్యాలకే బలైపోయాడా అంటూ వాపోతున్నారు. నిజమా? గౌరవ్‌ని దెయ్యాలే చంపేశాయా? ప్రస్తుతం అతను ఢిల్లీలోని జానకీపుర ప్రాంతంలో సంచరిస్తోన్న ఓ మహిళ ఆత్మ గురించి పరిశోధిస్తున్నాడని తెలిసింది. దానికీ అతని చావుకీ ఏదైనా సంబంధం ఉందా? గౌరవ్‌ని వెంటాడుతోంది ఆ ఆత్మేనా? ఆ ఆడదెయ్యమే అతణ్ని వేటా డిందా? అంటే పోలీసులు దెయ్యాన్ని అరెస్ట్ చేయాలా?
 
 
దెయ్యాల్ని వేటాడేదెలా?
అతీంద్రియ శక్తుల ఉనికిని పారానార్మల్ యాక్టివిటీ అంటారు. వాటిని కనిపెట్టేవాళ్లని పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్, ఘోస్ట్ బస్టర్స్, ఘోస్ట్ హంటర్స్ అంటారు. ఘోస్ట్ హంటింగ్ అన్న మాట మన దేశంలో తక్కువే వినిపిస్తుంది కానీ, విదేశాల్లో... ముఖ్యంగా అమెరికాలో ఇది చాలా ఎక్కువ. దెయ్యాలు ఉన్నాయి అని అనుమానం వచ్చిన ప్రదేశాల్లో పరిశోధనలు జరపడం, దెయ్యాల ఉనికిని కనిపెట్టడమే ఘోస్ట్ హంటింగ్. ఎలక్ట్రో మ్యాగ్నటిక్ రేడియేషన్ డిటెక్టర్ (దీన్ని ఈఎంఫ్ మీటర్ అని కూడా అంటారు), డిజిటల్ థర్మోమీటర్, డిజిటల్ వీడియో కెమెరాలు, డిజిటల్ ఆడియో రికార్డర్, కంప్యూటర్ తదితర పరికరాలను ఉపయోగించి శబ్దాలను, దృశ్యాలను రికార్డు చేస్తారు. తద్వారా అక్కడ దెయ్యం ఉందో లేదో కనిపెడతారు. కొందరు వాటిని వెళ్లగొడతారు కూడా. అమెరికాకు చెందిన ఎడ్, లారెన్ దంపతులను ప్రపంచంలోనే నంబర్‌వన్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అని చెబుతారు. వీరి పరిశోధనల ఆధారంగానే ఆనబెల్లె, కన్జ్యూరింగ్, పారానార్మల్ యాక్టివిటీ, పోల్టర్‌గైస్ట్ లాంటి సూపర్‌హిట్ సినిమాలు వచ్చాయి. మన దేశపు తొలి ప్రఖ్యాత ఘోస్ట్ హంటర్ కావడం వల్ల గౌరవ్ తివారీని ఎడ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటారు.
 
పదహారేళ్ల వయసులో నటుడిగా కెరీర్‌ను ప్రారంభించాడు గౌరవ్ తివారీ. టాంగో చార్లీ, 16 డిసెంబర్ చిత్రాల్లో నటించాడు. తర్వాత పైలట్ కోర్సు చేయడానికి అమెరికా వెళ్లిపోయాడు. గౌరవ్ కేవలం ఘోస్ట్ హంటరే కాదు... రెవరెండ్, స్పిరిచ్యువల్ కౌన్సెలర్, హిప్నటిస్ట్, లైఫ్ అండ్ రిలేషన్‌షిప్ కోచ్ కూడా. అయితే ఘోస్ట్ హంటర్‌గానే ఎక్కువ పాపులర్ అయ్యాడు. ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, సింగపూర్, యూఎస్‌ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ తదితర దేశాల్లో గౌరవ్ ఘోస్ట్ హంటింగ్స్ చేశాడు.
     
గౌరవ్ హంటింగ్స్ ఆధారంగా పలు టీవీ షోలు రూపొందాయి. వాటిలో ‘ఎమ్‌టీవీ గాళ్స్ నైటవుట్’ ఒకటి. ఇది మన దేశంలో తొలి హారర్ రియాలిటీ షో. ఇది ఏషియన్ టెలివిజన్ అవార్డును గెల్చుకుంది. అలాగే హాంటెడ్ వీకెండ్స్ విత్ సన్నీ లియోన్, ఫియర్ ఫైల్స్, భూత్ ఆయా షోలు కూడా సక్సెస్ అయ్యాయి. వీటిలో కొన్నింటిలో గౌరవ్ కూడా కనిపించాడు.
 
దెయ్యమై వచ్చింది!
ఇరవై రోజుల శెలవు తర్వాత ఆఫీసులో అడుగు పెట్టింది సీమ (పేరు మార్చాం). ఆమెను అందరూ సంతోషంగా పలకరించారు. పరామర్శల తర్వాత పనిలో పడిపోయింది సీమ. సాయంత్రం ఇంటికి బయలుదేరేటప్పుడు ‘చాలా రోజులయ్యింది కదా... ఈరోజు నాతో నా రూమ్‌కి రావే’ అంది సీమ ఫ్రెండ్ కాజల్. ‘దానికేం... పద పోదాం’ అది సీమ. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కాజల్ రూమ్‌కి వెళ్లారు. సరదాగా గడిపారు. రాత్రి పది అవుతుండగా సీమ వెళ్లిపోయింది. కాజల్ పడక మీదకు చేరింది. మరుసటి రోజు ఉదయం ఆఫీసుకు బయల్దేరి ఆటో కోసం ఎదురుచూస్తోన్న కాజల్‌కు సీమ వాళ్ల అక్క కనిపించింది. సంతోషంగా వెళ్లి పలకరించింది. ముందు రోజు తాను, సీమ కలిసి గడిపినట్టు చెప్పింది. అది విని సీమ అక్క షాకైపోయింది. ‘సీమ యాక్సిడెంట్‌లో చనిపోయి పదిహేను రోజులవుతోంది. తను నీ దగ్గరకు రావడమేంటి’ అంది. అంతే... కాజల్ పై ప్రాణాలు పైనే పోయాయి.

ఇది ఢిల్లీలో జరిగిన ఓ వాస్తవ ఘటన. గౌరవ్ డీల్ చేసిన కేసుల్లో ఇదొకటి. మరణించిన సీమ మళ్లీ ఎలా వచ్చిందో అర్థం కాక ఈ విషయాన్ని గౌరవ్ దృష్టికి తీసుకెళ్లారు. సీమ ఆత్మే అలా వచ్చిందని తేల్చాడు గౌరవ్. విచిత్రం ఏమిటంటే ఆ తర్వాత మళ్లీ ఆ ఆత్మ కనిపించలేదు.
 
ఇంటి గొడవలే కారణమా?
గౌరవ్ మృతి వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి. మొదట గౌరవ్ మృతదేహం బాత్రూమ్‌లో నేలమీద పడివుంది అన్నారు. తర్వాతేమో బట్టలు హ్యాంగ్ చేసుకునే రాడ్‌కి ఓ క్లాత్‌తో ఉరి వేసుకున్నాడు అన్నారు. వీటిలో ఏది నిజం, ఏది కాదు అన్నది ఓ పెద్ద సందేహం. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే అందుకు కారణం ఏముంటుంది అన్నది మరో పెద్ద సందేహం. పోలీసులు మాత్రం ఇంటి గొడవలే కారణమై ఉండొచ్చు అంటున్నారు. గౌరవ్ ప్రొఫెషన్ కారణంగా అతని ఇంట్లో గొడవలు జరుగుతున్నాయట. దెయ్యాలు, భూతాలు అంటూ తిరగడం, అర్ధరాత్రిళ్లు ఇంటికి రావడం, సంపాదన సరిగ్గా లేకపోవడం వంటి విషయాలపై అటు భార్య, ఇటు తండ్రి కూడా అతనిని తప్పు పట్టి నిందిస్తున్నట్లు పనివాళ్లు, కొందరు దగ్గరివాళ్ల ద్వారా తెలిసిందని పోలీసులు అంటున్నారు. మరి నిజం ఎప్పటికి నిర్ధారణ అవుతుందో!
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement