
లేడీస్ హాస్టల్
ఇవన్నీ ఉతికి ఆరేసిన బట్టలు అనుకునేరు. ఉతక్కుండా అరేసిన బట్టలు కూడా. ఇవన్నీ ఆడా మగా బట్టలు అనుకునేరు. ఓన్లీ అమ్మాయిల బట్టలు. అందుకే ఇన్ని రంగులు! ఇదొక లేడీస్ హాస్టల్. యూనివర్శిటీ హాస్టల్. క్యాంపస్ చుట్టుపక్కల కొన్నాళ్ల పాటు సూర్యుడన్న మహానుభావుడే లేకుండా పోయాడు. దట్టమైన మబ్బులు, చల్లటి మంచు, చెదురు మదురుగా చినుకులు.. క్యాంపస్‌లో తిష్ట వేశాయి.
గదులకు చెమ్మపట్టి, బట్టలు తడవకుండానే తడిసి ముద్దైపోయినట్లుగా అయ్యాయి. ఎండ లేదు కాబట్టి, ఉతికి ఆరేసినా లాభం లేదు కాబట్టి హాస్టల్ లోని గదుల్లో గుట్టలు గుట్టలుగా బట్టలు పేరుపోయాయి. ఉతికి, ఇస్త్రీ చేసి శుభ్రంగా ఉంచుకున్న బట్టలు కూడా మంచులో మెత్తగిల్లిన పువ్వులయ్యాయి. ఇదిగో... ఇప్పుడు కాస్త ఎండ వచ్చాక, అన్నీ ఒకచోటుకు చేరి దండేల మీద ఒళ్లు విరుచుకుంటున్నాయి.