
ఈ వారం యు ట్యూబ్ హిట్స్
స్టీవ్ హార్వే రాంగ్ విన్నర్ : మిస్ యూనివర్స్
ఈ ఏడాది మిస్ యూనివర్శ్ పోటీలు ‘బిగ్గెస్ట్ టీవీ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఇయర్’ గా పూర్తయ్యాయి. కార్యక్ర మ వ్యాఖ్యాత స్టీవ్ హార్వే.. ఫస్ట్ రన్నర్ అప్ అయిన మిస్ కొలంబియాను మిస్ యూనివర్శ్‌గా ప్రకటించడంతో ఈ తప్పు జరిగిపోయింది. (నిజానికి జడ్జీలు నిర్ణయించిన విశ్వసుందరి మిస్ ఫిలిప్సీన్స్ పియా అలోంజో). కొలంబియా సుందరి అరియాడ్నా ఆకస్మాత్తుగా తను విజేత కాదని తెలుసుకుని క్షణం పాటు నివ్వెర పోయినా, తన కిరీటాన్ని వదులుకుంటున్న క్షణంలోనూ ఎంతో హూందాగా చిరునవ్వులు చిందించారు.
నిడివి : 5 ని. 28 సె. హిట్స్ : 1,79,80,657
జై గంగాజల్ : ట్రైలర్
బాలీవుడ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘జై గంగాజల్’ ట్రైలర్ ఇది. చిత్రం 2016 మార్చి 4న విడుదలౌతోంది. ఇందులో ప్రియాంకా చోప్రా ఎస్పీగా నటిస్తున్నారు. చిత్రీకరణ అంతా ఎక్కువ భాగం భోపాల్‌లో జరిగింది. బీహార్‌లోని బంకీపూర్ జిల్లా తొలి మహిళా ఎస్పీగా ప్రియాంక ఎంపికవుతారు. లోకల్ ఎమ్మెల్యే మానవ్ కౌల్, అతడి అనుచరులు ఆమెకు అడుగడుగునా అడ్డుపడి సంఘ విద్రోహ కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు. ఎస్పీకి, ఎమ్మెల్యేకు మధ్య జరిగే ఘర్షణల సన్నివేశాలను ఈ వీడియోలో చూడొచ్చు.
నిడివి : 2 ని. 48 సె. హిట్స్ : 32,27,655
డెడ్‌పూల్ : ట్రైలర్ 2
మార్వెల్ కామిక్స్‌లోని ‘డెడ్‌పూల్’ క్యారెక్టర్ అధారంగా అదే పేరుతో వస్తున్న హాలీవుడ్ సూపర్‌హీరో మూవీ ‘డెడ్‌పూల్’. టిమ్ మిల్లర్ డెరైక్ట్ చేస్తున్నారు. 2016 ఫిబ్రవరి 12న చిత్రం విడుదల అవుతోంది. క్యాన్సర్‌ను నయం చేసుకునేందుకు వేడ్ విల్సన్ (డెడ్‌పూల్ అసలు పేరు) తనపై ప్రయోగం చేసుకుంటాడు. పర్యవసానంగా అతడికి మంత్రశక్తులు వస్తాయి ఆ శక్తులను తనకు అనుకూలంగా మార్చుకుని, తన జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వ్యక్తికి వేటాడుతుంటాడు. వీడియో ఎంతో ఆసక్తికరంగా ఉంది.
నిడివి : 2 ని 59 సె. హిట్స్ : 19,50,590
బాహా కిలిక్కి : ట్రిబ్యూట్ టు టీమ్ బాహుబలి
‘బాహుబలి’ చిత్ర బృందానికి ట్రిబ్యూట్‌గా పాప్ స్మిత రూపొందించిన ‘బాహా కిలిక్కి’ వీడియో ఆసక్తికరంగా ఉంది. ఐదు రోజుల క్రితం స్మిత్ బాహా కిలిక్కిని అప్‌లోడ్ చేశారు. ఇందులో నటుడు నోయల్ సీన్‌తో పాటు ‘కాలికేయ’ ప్రభాకర్ కూడా కనిపిస్తాడు. ఐటమ్ సాంగ్‌లా అనిపించే ఇందులోని నృత్యగీతాలు యువతను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ‘హేయ్.. టీచ్ మీ ఇంగ్లిష్’ అని అర్థం వచ్చే మాటలేవో కాలకేయుడు తనదైన స్టైల్లో అనగానే, ఆదిమజాతి రాకుమారి స్మిత ‘నో... నీకు కిలిక్కి భాషను నేర్పిస్తాం’ అని చెప్పడంతో వీడియో స్టార్ట్ అవుతుంది.
నిడివి : 3 ని. 29 సె. హిట్స్ : 3,59,251