
ఈవారం యూట్యూబ్ హిట్స్
కేయానీ - డిస్ట్రాక్షన్ (అఫీషియల్ వీడియో)
అమెరికన్ పాప్ గాయని కేయానీ పారిష్ (21) కొత్త గేయం ‘డిస్ట్రాక్షన్’.. యూత్‌ని పరధ్యానంలో పడేస్తున్న తాజా వీడియో సాంగ్. డిస్ట్రాక్షన్ అంటే అర్థం కూడా అదే. పరధ్యానం!! తన తొలి సింగిల్ క్రేజీ (సిఆర్‌జడ్‌వై) విడుదలైన వారానికే కేయానీ ‘డిస్ట్రాక్షన్’తో కనువిందైన కల్లోలం సృష్టిస్తున్నారు. ఒక అమ్మాయి ఉబుసుపోక ప్రేమలో పడాలని అనుకుంటుంది. అతడు తనను ప్రేమించాలి, తనకు టైమ్ ఇవ్వాలి. అంతే తప్ప అతడు తనే లోకంగా జీవించకూడదు అని భావిస్తుంది. మరి అలాంటి ప్రేమికుడు దొరుకుతాడా? పైగా ఆ పిల్ల బోలెడంత స్వేచ్ఛను అనుభవిస్తూ ఉంటుంది. ఆ స్వేచ్ఛను ఆ పిల్లాడు తట్టుకోగలడా? ఐ నీడ్ యు టు గివ్ మి యువర్ టైమ్. ఐ నీడ్ యు టు నాట్ వాన్నా బి మైన్ అని కేయానీ పాడుతున్నప్పుడు ఏమిటంత అన్యాయం అనిపిస్తుంది. వీడియో చూడండి ప్రేమపై మీకో ఒపీనియన్ ఏర్పడుతుంది.
యు అండ్ మి : బేఫిక్రే సాంగ్
ప్రతి రిలేషన్‌షిప్‌కీ పేరెందుకు ఉండాలి? నియమాలను, పరిమతులు తోసెయ్. ఆ బంధాన్ని అలా కొనసాగించు. ఇదీ ‘బేఫిక్రే’ చిత్రంలోని ‘యు అండ్ మీ’ సాంగ్ ఇస్తున్న మెసేజ్. ఆడ మగ, కులం, మతం, జాతి, వర్ణం ఏ బేధమూ లేని స్నేహ సంబంధమే యూ అండ్ మీ. రణ్‌వీర్ సింగ్, వాణీ కపూర్ మీద ఈ పాటను చిత్రీకరించారు. పాట మంచి జోష్‌లో సాగుతుంది. విశాల్, శేఖర్ సంగీతంలో నిఖిల్ డిసౌజా, రేచల్ వర్గీస్.. యు అండ్ మీ గీతాన్ని ఆలపించారు. ఇష్టమొచ్చినట్టు ఆడి, ఇష్టమొచ్చినట్టు పాడి, ఎగిరి దూకుతూ, గాలిలో తేలియాడుతూ యూత్ చేసే హంగామానంతా ఈ వీడియోలో చూడొచ్చు. ఇంత హంగామా ఉన్నప్పుడు బాలీవుడ్ సినిమాల్లో క్రైమ్ లేకుండా ఉంటుందా? ఉంది! ఈ రొమాంటిక్ క్రైమ్ డ్రామాను ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. దర్శకత్వం కూడా ఆయనదే. చిత్రం విడుదల డిసెంబర్ 9.
జస్టిన్ బీబర్ పంచస్ ఫ్యాన్: ఇన్ బార్సిలోనా
ఇరవై రెండేళ్ల దుందుడుకు కెనడియన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ మళ్లీ ఒక అభిమానికి పంచ్ ఇచ్చాడు. స్పెయిన్‌లోని బార్సిలో నాలో ఇటీవల ఒక ప్రోగ్రామ్‌కి కారులో వెళుతున్న బీబర్‌ను ఫ్యాన్స్ వెంబడించారు. కారు కిటికీ తలుపు తెరిచి ఉండడంతో బీబర్‌ను టచ్ చెయ్యడానికి ఓ అభిమాని లోపలికి ఒంగినప్పుడు బీబర్ బలంగా తన పిడికిలితో అతడి మూతిపై కొట్టి ముందుకు వెళ్లిపో యాడు. కొద్ది క్షణాల తర్వాత చూసుకుంటే ఆ అభిమాని పెదవుల నుంచి రక్తం కారుతోంది! అది చూసి అతడి స్నేహితులు హర్ట్ అయ్యారు. పంచ్ దెబ్బ తిన్న అభిమాని బీబర్‌ను నానా తిట్లు తిట్టుకున్నాడు. బీబర్ ఇలా చేయడం ఐదోసారి. తాజా ఘటనను టి.ఎం.జెడ్. అనే సెలబ్రిటీ సైట్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. బీబర్‌కు పాప్ ప్రపంచం నుంచి పోయే రోజులు వచ్చినట్లు కనిపిస్తోంది.
కాగజ్ : సోను నిగమ్
పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన చిన్న సినిమా (షార్ట్‌ఫిల్మ్).. ‘కాగజ్’లోని ఒక పాట ఇది. సోను నిగమ్ పాడారు. ఆ పాటలో ఆయనే నటించారు. మోదీ నిర్ణయాన్ని సమర్థించే వారికి ఈ పాట నచ్చుతుంది. కొత్త నోట్లు అందక, పాత నోట్లతో పాట్లు పడుతున్న వారికి ఈ పాట చిర్రెత్తించవచ్చు. ‘నోట్ల రద్దు కఠినమైన నిర్ణయమే. కానీ రేపటి ప్రపంచం అందంగా ఉండడానికి ఈ మాత్రం కాఠిన్యం అవసరమే’ అన్న సందేశాన్ని ఈ పాట ద్వారా దర్శకుడు మిలాప్ మిలన్, నిర్మాణ సంస్థ ఉమ్మడిగా ఇస్తున్నారు. కాగితంలో సంగీతం ఉంటుంది. విద్యాభ్యాసం ఉంటుంది. ఇతిహాసాలు ఉంటాయి... అంటూ మొదలు పెట్టి ఉజ్వలమైన భవిష్యత్తు కూడా ఉంటుందని ముగిస్తాడు నిగమ్. ఉద్దేశం మంచిదే. వినే టైమ్ దొరుకుతుందా.. డిసెంబర్ 31 లోపు?!