తోమ్... తోమ్... తోమ్... | thom thom | Sakshi
Sakshi News home page

తోమ్... తోమ్... తోమ్...

Published Mon, Jun 8 2015 11:48 PM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM

తోమ్... తోమ్... తోమ్...

తోమ్... తోమ్... తోమ్...

ఆడపిల్ల భయపడి బలికాకూడదు.
అదరకూడదు... బెదరకూడదు.
శక్తి వాడాలి... యుక్తి వాడాలి.
అవసరమైతే తిరగబడాలి.
మన సత్తా చూసి తోకముడవాల్సిందే!
బ్యాడ్‌ఫెలోస్ గుండెల్లో తాండవమాడాల్సిందే!
ఆడపిల్లలు గెట్ రెడీ టు...
 
 ఒకప్పుడు...
 ఆడపిల్లకు భర్త రాసే ఉత్తరం చదువుకునేంత అక్షరజ్ఞానం ఉంటే సరిపోయేది. కాబట్టి ఆమె నాలుగు గోడల మధ్యే ఉన్నా చెల్లింది!

ఇప్పుడు..
 ముంగిట్లో ముగ్గులు, అరుగుమీద కూర్చుని చేసే అల్లికల స్థాయి దాటి అంతరిక్షయానానికి చేరింది. చదువు, ఉద్యోగం తప్పనిసరైంది. ఒంటరిగా గడప దాటాల్సిన అవసరం ఏర్పడింది.
 
 ఇక్కడే..
 అమ్మాయికి భద్రత కరువైంది. అభివృద్ధి సాధిస్తున్న కొద్దీ, రక్షణ కరువైంది. అలాగని ఇంట్లో గడియేసుకొని కూర్చోనే పరిస్థితి లేదు. తోటివారే తోడేలుగా ప్రవర్తించినప్పుడు ప్రతిఘటించే తెగువను చూపించాల్సిందే! దానికి కావాల్సిన ధైర్యాన్ని తెచ్చుకోవాల్సిందే. పారిపోతే పరాజయం వెక్కిరిస్తుంది. అనుభవాలు నేర్పిస్తున్న పాఠాలతో ఆరితేరితేనే విజయం వరిస్తుంది. ఆత్మరక్షణకు తొలి ఆయుధం ఆత్మవిశ్వాసమే.  

 అంతే కాదు...
 ఒక ఒంటరి స్త్రీకి ఈ కింది పరిస్థితులు ఎదురైనప్పుడు ఆమె తన ఆత్మరక్షణ కోసం ఏమి చేయవచ్చో చూద్దాం..
 
 దాడి జరిగితే..
  మొదటి సూత్రం.. భయపడకూడదు. ఎందుకంటే భయంలో ఏం చేయాలో నిర్ణయించుకోలేం. డీలా పడతాం.
  అలాగే ఎదుటి వ్యక్తి దాడి చేయడానికి వస్తుంటే మాటలతో కాల యాపన చేయకూడదు. వాళ్ల బాడీ వీక్ పార్ట్స్ మీద ఎదురు దాడి చేయాలి. చూపుడు వేలు, మధ్య వేలుతో ఎదుటి వ్యక్తి కళ్లల్లో పొడవడం, రెండు తొడల మధ్య ఎటాక్ చేయడం.. వంటివి చేస్తే బాధతో విలవిల్లాడుతాడు. కోలుకోవడానికి టైమ్ తీసుకుంటాడు. ఈలోపు మనం తప్పించుకోవచ్చు.

 ఎదుటి వ్యక్తి మన మీద దాడి చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడే మనం అప్రత్తమవడం మంచిది. మనమే ముందుగా మోచేతితో పొడవడం, పిడికిలి బిగించి ముక్కుమీద గట్టిగా కొట్టడం వంటివి చేయాలి. ఏ వయసు వాళ్లకయినా ఈ కిటుకులు పాటించడం సులువు.
 - రాజేశ్వరి చౌహాన్, కరాటే ట్రైనర్
 
శిక్షే లేదు
 
 ఐపీసీ సెక్షన్ 233 ప్రకారం ఎవరైనా యువతి లేదా మహిళ తాను రేప్‌కు గురయినట్లు లేదా రేప్‌కు గురయ్యే పరిస్థితులలో చిక్కుకున్నప్పుడు ఆత్మరక్షణ కోసం ఆ ఘటనకు పాల్పడే వ్యక్తిని చంపినా లేదా అతని లైంగికావయవాన్ని పనికిరాకుండా చేసినా లేదా తీవ్రంగా గాయపరచినా చట్టం ఆమెను నిందితురాలిగా పరిగణించదు. నిరపరాధిగా వదిలేస్తుంది.
 
 లిఫ్ట్‌లో...
 
 రాత్రిపూట ఒక మహిళా ఉద్యోగి తన కంపెనీ లిఫ్ట్‌లో ఒంటరిగా వేరే ఫ్లోర్‌కి వెళ్లవలసి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో ఆమెతోబాటు ఓ అపరిచితుడు లేదా తన అనుమానించదగ్గ వ్యక్తి ఎదురయ్యాడనుకోండి...
 
అందుకు నిపుణులు ఏం చెబుతున్నారంటే...
ముందు ధైర్యంగా లిఫ్ట్‌లో ప్రవేశించండి. ఆ వ్యక్తితో పాటు మీరు పెనైక్కడో లేదా ఒకవేళ మీరు పైనే ఉంటే కింది ఫ్లోర్‌కి చేరాలనుకోండి.. మీరు చేరవలసిన ఫ్లోర్ కి సంబంధించిన బటన్ మాత్రమే కాకుండా లిఫ్ట్‌లో ఉన్న మిగిలిన అన్ని ఫ్లోర్లకు సంబంధించిన బటన్స్ నొక్కండి. అప్పుడు లిఫ్ట్ అన్ని ఫ్లోర్లలోనూ ఆగుతూ వెళుతుంది కాబట్టి, అవతలి వ్యక్తి మీపై ఏదైనా అఘాయిత్యానికి పాల్పడే ధైర్యం చేయలేడు.
 
 
 ఇంట్లో...
 మీరు ఇంట్లో ఒక్కరే ఉన్నారు. ఓ అపరిచితుడు మీ ఇంట్లోకి చొరబడ్డాడనుకోండి....
 అప్పుడు... వెంటనే వంటింట్లోకి పరిగెత్తండి. కారం డబ్బానో, పసుపు డబ్బానో లేదా కూరలు తరిగే కత్తిపీటనో, చాకునో అందుకోండి. అవేవీ అందుబాటులో లేకపోతే కనీసం చేతికందిన చెంబులు, తపేలాలు అయినా ఆ అగంతకుడి మీదికి విసురుతుండండి. అలా విసిరేసేటప్పుడు పెద్దగా అరవడం మరచిపోకండి. ఆ అలికిడికి లేదా అలజడికి చుట్టుపక్కల వాళ్లు వచ్చేస్తారేమోనన్న భయంతో ఆ వచ్చిన వాడు తోకముడుస్తాడు.
 
 వాహనంలో...
 రాత్రిపూట ట్యాక్సీ లేదా ఆటో ఎక్కాల్సి వచ్చిందనుకోండి... ముందు ఆ వాహనం మీద ఉండే రిజిస్ట్రేషన్ నంబర్ నోట్ చేసుకోండి. ఆ వాహనం ఎక్కి కూర్చున్న తర్వాత మీ మొబైల్ తీసి ఆ ఆటో లేదా ట్యాక్సీ డ్రైవర్‌కి వినిపించేలా మీ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు ఆ వాహనం నంబర్ చెప్పండి. ఒకవేళ మీ ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయకున్నా సరే, మీ వాళ్లతో మాట్లాడుతున్నట్లుగా నటించండి చాలు. మీకు సంబంధించిన వ్యక్తులకెవరికో తన వాహనానికి సంబంధించిన వివరాలు చేరిపోతున్నాయి కాబట్టి ఆ డ్రైవర్‌కు మీపై ఏదయినా దురుద్దేశ్యం ఉన్నా, వెంటనే దాన్ని విరమించుకుంటాడు. అంతేకాదు... మిమ్మల్ని సురక్షితంగా మీరు చెప్పిన చిరునామాకి చేరుస్తాడు.
 
 
సందుగొందుల్లో...
మీరు ఎక్కిన వాహనం డ్రైవర్, ఆ వాహనాన్ని మీరు చెప్పిన చిరునామాలో కాకుండా, మీకు తెలియని ఏవేవో సందుగొందుల్లో తిప్పుతున్నట్లు అనుమానం లేదా మీరేదో అపాయంలో చిక్కుకోబోతున్నారన్న ఊహ వచ్చిందనుకోండి... అప్పుడు వెంటనే మీ చేతిలో ఉండే హ్యాండ్ బ్యాగ్ లేదా మనీ పర్స్‌ను మీరు ధరించిన డ్రెస్ తాలూకు దుపట్టా లేదా చీర అయితే చీర కొంగులో చుట్టి, దాన్ని అతని మెడచుట్టూ బిగించి, గట్టిగా లాగండి. కొద్దిక్షణాల్లోనే వాడు పడిపోతాడు. ఒకవేళ మీ దగ్గర మనీ పర్స్ లేదా హ్యాండ్‌బ్యాగ్ వంటిదేమీ లేదనుకోండి... అప్పుడేం చేస్తారు? వెంటనే అతని షర్ట్ కాలర్ పట్టుకుని గట్టిగా గుంజండి. ఫలితం ఉంటుంది.
 
 వీధిలో....
మీరొక్కరే ఒంట రిగా ఉన్నా..  మిమ్మల్ని ఎవరైనా వెంబడిస్తున్నారన్న అనుమానం వచ్చిందనుకోండి... వెంటనే మీకు దగ్గరలో ఉన్న షాప్ లేదా ఇంటిలోకి వెళ్లిపోండి. ఒకవేళ అది అర్ధరాత్రి అయి, ఆ సమయంలో దగ్గరలో షాపులు, ఇళ్లు ఏమీ లేవనుకోండి, దగ్గరలో ఉన్న ఏటీఎంకి వెళ్లిపోండి. వాటిలో సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి, తమ కదలికలన్నింటినీ కెమెరాలో నమోదవుతాయన్న భయంతో వెంటనే అవతలికి వెళ్లిపోతాడు. వీటన్నింటికన్నా కూడా... ప్రమాదం ఎదురైనప్పుడు బేలగా ఉండటం, భయంతో వణికి పోవడం,  ఏడ్చి పెడబొబ్బలు పెట్టడం లేదా చేయగలిగిందేమీ లేద న్న భయంతో అవతలి వారికి లొంగిపోవడం బిక్క చచ్చిపోవడం కాదు కావలసింది... మానసికమైన తెగువ, ధైర్యం, అప్రమత్తత.
 
 ఆత్మరక్షణకు ఆపద్ధర్మ ఆయుధాలు
 1. నింజా స్పైక్ కీ చైన్... దీన్నే కుబోటన్ అని కూడా అంటారు.  మీ పిడికిలిలో సరిగ్గా అమిరే ఆయుధమిది. ఎల్లవేళలా హ్యాండ్ బాగ్‌లో పెట్టుకోవాల్సిన ఆయుధమిది.
 2. హానీకోంబ్ హెయిర్‌బ్రష్... ైగట్టిగా ఉండే నైలాన్ ఫైబర్‌గ్లాస్‌తో తయారైన దువ్వెన ఇది. జుట్టు చెదిరినప్పుడు దువ్వుకోవడానికి ఎంత పనికొస్తుందో దాడి చేసిన వ్యక్తిని గాయపరిచే ఆయుధంగానూ అంతే ఉపయోగపడుతుంది. అయితే దీన్ని చాలా ఒడుపుగా వాడాల్సి ఉంటుంది.
 3. పాకెట్ నైఫ్...  అర చేతిలో  ఇమిడేంత పరిణామమున్న  పండ్లు కోసుకునే పాకెట్‌నైఫ్‌నీ ఆత్మరక్షణ ఆపద్ధర్మ ఆయుధంగా వాడుకోవచ్చు.  దాడికొస్తున్న వ్యక్తిని గాయపర్చే సాహసం చేయలేకపోయినా కనీసం బెదిరించే ధైర్యమైనా చూపొచ్చు.
 4. పెప్పర్ స్ప్రే...  సెల్ఫ్ డిఫెన్స్‌లో చాలా పాపులర్ అయిన ఆయుధం ఇది. ఇంట్లోనూ తయారు  చేసుకోవచ్చు.  ఉపయోగించడమూ తేలికే. సింపుల్‌గా కంట్లో కొట్టి దర్జాగా వెళ్లిపోవచ్చు.
 ఇవేవీ అందుబాటులో లేనప్పుడు జుట్టుకున్న హెయిర్ పిన్‌ను కూడా ఆయుధంగా వాడొచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement