ఆయుర్వేద కౌన్సెలింగ్
ఇప్పుడు ఉన్న ముసురు వాతావరణంలో క్రిమికీటకాలు పెరిగి ఎన్నో వ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా నీళ్ల విరేచనాలు వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయుర్వేద విధానంలో వీటికి నివారణ, చికిత్స సూచించండి. - వి. శ్రీనివాసశర్మ, విశాఖపట్నం
ఇది ఆషాఢమాసం. వర్షరుతువు. ఈగలు ఎక్కువగా ముసిరే కాలం. జల కాలుష్యానికి పెట్టింది పేరు. కాబట్టి మనం తినే ఆహారపదార్థాలు, తాగే పానీయాలు చాలా పరిశుభ్రంగా ఉండాలి. లేకపోతే వాటి ద్వారానే కడుపులోకి ఇన్ఫెక్షన్లు ప్రవేశిస్తాయి. అంతేకాకుండా ఈ రుతువులో మన ‘జఠరాగ్ని’ సామ్యావస్థలో ఉండదు. కనుక అజీర్ణం సంభవించడానికి అవకాశాలు ఎక్కువ. దీనికితోడు తినుబండారాల్లో వాడే వివిధ రకాల రంగులు, నిల్వ ఉంచడానికి వాడే రసాయనాల్లో కల్తీలు ఎక్కువ. కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకునే వంటకాలు, పానీయాలే తీసుకోవాలి. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. బయట లభించే పదార్థాల జోలికి పోవద్దు.
మానవుని జీర్ణకోశ వ్యవస్థని ‘మహాకోష్ఠం’ అంటారు. మన ఆరోగ్యమంతా దీని క్రియా విశేషంపైనే ఆధారపడి ఉంటుంది. దీంట్లో అత్యంత ప్రధానమైనది ‘జఠరాగ్ని’. సక్రమరీతిలో ఆకలివేయడం, తిన్నది జీర్ణమవడం జరిగితే దానిని ‘సమాగ్ని’ అంటారు. దీని శక్తి తగ్గితే ‘మందాగ్ని’ అంటారు. అప్పుడు కలిగే వ్యాధిని ‘అగ్నిమాంద్యం’ అంటారు. మితిమీరిన శక్తి ఉన్నప్పుడు ‘తీక్షా ్ణగ్ని’ అంటారు. ఒకసారి అతిగానూ, వెంటనే మందంగానూ తేడాలు సంభవిస్తే ‘విషమాగ్ని’ అంటారు. సమాగ్ని ఉన్నప్పుడు మన రోగనిరోధకశక్తి బాగుంటుంది. సూక్ష్మక్రిముల వల్ల వచ్చే రోగాల బారి నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఈ రుతువులో చాలా మంది ఆహార, విహార నియమాలను పాటించకపోవడం వల్ల అజీర్ణం, విరేచనాలు, వాంతులు మొదలైన సమస్యలకు గురవుతారు. కొంతమందిలో వీటితో పాటు జ్వరం, కడుపునొప్పి మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ‘విసూచికా’ అనే వ్యాధికి దారి తీసుస్తుంది. ఇందులో కనిపించే లక్షణాలు కలరా వ్యాధి లక్షణాలను పోలి ఉంటాయి.
విసూచికా వ్యాధి లక్షణాలు: వాంతులు, విరేచనాలు, దప్పిక, ఆవులింతలు, కళ్లు తిరగడం, తలనొప్పి, కడుపులోనొప్పి, ఒళ్లంతా సూదులతో గుచ్చినట్లుగా బాధ, ఛాతీలో బిగబట్టినట్లుగా ఉండటం, శరీరం రంగుమారడం, వణుకు, మూర్ఛ. సుశ్రుత సంహితాః శ్లోకం మూర్ఛా అతిసోరో వమథుః పిపాసా శూలో భ్రమ ఉద్వేష్ఠన జృంభదాహాః వైవర్ణ్య కంపౌ హృదయేరుజశ్చ తస్యాం శిరసశ్చ భేదః ...... విసూతీతి నిగద్యతే
నివారణ: ప్రతిరోజూ తేలికగా జీర్ణమయ్యే, తాజాగా వండిన, పరిశుభ్రమైన ఆహార ద్రవ్యాల్ని, పానియాలను మితంగా తీసుకోవాలి. మరిగించిన నీరు తాగితే మంచిది. అన్నీ ఇంట్లోనే తయారుచేసుకోవాలి. మనకెల్లప్పుడు ‘సమాగ్ని’ ఉండేట్టు జాగ్రత్తపడాలి.
కషాయం: అల్లం, వెల్లుల్లి కషాయం, 30 మిల్లీలీటర్లు (ఆరు చెంచాలు) ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగాలి.
చికిత్స: అజీర్ణపు విరేచనాలకు:
వాము కషాయం - 30 మిల్లీలీటర్లు - రెండుపూటలా ఇదే బజారులో ‘అజామోదార్క’ అనే ద్రవంగా లభిస్తుంది దాడిమాష్టకచూర్ణం: ఒక చెంచా రెండుపూటలా
విసూచికా వ్యాధికి : కర్పూరరస మాత్రలు ఉదయం 2, రాత్రికి 2 లశూనాదివటి (మాత్రలు) లేదా కుటజఘనవటి ఉదయం 1, రాత్రికి 1 ఆనందభైరవీరస (మాత్రలు) ఉదయం 1, రాత్రికి 1
ద్రవాహారం: కొబ్బరినీళ్లు, బార్లీ నీళ్లు, గోధుమజావ, ఉప్పు, కరివేపాకు వేసిన పలుచని మజ్జిగ; ఒక గ్లాసు నీళ్లలో ఒక చెంచా చక్కెర, మూడు చిటికెల ఉప్పు, కొంచెం నిమ్మరసం సలిపి, కొంచెం కొంచెం పదేపదే తాగుతుండాలి.
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్
కార్డియాలజీ కౌన్సెలింగ్
గుండె సమస్యల నివారణకు...
నాకు 35 ఏళ్లు. మా దూరపు బంధువుల్లో ఇద్దరుముగ్గురు కొద్దికాలంలోనే గుండెజబ్బుతో చనిపోయారు. దాంతో నాకు ఆందోళన పెరిగింది. గుండెజబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయగలరు. - సురేశ్‌కుమార్, నిడదవోలు
గుండెజబ్బులు ఉన్న కుటుంబ చరిత్ర గలవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ప్రధాన సూచనలివి... మీలా చిన్న వయసు వారైనప్పటికీ ఇప్పట్నుంచే తరచూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయిస్తూ, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహానికి దూరంగా ఉంటూ, డాక్టర్ సలహాల మేరకు కొన్ని మందులు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకుంటూ ఉండాలి గుండెపోటు రావడానికి డయాబెటిస్ ఒక ప్రధాన కారణం. అందుకే ఆ సమస్య ఉన్నవారు రక్తంలోని చక్కెరను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవడం తప్పనిసరి. రోజూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ, డాక్టర్ సూచన మేరకు వారు సూచించిన వ్యవధిలో క్రమం తప్పకుండా రక్తంలోని చక్కెరలను పరీక్షించుకుంటూ ఉండాలి కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాన్ని బాగా తగ్గించాలి పొగ తాగే అలవాటును పూర్తిగా వదిలేయాలి. అలాగే పొగాకుకు సంబంధించిన ఉత్పాదనలు, వస్తువులను పూర్తిగా మానేయాలి. గుండెజబ్బుల నివారణలో ఇది చాలా ప్రధానం డాక్టర్ సూచనల మేరకు శరీరానికి మరీ శ్రమ కలిగించకుండా చేసే వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలి మన ఒంటి బరువును పెరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఒంటికి అందేలా సమతులాహారం తీసుకోవాలి ఆరోగ్యకరమైన జీవనశైలిని తప్పనిసరిగా పాటించాలి. ఈ కొన్ని జాగ్రత్తలతోనే చాలావరకు గుండెజబ్బులను నియంత్రించవచ్చు. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు తమ డాక్టర్లు సూచించిన మందులను తప్పక వాడుతుండాలి. ఆరోగ్యంలో ఏమాత్రం తేడా ఉన్నట్లు అనిపించినా డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి.
డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాసిత్పటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్.